Princess Diana Death Mystery: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచిన వారిలో ఒకరు డయానా స్పెన్సర్… రాజకుటుంబపు ఒత్తిళ్లనూ, బాధలనూ భరించిన ఒక దృఢమైన మహిళ. ఆమె జీవితంలో ప్రేమ, పెళ్లి, బాధ, విడాకులు, మానవతా సేవలు, మరణం..అన్నీ కూడా ఒక డ్రామా తరహాలో సాగాయి. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో జరిగిన యదార్ధ ఘటనలు, ఆమె డెత్ వెనుక ఉన్న మిస్టరీ గురించి తెలుసుకుందాం.
![]() |
Princess Diana |
లండన్‌కు 112 కి.మీ దూరంలో ఉన్న నార్తాంప్టన్ షైర్ లో, సుమారు పదమూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 500 ఏళ్ల నాటి ఆల్తోర్ప్ ఎస్టేట్‌లో గుర్తు తెలియని చోట ఆమె భౌతికకాయాన్ని ఖననం చేశారు. డయానా తన 36వ ఏట మరణించారు. ఆమె జీవితంలో ప్రతి ఏడాదికి గుర్తుగా అక్కడి ‘రౌండ్ ఓవల్’ కొలను చుట్టూ 36 ఓక్ చెట్లను నాటారు. ఇవి ప్రస్తుతం 27 ఏళ్ల వయసు కలిగిన వృక్షాలుగా ఎదిగాయి. వైట్ వాటర్ లిల్లీలు, గులాబీ పూల మొక్కలు ఆ ప్రాంతాన్ని అలంకరిస్తున్నాయి. ఇవన్నీ డయానా కోరుకున్న “మరణానంతర ప్రశాంతత”ను ఆమెకు అందిస్తూ ఉండొచ్చు. కానీ, ప్రశాంతత కన్నా ముందు ఆమె జీవితంలో ప్రేమ కోసం పరితపించారు.. ముఖ్యంగా భర్త ప్రేమ కోసం.
Also Read: దేశ భద్రత కోసం తన జీవితం త్యాగం చేసిన భారతీయ గూఢచారి
Photo of Princess Diana's Childhood
డయానా చిన్ననాటి జీవితం
డయానా స్పెన్సర్ 1961 జూలై 1న ఇంగ్లండ్‌లోని నార్ఫొక్ సమీపంలోని పార్క్ హౌస్ లో జన్మించింది. ఆమె బ్రిటన్‌కు చెందిన ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటి నుంచే సున్నితమైన స్వభావం, సంగీతం, డాన్స్ మీద మక్కువ ఉన్న డయానా స్కూలింగ్ తర్వాత కొంతకాలం కింద స్థాయి ఉద్యోగాలు చేసింది. చిన్నారులకు డాన్స్ చెప్పే ట్యూటర్ గా కూడా పని చేసింది. ఆమె జీవితానికి మలుపు తిప్పింది మాత్రం బ్రిటిష్ యువరాజు చార్లెస్‌తో పరిచయం. డయానా మొదట చార్లెస్ సోదరి స్నేహితురాలు. కానీ ఆ పరిచయం కొద్దికొద్దిగా ప్రేమగా మారింది. 1980లో వారి ప్రేమ వార్తలు బహిర్గతం అయ్యాయి. చార్లెస్ కంటే డయానా 12 ఏళ్లు చిన్నది. అయినా వారికి పెళ్లి అనేది మతపరంగా, రాజకీయపరంగా బ్రిటన్‌కు పెద్ద అడ్డంకిగా మారలేదు.
![]() |
Lady Diana And Prince Charles Wedding |
బ్రిటన్ రాకుమారుడు చార్ల్స్‌తో డయానా 1981లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రపంచం మొత్తం వీక్షించేలా రాజసంగా జరిగిన వారి వివాహం ‘ఫెయిరీ టేల్ వెడ్డింగ్’గా చరిత్రలో నిలిచిపోయింది. కానీ 1996లో వారు విడాకులు తీసుకున్నారు. ఎంతటి రాయల్టీ అయినా సరే… ప్రేమ ముందు ప్రతి మహిళ మామూలే అవుతుంది. భర్త తనను కాకుండా మరొకరిని ప్రేమిస్తున్నాడన్న స్పష్టతతో, కోపంతో డయానా కూడా మరొకరిని ప్రేమించేందుకు ప్రయత్నించారు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు.. మొత్తంగా ప్రపంచాన్నే ప్రేమించారు… ఒక్క భర్తను మినహాయించి.
![]() |
Photos of Princess Diana Playing with Young William & Harry |
డయానాకు ఇద్దరు కుమారులు. ప్రిన్స్ విలియం (1982), ప్రిన్స్ హ్యారీ (1984). తన పిల్లల మీద ఆమె చూపిన ప్రేమ, అభిమానం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశాల్లో ఒకటి. రాయల్స్ లో ఉండే ఓ తల్లి కూడా సాధారణ తల్లిలాగే తన పిల్లల్ని ప్రేమిస్తుందన్న సందేశాన్ని ఆమె నిలబెట్టింది.
డయానా కు ఒక ఆశ ఉండేది..ఎప్పటికైనా భర్త తన ప్రేమ కోసం తిరిగి వస్తాడని. కానీ ఆయన అలా వచ్చేవాడు అయితే, మొదట తనను ఎందుకు పెళ్లి చేసుకునేవాడు? డయానా కన్నా ముందే ఆమె అక్క శారా స్పెన్సర్‌ని ప్రేమించాడు చార్ల్స్. ఆ తర్వాత డయానా ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. చివరికి డయానా ఉండగానే కామిల్లా పార్కర్ ని కూడా ప్రేమించి, ఎఫైర్ పెట్టుకున్నాడు. మనిషిగా తన భార్యతో ఉన్నా, మనసు మాత్రం ఎప్పుడూ కామిల్లా చుట్టూ తిరిగేది. ఇది అంతా డయానా కళ్ల ముందే జరిగిన ఘటనే. అటువంటి క్షణాల్లో ఏ భార్య అయినా… మానసికంగా కృంగిపోవడం సహజం.
![]() |
Princess Diana and Prince Charles |
Also Read: అభిమన్యుడు ఎందుకు తిరిగి రాలేకపోయాడు? పద్మవ్యూహం వెనక అసలైన రహస్యం!
అది నా వ్యక్తిగత విషయం
చార్లెస్ ఎక్కడికి వెళ్తున్నాడో డయానాకు తెలిసే ఒక రోజు ధైర్యంగా అడిగింది..“ఆమె దగ్గరినుంచేనా?” అని. ‘ఆమె’ అంటే కామిల్లా. వెంటనే చార్లెస్ స్పందన.. “అది నా వ్యక్తిగత విషయం” అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య ‘వ్యక్తిగత విషయం’ ఉంటుందంటే, అది ప్రేమ లేదు అన్నదానికి సంకేతం అని డయానా భావించింది.
ఆత్మహత్యకు యత్నం
పెళ్లైన కొన్ని రోజుల్లోనే డయానా తన మణికట్లు బ్లేడుతో కోసుకున్న సంఘటన దారుణం. చేతుల నుంచి రక్తం కారుతుంటే పక్కవాళ్లు గమనించినా, చార్లెస్ మాత్రం పట్టించుకోలేదు. అప్పటికి చార్లెస్ మదిలో కామిల్లా ఉంది. హనీమూన్ కే ఆసక్తి లేకుండా బయలుదేరిన డయానా తన ఫ్రెండ్స్‌కి రాసిన ఓ లెటర్‌లో“హనీమూన్‌కు వెళ్తున్నాం. హాయిగా నిద్రపోవడానికి” అని ఆ లెటర్ లో పేర్కొంది.
![]() |
Princess Diana suffered from depression |
మానసికంగా కృంగిపోయిన డయానా
రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన డయానా జీవితంలో వెలుగు కన్నా చీకటితో గడిపిన రోజులే ఎక్కువయ్యాయి. ఒంటరి జీవితం, మీడియా ఒత్తిడి, చార్లెస్ ప్రవర్తన ఇవన్నీ ఆమె మనోస్థితిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆమె "ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్"గా తన బాధలను దాచుకుంటూ రాజకుటుంబ సభ్యురాలిగా, సాధారణ జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేసింది.
డయానా, చార్లెస్ మధ్య వయస్సు వ్యత్యాసం 13 సంవత్సరాలు. ఇది మానసికంగా తేడా తెచ్చిందా? అని అనుకుంటే.. కానే కాదు. ఎందుకంటే, అసలైన విషయం ఏంటేంటే డయానా మీద ప్రిన్స్ చార్లెస్ కి ప్రేమ లేకపోవడమే. డయానా చార్లెస్‌ను గాఢంగా ప్రేమించింది. కానీ అతనిలో ప్రేమ కనబడకపోవడంతో, ఆమె లోలోపల కుమిలిపోయింది. “డయానా… నీ ఎముకలు కనబడుతున్నాయి, ఏంటిలా బలహీనంగా కనిపిస్తున్నావ్?” అని స్నేహితులు అడిగినప్పుడు ఆమె ముఖంపై ఒక సన్నని చిరు నవ్వు మాత్రమే కనిపించేది. ఇవన్నీ ఆమె పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఎదుర్కొన్న బాధలు. ఈ సంఘటనలు ఇప్పుడు, రెండు దశాబ్దాల తర్వాత ఆమె సన్నిహితుల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?
డయానా మరణం
అయితే, 1997 ఆగస్టు 31న పారిస్‌లోని ఓ సొరంగ మార్గంలో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరణించారు. ఇది ప్రపంచపు అత్యంత విస్మయపరచిన, చర్చించబడిన మరణాల్లో ఒకటిగా మారింది.
![]() |
1997 Princess Diana dies in a car crash |
ప్రమాదానికి ముందు రాత్రి, డయానా తన ప్రియుడు డోడీ అల్-ఫయేద్‌తో కలిసి పారిస్‌లోని హోటల్ Ritz వద్ద ఉండి, ఆ తరువాత ఇద్దరూ ఓ మర్సిడెస్ బెంజ్‌లో హోటల్ వెనుక ద్వారంనుండి బయటికి వెళ్లారు. మితిమీరిన పాపరాజ్జీలు వెంటపడుతుండగా, వారి డ్రైవర్ హెన్రీ పౌల్ హైస్పీడ్‌లో కారును నడిపాడు. ట్రాఫిక్ టన్నెల్‌లోకి ప్రవేశించిన కారు, ఓ స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
అంతు చిక్కని ప్రశ్నలు
డయానా మృతి వెనుక అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నాయి. ప్రమాదంలో డ్రైవర్ హెన్రీ పౌల్, డోడీ అల్-ఫయేద్ అక్కడికక్కడే మృతి చెందారు. డయానా గుండెపై తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడినా, కొద్దిసేపటికే మృతిచెందారు. అధికారిక నివేదిక ప్రకారం, డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని, అతని అధిక వేగం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు.
మృతి వెనుక అనుమానాలు
అయితే... ఈ ప్రమాదం పట్ల అనేక అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ రాజ కుటుంబం ఈ ఘటన వెనుక ఉందని డోడీ అల్-ఫయేద్ తండ్రి మొహమ్మద్ అల్-ఫయేద్ ఆరోపించారు. డయానా అప్పటికే గర్భవతిగా ఉన్నారని, రాజ కుటుంబానికి ఇది ఇష్టంగా లేకపోవడంతో కుట్ర జరిగిందని ఆయన వాదన. 2004లో Operation Paget పేరుతో బ్రిటన్ ప్రభుత్వం ఈ కేసును విచారించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం ఇది ‘ప్రమాదవశాత్తూ జరిగిన మృతి’ అని తేల్చింది. అయినా ప్రజల్లో ఆ అనుమానాల ముద్ర చెరిగిపోలేదు.
![]() |
Princess Diana Death Mystery |
చివరి లేఖ
1995లో డయానా తన వ్యక్తిగత సెక్రటరీకు రాసిన ఓ లేఖలో, “నన్ను కారు ప్రమాదంలో చంపే కుట్ర జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది” అని పేర్కొంది. ఈ లేఖ పట్ల ఇప్పటికీ తీవ్రమైన అనుమానాలు అయితే ఉన్నాయి.
ఇంకా వీడని మిస్టరీ
డయానా మృతితో పాటు పాపరాజ్జీ సంస్కృతి, మీడియా పాత్రలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె మరణం మానవ సంబంధాలపై, ప్రైవసీ పై, రాజకీయ, మీడియా సంబంధాలపై ప్రపంచాన్ని ఆలోచించేలా చేసింది. అంతిమంగా, డయానా మరణం ఒక వాస్తవం అయితే, దాని వెనుక మిస్టరీ మాత్రం ఇప్పటికీ పూర్తిగా వీడలేదు. కాలంతో పాటు చాలా విషయాలు మరిచిపోతున్నా, డయానా కథ మాత్రం ఎన్నడూ మరువలేనిది. ఒక యువరాణిగా కాకుండా, ఒక మానవతా మూర్తిగా ఆమె ప్రజల హృదయాల్లో ‘ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ గా పదిలంగా నిలిచిపోతుంది.
Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS