Foods for Better Sleep: టీ, కాఫీలు నిద్రను దూరం చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే నిపుణుల ప్రకారం, రాత్రి భోజన సమయంలో తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కూడా నిద్రను భంగం కలిగిస్తాయి. రాత్రుళ్లు నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారంటే, మీకు తెలియకుండానే కొన్ని ఫుడ్స్ తీసుకుంటున్న అవకాశముంది. అందుకే ఈ ఆహారాల్ని డిన్నర్‌లో వీలైనంతవరకు దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.
![]() |
Foods for Better Sleep |
మంచి నిద్ర కోసం రాత్రి భోజనం తేలికగా, సమతుల్యంగా ఉండాలి. భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి కనీసం రెండు గంటల వ్యత్యాసం ఉండాలి. ఎక్కువ మసాలా, చక్కెర, కెఫిన్ కలిగిన ఆహారాలనుంచి దూరంగా ఉండాలి.
మరి నిజంగా నిద్రకు ఆటంకం కలిగించే ఆహారాలు ఏవో చూద్దాం.
1. మసాలా, నూనె ఆహారం
రాత్రిపూట మసాలా లేదా నూనెతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా అసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు తలెత్తుతాయి. ఈ అసౌకర్యాలు నిద్రను భంగం చేస్తాయి. అందువల్ల వేయించిన ఆహారాలు, ఘాటు ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ను డిన్నర్‌లో నివారించడం మంచిది.
2. స్వీట్స్
డిన్నర్ తర్వాత స్వీట్స్ లేదా డెజర్ట్స్ తినడం చాలామందికి అలవాటే. కానీ ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి మళ్లీ పడిపోవడానికి కారణమవుతాయి. దీని వల్ల శరీరంలో అసౌకర్యం కలుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి, చివరికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి స్వీట్స్ తినాలనుకుంటే చాలా తక్కువ మోతాదులోనే, పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు తీసుకోవాలి.
Also Read: వర్షాకాలంలో ఆరోగ్యం కాపాడే బెస్ట్ సూపర్ ఫుడ్స్!
3. చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్
చాక్లెట్‌లో ఉండే కెఫిన్, థియోబ్రోమైన్ వంటి పదార్థాలు మెదడును ఉత్తేజపరుస్తాయి. అదే సమయంలో ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్, షుగర్ అధికంగా ఉండటం వల్ల శరీరం హైపర్‌గా పనిచేస్తుంది. ఇవి రాత్రిపూట నిద్రకు భంగం కలిగిస్తాయి.
4. అధిక ప్రోటీన్ ఆహారం
చికెన్, రెడ్ మీట్ లేదా ఎక్కువ పనీర్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. రాత్రి సమయంలో వీటిని తింటే జీర్ణవ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీని కారణంగా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. రిలాక్స్ కావాల్సిన సమయంలో శరీరం ఒత్తిడిలో ఉండటంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది.
5. ఆల్కహాల్, కోల్డ్ డ్రింక్స్
ఆల్కహాల్ తాత్కాలికంగా నిద్రకు సహాయపడుతున్నట్టు అనిపించినా, దీర్ఘకాలంలో ఇది నిద్రలేమి సమస్యలకు దారి తీస్తుంది. అలాగే కోల్డ్ డ్రింక్స్‌లో ఉన్న కెఫిన్, షుగర్ నిద్రను పాడు చేస్తాయి.
రాత్రి భోజనంలో ఏం తింటామనేది నిద్ర నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతుంది. మసాలా, నూనె, అధిక ప్రోటీన్, స్వీట్స్, చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్, కోల్డ్ డ్రింక్స్‌ను తగ్గించి తేలికపాటి, సమతుల్యమైన ఆహారం తీసుకుంటేనే మంచి నిద్ర లభిస్తుంది. ఇలా చేస్తే ఉదయం లేచాక తాజాగా అనిపించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.