Biryani Side Effects: దక్షిణాసియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకం బిర్యానీ. చికెన్, మటన్, రొయ్యలు, పీతలు, గుడ్డు, కూరగాయలు ఇలా అనేక రకాల బిర్యానీలు మార్కెట్‌లో లభిస్తాయి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. ఏ చిన్న వేడుక వచ్చినా వెంటనే బిర్యానీ తినడానికి ముందుకొస్తారు. మటన్, చికెన్ అన్న తేడా లేకుండా ఆస్వాదిస్తారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతి వీధిలోనూ బిర్యానీ సెంటర్లు కనిపిస్తాయి.
![]() |
| Biryani |
ఇంట్లో ఆదివారం వచ్చినా లేదా ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినా బిర్యానీ తప్పనిసరిగా ఉంటుంది. అయితే బిర్యానీ ప్రేమికులు జాగ్రత్త! దాన్ని అతిగా తినడం వలన కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బిర్యానీ తయారీలో ఉపయోగించే పదార్థాల్లో అధిక కేలరీలు, కొవ్వు పదార్థాలు ఉండటంతో బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలియకుండానే పలు ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతున్నట్టే అవుతుంది.
గుండె ఆరోగ్యానికి ముప్పు: బిర్యానీ తయారీలో నూనె, నెయ్యి అధికంగా వాడతారు. ముఖ్యంగా డాల్డా ఎక్కువైతే మరింత హానికరం. బిర్యానీలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లకు దారితీస్తుంది. అదేవిధంగా రుచి కోసం ఎక్కువ ఉప్పు వేసే కారణంగా రక్తపోటు పెరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
కిడ్నీ సమస్యలు: బిర్యానీ తయారీలో వాడే కొన్ని పదార్థాలు కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తాయి. దీని వలన కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపయోగించే పదార్థాల విషయంలో జాగ్రత్త అవసరం.
బరువు పెరగడం: బిర్యానీలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. బియ్యం, మాంసం, జీడిపప్పు, నూనె, నెయ్యి అన్నీ కలిపి బిర్యానీ తయారు చేస్తారు. దీన్ని ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు అధికమై బరువు పెరుగుతుంది. దీంతో ఊబకాయం సమస్య వస్తుంది. ముఖ్యంగా మటన్ బిర్యానీని ఎక్కువగా తినడం కాలేయానికి హానికరం. దీని వలన నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వచ్చే అవకాశం ఉంది. ఒకొక్కసారి ఇది టైప్ 2 డయాబెటిస్ సమస్యకు కూడా కారణమవుతుంది.
జీర్ణ సమస్యలు: బిర్యానీని ఎక్కువగా తినడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. బిర్యానీలో వాడే మసాలాలు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి బిర్యానీ తినే ముందు ఉపయోగించే పదార్థాల నాణ్యతను గమనించాలి. ముఖ్యంగా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. అలా చేస్తేనే రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

