The Untold Sacrifice of Barbarik: స్కంద పురాణం ప్రకారం బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడు, భీముడి మనుమడు. అతని తల్లి పేరు మౌర్వి. వాస్తవానికి బర్బరీకుడు యక్షుడిగా పూర్వజన్మలో జన్మించి, తరువాత మనిషిగా పుట్టాడు. అతని ధర్మం బలహీనమైన పక్షాన నిలబడి పోరాడటమే. ఈ సూత్రం కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా పోరాడకుండానే సాక్షిగా నిలిచాడు.
![]() |
The Untold Sacrifice of Barbarik |
చిన్న వయసులోనే యుద్ధ విద్యలో అతడు అపార ప్రతిభ చూపాడు. అస్త్ర శస్త్రాలలో అతని నైపుణ్యం చూసి దేవతలు ముగ్ధులై, అతనికి మూడు బాణాలను ప్రసాదించారు. ఈ మూడు బాణాలతో ముల్లోకాలలో ఎవ్వరూ అతనిని జయించలేరని వరమిచ్చారు.
ఆ బాణాల ప్రత్యేకత ఏమిటంటే..
- మొదటి బాణం శత్రువును గుర్తిస్తుంది,
- రెండవది రక్షించాల్సిన వారిని గుర్తిస్తుంది,
- మూడవది శిక్షను అమలు చేస్తుంది.
ఇంతలో కురుక్షేత్ర సంగ్రామ సమయం రాగా, ప్రతీ యోధుడు ఏదో ఒక పక్షంలో నిలబడవలసి వచ్చింది. బర్బరీకుడూ యుద్ధంలో పాల్గొనాలనే సంకల్పం వ్యక్తం చేశాడు. అతని బలాన్ని తెలిసిన తల్లి, ఎప్పుడూ బలహీనమైన పక్షానికే సహాయం చేయమని సూచించింది. సంఖ్యాపరంగా పాండవులు బలహీనంగా ఉండటంతో, వారితో చేరేందుకు బయల్దేరాడు. అయితే బర్బరీకుడు యుద్ధరంగంలో అడుగుపెడితే ఫలితాలు మారిపోతాయని గ్రహించిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణ వేషంలో అతనికి ఎదురయ్యాడు.
“మూడే మూడు బాణాలతో యుద్ధానికి వెళ్తావా?” అంటూ ఎగతాళి చేశాడు కృష్ణుడు.
దానికి బర్బరీకుడు.. “ఈ మూడు బాణాలతో నిమిషంలో యుద్ధాన్ని ముగించగలను” అని వివరిస్తూ, తన శక్తిని నిరూపించడానికి సిద్ధపడ్డాడు. కృష్ణుడు పరీక్షిస్తూ, “ఈ చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ మొదటి బాణంతో గుర్తించు” అని అన్నాడు.
బర్బరీకుడు బాణం విడిచగానే చెట్టు ఆకులన్నింటినీ గుర్తించడంతో పాటు, కృష్ణుని పాదం కింద దాగి ఉన్న ఆకుని కూడా గుర్తించింది. దీన్ని చూసి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు.
అప్పుడే కృష్ణుడు గ్రహించాడు.. బర్బరీకుడు యుద్ధంలో ఉంటే, పాండవుల పక్షాన ఉన్నా లేదా కౌరవుల పక్షాన ఉన్నా, అతడి శక్తివల్ల ఇతర యోధులు ఎవ్వరూ మిగలరని. అందుకే అతనికి స్పష్టంగా చెప్పాడు.. “నీ ఉద్దేశ్యం మంచిదే కానీ, నువ్వు సహాయం చేసే పక్షం వెంటనే బలవంతమవుతుంది. అలా మారుస్తూ పోతే, చివరికి నువ్వే ఒక్కడివే మిగిలిపోతావు.”
దాంతో బర్బరీకుడు చిరునవ్వుతో.. “మరి నీకేం కావాలి?” అని అడగగా, కృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుని తల బలిగా కావలసి ఉందని, అంతటి బలవంతుడు మరెవ్వరూ లేరని, అందుకే అతని తలను ఇవ్వమని అడిగాడు. కృష్ణుడే అని గుర్తించిన బర్బరీకుడు, ఎలాంటి ఆలోచన లేకుండా తన తలను బలి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ తనకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలనే కోరిక ఉందని, దానిని తీర్చమని కోరాడు. అలా బర్బరీకుడి తల సంగ్రామానికి సాక్షిగా నిలిచింది.
శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి, బర్బరీకుడి తలను ఎత్తైన పర్వతంపై ఉంచాడు. యుద్ధం పూర్తైన తర్వాత ఆ తల రాజస్థాన్ ప్రాంతంలో లభించిందని, అక్కడి రాజు దేవాలయం నిర్మించాడని పురాణాల్లో ఉంది. పాండవుల విజయంలో బర్బరీకుడి ప్రాణత్యాగం ముఖ్య పాత్ర వహించిందని చెబుతారు. ఆ ప్రాంతంలో ఆయనను ఖాటు శ్యాం పేరుతో పూజిస్తారు.
కృష్ణుడు ఇలా వివరించాడు.. బర్బరీకుడు పూర్వజన్మలో శపించబడిన యక్షుడు. అతని తల కోరటం వలన శాప విమోచనం కలిగిందని. అదేకాక, కలియుగంలో తన పేరుతోనే ఆయన పూజలందుకుంటాడని, ఆయనను జపిస్తే భక్తుల కష్టాలు తొలగిపోతాయని వరమిచ్చాడు.
ఒక విశ్వాసం ప్రకారం, బర్బరీకుడి బాణం కృష్ణుని పాదం చుట్టూ తిరగడం వల్ల ఆయన కాలు శరీరమంతా బలహీనమైందని చెబుతారు. అవతార సమాప్తి సమయం రాగానే, అదే కాలికి బాణం గుచ్చుకోవడం వలన కృష్ణుని అవతారం ముగిసిందని విశ్వాసం ఉంది.
దక్షిణ భారతంలో ఖాటు శ్యాం గురించి తెలిసిన వారు తక్కువ. కానీ ఉత్తర భారతంలో, అలాగే నేపాల్‌లో కూడా ఖాటు శ్యాం బాబాను ఆరాధించే భక్తులు అనేకం. శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందిన ఈ దేవుని స్మరించుకుంటే కోరికలు తీరతాయని, మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించిన ఆయనకు భక్తుల కష్టాలను తొలగించడం తేలికేనని నమ్మకం.
Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS