Lalithaa Jewellery Kiran Kumar Success Story: ‘డబ్బులు ఎవరికి ఊరికే రావు’ అనే మాట ఎప్పుడైనా టీవీ ఆన్ చేస్తే వినిపించే డైలాగ్‌లా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే వినిపిస్తోంది. అసలు ఈ పదం వెనుక ఉన్న అర్థం - కష్టపడితేనే సంపాదన వస్తుంది అన్నదే. కానీ ఈ మాటతోనే తన జీవితాన్ని మలుచుకుని, పేదరికం నుంచి పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఉన్నారు. పట్టుదల, కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుందని నిరూపించిన ఆయన లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్. బయటకు చూస్తే ధనవంతుడిలా, స్టైలిష్‌గా కనిపించే ఆయన వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలున్నాయని చాలా మందికి తెలియదు. మరి కిరణ్ కుమార్ ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు? ఆయన జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
![]() |
Lalithaa Jewellery Kiran Kumar Success Story |
కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ పోషణ బాధ్యత ఆయన భుజాలపై పడింది. చదువు కొనసాగించడం కష్టమై 5వ తరగతిలోనే చదువును మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 12 ఏళ్లకే నెలకు కేవలం 30 రూపాయలకు ఒక జువెలర్స్ షాప్‌లో పనిని మొదలుపెట్టారు. అయితే ఆయనలో వ్యాపార దృష్టి అప్పటినుంచే మొదలైంది. నెల్లూరులో తయారయ్యే బంగారం హైదరాబాద్, చెన్నైలో ఎక్కువ డిమాండ్ ఉంటుందని గమనించారు. దీంతో తల్లి బంగారు గాజులను తీసుకుని వాటిని చిన్న చిన్న ఆభరణాలుగా మార్చి షాప్‌లకు అమ్మడం ప్రారంభించారు. తర్వాత పాత బంగారం కొనుగోలు చేసి కొత్త ఆభరణాలుగా తయారు చేసి అమ్మేవారు. ఈ వ్యాపారం ద్వారా లలిత జువెలర్స్‌తో అనుబంధం ఏర్పడింది.
1999లో లలిత జ్యువెలర్స్ యజమాని ఎంఎస్ కందస్వామి అప్పుల బారిన పడి వ్యాపారాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోయినా, కిరణ్ కుమార్ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కంపెనీని తీసుకున్నారు. లలిత జ్యువెలర్స్ పేరులో చిన్న మార్పు చేసి “A” అక్షరాన్ని జోడించారు. నాణ్యతపై రాజీపడకుండా కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించారు. క్రమంగా "లలిత జ్యువెలర్స్ అంటే నాణ్యమైన బంగారం" అనే పేరు సంపాదించారు.
తన వ్యాపారానికి తానే బ్రాండ్ అంబాసడర్‌గా మారి "డబ్బులు ఎవరికి ఊరికే రావు" అనే మాటతో వినియోగదారులను ఆకట్టుకున్నారు. ఈ స్ట్రాటజీతో లలిత జ్యువెలర్స్‌ను ప్రముఖ సంస్థగా నిలబెట్టారు. 1985లో టేకోవర్ చేసిన ఆయన, ఇప్పుడు భారత్ అంతటా 56 బ్రాంచ్‌లను స్థాపించారు. హైదరాబాద్‌లో లక్ష 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతి పెద్ద షోరూమ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు 17 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడుతోంది.