Abhimanyu Chakravyuha Secret: అభిమన్యుడు ఎందుకు తిరిగి రాలేకపోయాడు? పద్మవ్యూహం వెనక అసలైన రహస్యం!

Abhimanyu Chakravyuha Secret: పద్మవ్యూహం’ అనే పదాన్ని మనం తరచుగా వాడుతుంటాం. ఎవరైనా తీవ్రమైన సమస్యల బారిన పడితే “పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు” అని అంటాం. అంటే.. అది బయటపడలేని సమస్య అని అర్థం. కానీ అసలైన పద్మవ్యూహం అంటే ఏమిటో తెలుసుకుంటే, అది ఎంత భయంకరమైనదో అర్థమవుతుంది. పద్మవ్యూహం అంటే ఏదో సాధారణ వ్యూహం కాదు… అది అతిరథ మహారథులకే అంతుపట్టని మృత్యుజాలం. లోపలికి వెళ్తే మరణాన్ని ఆహ్వానించాల్సిందే. వలయాకారంగా ఉండే దీనిని "చక్రవ్యూహం" అని కూడా అంటారు. ఏడు వలయాలుగా రూపొందిన ఈ వ్యూహంలో రథ, గజ, తురగ, పదాతి సైన్యాల భద్రతతో శత్రువు ప్రవేశించలేని నిర్మితి. అసలు కురుక్షేత్రంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు?

Abhimanyu Chakravyuha Secret

ద్రోణుడు సృష్టించిన పద్మవ్యూహం

భీష్ముని మరణానంతరం, కౌరవ సేనాధ్యక్షుడిగా ద్రోణుడు నియమితుడవుతాడు. రెండు రోజుల యుద్ధానంతరం కూడా ధర్మరాజును బంధించలేకపోవడంతో దుర్యోధనుడు ద్రోణుని హేళన చేస్తాడు. ఈ మాటలతో తీవ్రంగా దుఃఖించిన ద్రోణుడు, "ఈరోజు నేను ఒక అజేయ వ్యూహాన్ని ఏర్పాటు చేస్తాను. దానిని దేవతలు కూడా ఛేదించలేరు. కేవలం మహావీరులకే అది అర్థమవుతుంది" అని ప్రకటిస్తాడు. అదే పద్మవ్యూహం.

వ్యూహ నిర్మాణం

ద్రోణుడు కౌరవ సైన్యాన్ని తామరపువ్వు ఆకారంలో నిలబెడతాడు. వివిధ రాజులు రేకుల్లా, వారి కుమారులు తామర మధ్య భాగంలో కేసరిలా నిలబడతారు. కర్ణుడు, దుశ్శాసనుడు లోపల, దుర్యోధనుడు మధ్య భాగంలో సైన్యంతో పాటు ఉన్నాడు. సైంధవుడు, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు, శకుని, శల్యుడు, శలుడు, భూరిశ్రవుడు ఇలా ప్రతి యోధుడికీ ద్రోణుడు ప్రత్యేక స్థానాల్ని కేటాయిస్తాడు.

అభిమన్యుడిని పంపిన ధర్మరాజు

ఈ ఘట్టంలో ధర్మరాజు అభిమన్యుడిని పంపడం తప్పనిసరి అవుతుంది. "ఈ వ్యూహాన్ని ఛేదించగలిగే వారు నువ్వు, నీ తండ్రి అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడే. "నువ్వు వ్యూహంలోకి ప్రవేశించు" అని అభిమన్యుడిని ధర్మరాజు కోరుతాడు. అభిమన్యుడు ఉత్సాహంగా స్పందిస్తూ, "నా తండ్రి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే నేర్పాడు, కానీ నేను చొచ్చుకుపోతాను" అని చెబుతాడు. సారథి సుమిత్రుడు అతన్ని ఆపేందుకు ప్రయత్నించినా వినడు. అగ్నిగోళంలా చెలరేగి పద్మవ్యూహంలోకి దూసుకుపోతాడు.

Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?

వ్యూహం లోపల అభిమన్యుని వీరగాథ

అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదిస్తూ కౌరవ సైన్యాన్ని చీల్చి వేస్తాడు. కర్ణుని కవచాన్ని ఛిన్నా భిన్నం చేస్తాడు. దుర్యోధనుడు అతడి ధాటికి పారిపోతాడు. అభిమన్యుని వెంట పాండవులు కూడా లోపలికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ కౌరవుల బావమరిది సైంధవుడు అడ్డుపడతాడు. అతనికి పరమేశ్వరుడిచ్చిన వరం"అర్జునుడిని మినహాయించి మిగతా పాండవులను ఒక రోజు నిలువరించగలగడం" శక్తిగా మారుతుంది. సైన్యం వెనుతిరుగుతుంది. వ్యూహ పథకం ప్రకారం, ఆ రోజు అర్జునుడిని యుద్ధ భూమికి దక్షిణ దిశలో తరలిస్తారు.

Chakravyuha in Mahabharatha

యుద్ధ నీతిని ఉల్లంఘించిన కౌరవులు

అభిమన్యుని ధాటికి తట్టుకోలేని ద్రోణుడు, అతనిపై కపటంగా దాడి చేయాలని సూచిస్తాడు. యుద్ధ నియమాలను పక్కన పెట్టి, కౌరవ సేనలు అభిమన్యుడిపై సమూహ దాడి చేస్తాయి. ఆయుధరహితుడిని చేసి బాణాలు వదులుతారు. అయినా అభిమన్యుడు రథ చక్రాన్ని ఆయుధంగా మార్చి పోరాడతాడు. చివరికి చక్రాన్ని కూడా విరగగొట్టడంతో, దుశ్శాసనుని కుమారుడితో గదాయుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోతాడు. ఈ వార్త విని దుర్యోధనుడు హర్షాతిరేకంలో సంబరాలు చేసుకున్నట్లు చెబుతారు.

అభిమన్యుడికి వ్యూహం ఎలా తెలుసు?

పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర ‘ఊ కొడుతూ’ నిద్రపోయింది. అయితే, ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ‘ఊ కొట్టడం’ మొదలు పెట్టాడు. అది గమనించన అర్జునుడు పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెబుతాడు..ఆ తర్వాత సుభద్ర నిద్రపోవడం గమనించి చెప్పడం ఆపేశాడు. అందుకే అభిమన్యుడికి లోపలికి వెళ్ళడమే తెలిసి, బయటపడే మార్గం తెలియలేదు. 

అభిమన్యుడి కథలోని పాఠం

"ఇప్పుడు తెలుసుకొని ఉపయోగం ఏంటి?" అనుకునేవారికీ అభిమన్యుడి కథలో చాలా పాఠాలు ఉన్నాయి. మనం ఎంత తెలుసు అన్నది కాదు తెలిసినదాన్ని సరిగ్గా వాడామా అన్నదే ముఖ్యం. జీవితంలో ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ అనుకున్నట్టే జరగవు. అప్పుడు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం అవసరం. ఎంతటి కష్టం అయినా పోరాడాలి. నిజమైన పోరాటం అంటే ఓడిపోయేదాకా కాదు ఊపిరి ఆగేదాకా పోరాడాల్సినది. అభిమన్యుడి క్యారెక్టర్ మాత్రమే కాదు మహాభారతంలోని ప్రతి పాత్ర, ప్రతి ఘట్టం మన సమాజానికి అద్దంపట్టినట్లు చూపెడుతుంది. ప్రేమ, మోసం, ధర్మం, కపటం, నిజాయితీ… అన్నింటినీ మానవ జీవితం కోసం నేర్పే గాథ మహాభారతం.

Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post