Shambhala Mystery: శంభల నగరం గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!

Shambhala Mystery: ఇతిహాసాల్లో దాగిన ఓ మిస్టరీ. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరాన్ని చూసినవారు చాలా తక్కువమంది. భారతదేశానికి ఎగువన ఉన్న ఈ రహస్య నగరంపై హిట్లర్‌ కూడా కన్నేశాడన్నది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. కానీ దాన్ని కనిపెట్టలేక నిరుత్సాహంతో వెనుదిరిగాడు. మరి, ఈ శంభల నగరం ఎక్కడుంది? దాని వెనుక నిజాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

Shambhala Mystery
Shambhala Mystery

భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలయంగా ఉంది. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతం భారతీయుల దృష్టిలో పవిత్రమైన పర్వత శ్రేణి. గంగా వంటి పవిత్ర నదులు జన్మించిన ఈ భూమిలో కొలువైన పరమశివుని కైలాశ పర్వతం, మానస సరోవరంతో పాటు, శంబళ అనే రహస్య నగరం కూడా ఉన్నదనే విషయం చాలామందికి తెలియదు. ఇది కేవలం మానవ చరిత్ర కాదు… పురాణాల వరకూ వెళ్లిన ప్రాచీన కథ. విష్ణు పురాణాల్లో ఈ నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. కలియుగంలో కల్కి అవతారం జరిగే ప్రదేశంగా ఈ నగరాన్ని పేర్కొనడం విశేషం.

శంభల అంటే ఏమిటీ?

శంభల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీనిని ‘షాంగ్రిల్లా’గా పిలుస్తారు. హిందూ పురాణాల్లో దీన్ని ‘సిద్ధాశ్రమం’గా, ‘భూలోక త్రివిష్టపం’గా పేర్కొన్నారు. ‘త్రివిష్టకం’ అంటే స్వర్గం. దేవతలు తిరుగాడే పవిత్ర భూమిగా ఈ ప్రాంతాన్ని భావించారు. కాలక్రమేణా పేరు మారుతూ చివరికి ఇది ‘టిబెట్’గా స్థిరపడింది. ఇండియా ఉత్తర సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని "రూప్ ఆఫ్ ద వరల్డ్"గా కూడా పిలుస్తారు. బౌద్ధులు ఎక్కువగా నివసించే ఈ ఎత్తైన పీఠభూమిలో, మానస సరోవరం, కైలాశ పర్వతం సమీపంలోనే శంభల నగరం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇది సాధారణులకు కనిపించదు. కేవలం కొందరికి మాత్రమే కనిపిస్తుంది.

యోగశక్తి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం

అక్కడ ప్రవేశించాలంటే మానవుడు పూర్తిగా పుణ్యాత్ముడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసలు పాటించేవారికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. యోగ సాధన చేయడం ద్వారా శరీరంలో ఉన్న సుషుమ్న నాడి తెరుచుకున్నవారికి మాత్రమే శంభలలోకి ప్రవేశం సాధ్యమవుతుంది. సాధారణ జనులకు అది అసాధ్యం.

తపోభూమి శంభల

అగస్త్య, వశిష్ట, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్ర వంటి మహర్షులతో పాటు అచ్చుతానంద, విశుద్దానంద, మౌనస్వామిలాంటి యోగులు ఇక్కడే తపస్సు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి. రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ‘సిద్ధాశ్రమం’కు తీసుకెళ్లడం, మహాభారతంలో పాండవులు కూడా ఇక్కడికి రావడం - ఇవన్నీ శంభల ప్రత్యేకతను వెల్లడిస్తాయి.

ఒక ప్రాచీన రాజు మహా యాగం నిర్వహించి రుషులకు బంగారు ఆభరణాలు దానంగా ఇస్తాడు. అయితే, అవి ధరించలేని రుషులు పరమశివుని అనుమతితో వాటిని రహస్యంగా దాచిపెడతారు. ఆ ప్రాంతాన్ని చేరడానికి శివ అనుగ్రహం అవసరం. ధర్మరాజు ఆ అనుగ్రహంతో ఆ ప్రదేశాన్ని చేరుకుని సంపదను పొందుతాడని పురాణం చెబుతోంది.


కల్కి అవతారానికి కేంద్రబిందువుగా శంభల

విష్ణు పురాణంలోని కల్కి అధ్యాయంలో, ద్వాపర యుగాంతంలో కలి ప్రభావం మొదలై, కలియుగ పాపాలు పెరగడంతో శంభలలో విష్ణుయశుడు-సుమతిలకు కల్కి జన్మిస్తాడు. పరశురాముని వద్ద విద్యలు నేర్చుకుని శివుని దివ్యాశీర్వాదంతో రత్న ఖడ్గం, గరుడ అశ్వంతో కల్కి అవతారం పూర్తిచేస్తాడు. కలికాలపు పాపాలను సంహరించి శంభల నగరాన్ని ధర్మానికి కేంద్రంగా మార్చుతాడు. అనంతరం వైకుంఠానికి చేరిపోతాడు. అప్పటినుంచి శంబళ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది.

Shambhala Nagaram
Shambhala Nagaram

శంభలను వీక్షించినవారు

శంభల గురించి చెబుతున్నవారి వాదనకు ఊతమిచ్చే ప్రాచీన ఉదాహరణలు ఉన్నాయి. ఆనందమయి 20-25 అడుగుల ఎత్తున్న మనుషులను హిమాలయాల్లో చూశారంటారు. రష్యా కి చెందిన హెలీనా కూడా ద్వాపరయుగపు మనుషులను చూశానని చెబుతారు. ఆమె రాసిన పుస్తకాలు ఐసీస్ అన్‌వీల్డ్‌(ISIS Unveiled), ది సీక్రెట్ డాక్టరిన్ (The Secret Doctrine) ఈ వివరాలను వెలుగులోకి తెచ్చాయి.

తమిళనాడుకు చెందిన మౌనస్వామి శంభల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారని చెబుతారు. 1974లో రష్యా పరిశోధకుడు నికోలస్ రోరిచ్ శంభలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. ఆయన పరిశోధనలు వైరల్ కావడంతో హిట్లర్‌ దృష్టికి కూడా శంభల చేరింది. హిట్లర్ తన అల్టిమా తులే బృందాన్ని హిమాలయాలకు పంపించి శంభల నగరాన్ని గుర్తించాలన్న ప్రయత్నం చేశాడు. కానీ, వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరికి మిషన్ విఫలమైంది. తర్వాతి కాలంలో వడ్డిపర్తి పద్మాకర్ అనే సాధకుడు 20 అడుగుల ఎత్తుగల వ్యక్తి తనను మంచు తుఫాన్లో నుండి బయటపడేశాడని చెబుతాడు.

శంభల నగరం - నిర్మాణ వైభవం

ఈ నగరం మానస సరోవరానికి సమీపంలో కనిపించని రూపంలో ఉంది. టిబెట్ బౌద్ధకాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం.. శంభల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలాకార పర్వతాలు, మధ్యలో స్పటిక శ్రీచక్ర భవనం ఉంటుంది. అందులో గరుడ ఆకార భూగ్రహ నమూనా ఉంటుంది. ఆ భవనంలో కోటి సూర్యుల కాంతిని వెదజల్లే చింతామని అనే మణి ఉంది.

రహస్య మణి, రహస్య శబ్దం

ఈ మణి మీద అర్థ చంద్రాకార ముఖం ఉంటుంది. తెరిచిన పెదవుల్లాంటి ద్వారం ఉంటుంది. సిద్ధరుషులు రోజూ శివ, విష్ణు మంత్రాలతో పూజిస్తారు. ఈ మణి కోరిన వరాలను ఇస్తుందనే విశ్వాసం ఉంది. భవిష్యత్తులో కల్కి ఈ మణిని ధరిస్తారని పురాణ ప్రవచనం. ఇది సప్తధాతువులతో రూపొందించబడింది. దీన్ని రష్యా పరిశోధకుడు నికోలస్ పరిశీలించాడు. ఈ నగరంలో అనేక రషులు రచించిన తాళపత్ర గ్రంథాల్ని 18 సంపుటాలుగా భద్రపరిచారు. టిబెట్ బౌద్ధులు కూడా శంభలను విశ్వసిస్తారు. వారు నిత్యం “ఓం మణి పద్మేహుం” అనే మంత్రాన్ని జపిస్తారు.

అయితే.. శంభల నగరం నిజంగానే ఉందా? అక్కడి అద్భుతాలను చూసిన వారెవరు? వారికి దానివల్ల లభించిన అనుభవాలు ఏంటి? ఇవన్నీ పూర్తిగా అన్వేషణలోనే ఉన్నాయి. ఇది సాధారణ మానవుల కళ్పన కాదు… నిజం అని పురాణాలు చెబుతున్నాయి. ఇది శాశ్వత మిస్టరీగా మిగిలిపోతుందా? లేక భవిష్యత్తులో నిజంగా వెలుగులోకి వస్తుందా? అనేది కాలమే సమాధానం చెబుతుంది.

Also Read: ఖజురహో ఆలయంలోని శివలింగం కింద దాగి ఉన్న రహస్యం తెలుసా?

మరిన్ని Interesting Facts కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post