Shaniwar Wada Mystery: భారతదేశంలోని చారిత్రక కోటలు, భవనాలు, ప్రాంతాలు అలనాటి ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ మన సంస్కృతికి గుర్తుగా నిలుస్తున్నాయి. ఈ కోటలు ఎన్నో చారిత్రక సంఘటనలకు, విజయాలు-వైఫల్యాలకి సాక్షులుగా నిలిచాయి. అలాంటి గొప్ప చరిత్ర గల ఓ కోటే మహారాష్ట్ర రాష్ట్రంలో, పుణె నగరంలో ఉన్న శనివర్వాడ కోట. ఈ కోట సుందర నిర్మాణ శైలికి, మహారాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యకమైన స్థానం ఉంది. కానీ.. ఈ కోటకు మరో వింతైన గుర్తింపు కూడా ఉంది. అదే "దెయ్యాల కోట" అనే భయంకరమైన పేరు.
![]() |
Shaniwar Wada Mystery |
పగలు ఎంతో అందంగా కనిపించే ఈ కోట… సూర్యాస్తమయం తర్వాత మాత్రం శ్మశానాన్ని తలపిస్తుంది. పౌర్ణమి రాత్రి వచ్చిందంటే చాలు, ఆ ప్రాంతమంతా నిశ్శబ్దానికి నిలయంగా మారిపోతుంది. ఈ కోట పరిసరాల్లోకి రాత్రివేళల్లో వెళ్లొద్దంటూ పర్యాటకులకు స్థానికులు హెచ్చరికలిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయని, వింత ఆకారాలు కనిపిస్తున్నాయని, ఆత్మలు వెంటాడుతున్నట్లు అనిపిస్తుందని అక్కడ ఉన్నవారు చెబుతుంటారు. కోట సెక్యూరిటీ సిబ్బందే సాయంత్రం 5 గంటల తరువాత ఆ ప్రాంగణంలో ఉండకూడదని చెప్పడం గమనార్హం.
ఈ కోట చరిత్రలోకి వెళ్తే… దీన్ని బాజీరావు పేష్వా నిర్మించారు. బ్రిటిష్ దాడుల్లో కోట పాక్షికంగా నాశనం కావడంతో రాతితో చేసిన నిర్మాణాలు మాత్రమే మిగిలాయి. బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు (నానా సాహెబ్) పాలన చేపట్టాడు. నానా సాహెబ్‌కి ముగ్గురు కుమారులు - మాధవ్ రావు, విశ్వాస్ రావు, నారాయణ రావు. యుద్ధాల్లో నానా సాహెబ్ మరణించగా, అనంతరం మాధవ్ రావు పాలన చేపట్టాడు. కానీ అతని సోదరుడు విశ్వాస్ రావు మరణం తరువాత మాధవ్ రావు కూడా మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో, 1773లో... మూడవ కుమారుడు అయిన నారాయణ రావు పిన్నవయస్సులోనే సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాడు. కానీ ఆయనకు అప్పటికి కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆయన పినతండ్రి రఘునాథ రావు మరియు అతని భార్య ఆనంది బాయ్ సలహాలు సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. కుటిల బుద్ధితో ఉన్న రఘునాథ రావు మరియు అతని భార్య ఆనంది బాయ్ మెల్లగా సామ్రాజ్యంపై పట్టు సాధించారు. నారాయణ రావును గృహ నిర్బంధంలో ఉంచారు.
![]() |
Shaniwar Wada Fort |
రఘునాథ రావు కుట్ర వల్ల గార్దీ అనే గిరిజన జాతి ప్రజలతో, నారాయణ రావుకు విభేదాలు తలెత్తాయి. దీంతో రఘునాథ రావు భార్య ఆనంది బాయ్ ఆ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని భావించింది. రఘునాథ రావు, ఆనంది బాయ్ కుట్ర ప్రకారం, గార్దీ అనే గిరిజన జాతిని ఉపయోగించుకున్నారు. రఘునాథ్ రావు గార్దీ నాయకుడికి రాసిన లేఖలో… "నారాయణ రావును మేము మీకు అప్పగిస్తాం" అనే మాటలు ఉన్నాయి. వారి ప్రణాళిక ప్రకారం గార్దీలు రాత్రికి రాత్రే కోటలోకి ప్రవేశించి, నారాయణ రావును గదిలోనే హత్య చేశారు. అంతే కాదు, శరీరాన్ని ముక్కలుగా నరికి నదిలో పారేశారు.
ఆ రోజునుండి ప్రతి పౌర్ణమి రాత్రి నారాయణ రావు ఆత్మ కోటలో తిరుగుతూ ప్రతీకారం తీర్చుకుంటుందని స్థానికులు విశ్వసిస్తారు. కోటలో ఉన్న ఏ వ్యక్తినైనా శత్రువుగా భావించి వారి ప్రాణాలు తీస్తుందని చెబుతారు. నారాయణ రావు మరణానంతరం కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో మరికొంత మంది మరణించారనీ, వారి ఆత్మలు కూడా కోట చుట్టూ సంచరిస్తున్నాయని అంటారు.
అయితే… ఈ కోటలో నిజంగా ఆత్మలు ఉన్నాయా? అక్కడకి వెళ్లిన వ్యక్తులు ఎలా చనిపోయారన్నది ఇప్పటికీ తెలీని మిస్టరీగానే మిగిలిపోయింది.