Hongqi: చైనాలోని టియాంజిన్ నగరంలో ప్రస్తుతం షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు రోజుల పర్యటన గుర్తుగా ఓ ప్రత్యేక బహుమానాన్ని అందించింది. అది ‘హాంగ్కీ L-5’ లగ్జరీ కారు. చైనాలో దీనిని ‘రెడ్ ఫ్లాగ్’ అని పిలుస్తారు. ఈ కారు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కి ఎంతో ఇష్టమైనది. ఆయన అధికారిక ప్రయాణాల కోసం తరచుగా ఇదే వాహనాన్ని ఉపయోగిస్తారు.
‘హాంగ్కీ L-5’ చైనా ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తుంది. దీని చరిత్ర 1958లో ప్రారంభమైంది. ఆ కాలంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతల కోసం ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని FAW (First Automotive Works) కంపెనీ ఈ లగ్జరీ వాహనాన్ని తయారు చేస్తోంది. 2019లో మహాబలిపురంలో మోదీ-జిన్‌పింగ్ సమావేశం సందర్భంగా కూడా ఈ కారునే ఉపయోగించారు.
Also Read: చైనాలో ప్రధాని మోదీ పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక భేటీ!
ఆగస్టు 31న జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ మరియు జిన్‌పింగ్ పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. “పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో సంబంధాలను అభివృద్ధి చేస్తాం. రెండు దేశాల మధ్య సహకారం 2.8 బిలియన్ ప్రజలకు ఆర్థిక, సామాజిక స్థాయిలో ప్రయోజనం కలిగిస్తుంది” అని మోదీ స్పష్టం చేశారు.
సరిహద్దు సమస్యలు తగ్గి, ప్రస్తుతం శాంతి వాతావరణం నెలకొనడం సానుకూల పరిణామమని మోదీ పేర్కొన్నారు. అమెరికా-చైనా సుంకాల వివాదం తర్వాత ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం లభించింది.
ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమ్మిట్‌లో తన ప్రత్యేక అధ్యక్ష వాహనం ‘ఆరస్’లో హాజరయ్యారు. రష్యన్ కంపెనీ Aurus Motors రూపొందించిన ఈ లగ్జరీ కారు, ఆధునిక సాంకేతికతతో పాటు రెట్రో డిజైన్ కలిగి ఉంటుంది. రష్యా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వాహనం, రాయల్ లుక్‌తో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read: అమెరికా ఒత్తిడికి భారత్ ఇచ్చిన చరిత్రాత్మక సమాధానాలు!