Historical US India Conflicts: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురుపై 50% సుంకం విధించారు. దీని వెనుక ఉద్దేశ్యం భారత్‌పై ఒత్తిడి పెంచడమే. అయితే భారత్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. చమురు సరఫరా విషయంలో దేశ ఇంధన భద్రతే ప్రాధాన్యం అని నిలదీస్తోంది.
![]() |
Lal Bahadur Shastri, Indira Gandhi & Atal Bihari Vajpayee |
గతంలోనూ అమెరికా ఒత్తిడులకు తలొగ్గని భారత్
భారత్ చరిత్రలో అమెరికా ఒత్తిడి కొత్తది కాదు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి నాయకులు కూడా అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ధీటుగా ఎదుర్కొన్నారు. ప్రతి సందర్భంలోనూ దేశ స్వాభిమానాన్ని కాపాడి, స్వతంత్ర నిర్ణయాధికారాన్ని రుజువు చేశారు.
1965 - శాస్త్రి ధైర్యసాహసం
1965లో భారత్- పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో దేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంది. అమెరికా గోధుమల సరఫరాను నిలిపివేస్తామని బెదిరించి, యుద్ధం ఆపమని ఒత్తిడి చేసింది. అయితే అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వెనుకడుగు వేయలేదు.
‘జై జవాన్, జై కిసాన్’ నినాదంతో దేశ ప్రజల మనోబలాన్ని పెంచి, వారిని ఐక్యం చేశారు. ఒక పూట ఉపవాసం చేయమని పిలుపునిస్తూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఈ సంఘటన భారత స్వావలంబనకు ప్రతీకగా నిలిచింది.
![]() |
Pokhran 1974 - India First Nuclear Test |
1971 - ఇందిరా గాంధీ ధీరత్వం
1971లో జరిగిన భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్‌కు మద్దతుగా నావికా దళాన్ని భారత సముద్ర సరిహద్దులకు పంపింది. ఇందిరా గాంధీ మాత్రం రష్యా మద్దతుతో ఈ ఒత్తిడిని ఎదుర్కొని, బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసే విజయం సాధించారు.
1974లో భారత్ తొలి అణు పరీక్ష (పోఖ్రాన్–1) నిర్వహించగా, అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. అయినా ఇందిరా గాంధీ స్వదేశీ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టి, రష్యా సహకారంతో అణు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సంఘటన భారత స్వతంత్ర నిర్ణయాధికారాన్ని మరింత బలపరిచింది.
![]() |
Indira Gandhi: 1971 Indo-Pak War |
1998లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారత్ పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపింది. దీనికి ప్రతిగా అమెరికా ఆయుధ ఎగుమతులపై నిషేధం, ఆర్థిక ఆంక్షలు విధించింది. వాజ్‌పేయి మాత్రం దేశ భద్రత కోసం ఈ పరీక్షలు అవసరమని స్పష్టం చేశారు.
1999 నాటికి భారత్ ఆంక్షలను ఎదుర్కొని, అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచింది. 2000లో బిల్ క్లింటన్ భారత్ పర్యటనతో ద్వైపాక్షిక బంధం మరింత బలపడింది.
![]() |
Pokhran II - 1998 |
నేటి సవాల్‌కు భారత సమాధానం
చరిత్ర సాక్షిగా భారత్ అమెరికా ఒత్తిడులను ఎప్పుడూ ధైర్యంగా ఎదుర్కొంది. తాజాగా ట్రంప్ విధించిన 50% సుంకాలను ‘అన్యాయం, న్యాయవిరుద్ధం’గా ఖండిస్తూ, దేశ ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
శాస్త్రి, ఇందిరా, వాజ్‌పేయి నాయకత్వం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్, ఈ సవాల్‌ను కూడా దౌత్యపరంగా, స్వావలంబనతో అధిగమించే సామర్థ్యం కలిగి ఉంది.