Pawan Kalyan O.G. Movie Review: ఓజీ మూవీ రివ్యూ.. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతారం, ఫ్యాన్స్‌కి ఫెస్టివల్!

Pawan Kalyan O.G. Movie Review: తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న గుర్తింపు ప్రత్యేకం. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సమయం దొరికినప్పుడల్లా సినిమాల ద్వారా అభిమానులను అలరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే నిన్న రాత్రి నుంచే పలు చోట్ల ప్రీమియర్స్ నిర్వహించగా, ఈ చిత్రం ఎలా ఉందన్న అంశంపై చర్చ నడుస్తోంది.

Pawan Kalyan O.G. Movie Review
Pawan Kalyan O.G. Movie Review

కథ: ఓజాస్ గంభీర్ అనే అనాథ, అందరూ ప్రేమగా ఓజీ (పవన్ కళ్యాణ్) అని పిలుస్తారు. జపాన్‌లో సమురాయ్‌ల మధ్య పెరిగిన అతను అసాధారణ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు సాధిస్తాడు. అనుకోని పరిస్థితుల కారణంగా ముంబైకి శరణార్థిగా వస్తాడు. ప్రయాణంలో సత్య దాదా (ప్రకాష్ రాజ్)తో పరిచయం అవుతుంది. అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడిన ఓజీని సత్య దాదా తన సొంత కుమారుడిలా చూసుకుంటాడు. ముంబైలో పెద్ద పోర్ట్‌ను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించిన దాదాకు ఓజీ విశ్వసనీయ రక్షకుడిగా మారుతాడు.

కానీ కొన్ని కారణాల వల్ల దాదాకు దూరమై ముంబైని వదిలిపెడతాడు. దాదాపు పది సంవత్సరాల పాటు ఆ నగరాన్ని చూడడు. ఈ సమయంలో ఓమి బవు (ఇమ్రాన్ హష్మీ) అనే మాఫియా డాన్ రంగప్రవేశం చేస్తాడు. అతని వల్ల సత్య దాదా కుటుంబం కష్టాల్లో పడుతుంది. ఈ పరిణామాల వల్ల ఓజీ తిరిగి ముంబైకి రావాల్సి వస్తుంది. ఇక ఓమి అసలు లక్ష్యం ఏమిటి? సత్య దాదా సమస్యల నుంచి బయటపడగలిగారా? ఓజీ తన దత్తత కుటుంబాన్ని రక్షించగలిగాడా? అనేదే కథలో ఆసక్తికరమైన మలుపు.


విశ్లేషణ: దర్శకుడు సుజీత్ ఈ కథను ముంబైజపాన్ నేపథ్యాల మేళవింపుతో రాశారు. సినిమా ప్రారంభంలో వరల్డ్ క్రియేషన్, పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్ కొంత సమయం తీసుకున్నప్పటికీ, తర్వాత కథ వేగం అందుకుంది. స్టార్టింగ్‌లో కొంతమందికి బోర్ అనిపించే సన్నివేశాలు ఉన్నా, కథా నిర్మాణం పట్ల చూపిన శ్రద్ధ ప్రేక్షకుడిని ఆకర్షించింది.

ఓజీ పాత్ర ప్రవేశించిన తరువాత సినిమా పూర్తిగా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. స్క్రీన్‌ప్లే బాగా రాసుకోవడంతో, ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్‌తో పాటు కథా నిర్మాణం సాఫీగా సాగింది. జపనీస్ సినిమాల తరహా స్టైలిష్ మేకింగ్‌ను సుజీత్ ప్రయత్నించారు. ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులలో గూస్‌బంప్స్ కలిగించేలా తీర్చిదిద్దారు.

సెకండ్ హాఫ్‌లో ఓజీ ముంబై డాన్‌గా మారిన నేపథ్యాన్ని చూపించారు. అయితే రివెంజ్ ఎపిసోడ్ కొంత డ్రాగ్ అయింది. ముఖ్యంగా అర్జున్ దాస్ ట్రాక్ అవసరం లేకపోయినా కథలో ఇరికించినట్లు అనిపించింది. ఓజీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సన్నివేశాలు కొంత వర్కౌట్ అయ్యాయి. సుజీత్ ఎమోషన్‌ను బాగా హ్యాండిల్ చేసి, ప్రతి సీన్‌లో కోర్ ఎమోషన్‌ను కొనసాగించారు. క్లైమాక్స్ ఎపిసోడ్ థియేటర్లను షేక్ చేసేలా ఉన్నప్పటికీ, హీరోవిలన్ మధ్య తగినంత హై వోల్టేజ్ ఫైట్ లేకపోవడం అసంతృప్తి కలిగించింది.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి సన్నివేశానికి తగిన బీ జీఎమ్‌తో పాటు మంచి పాటలు అందించారు. సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ పాయింట్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్, ఇంటర్‌సెల్ సన్నివేశాలు విజువల్‌గా అద్భుతంగా చూపించారు.


నటీనటుల ప్రదర్శన: పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన ఇంతకుముందు పాత్రల కంటే కొత్త కోణాన్ని చూపించారు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో 100% ఇన్వాల్వ్ అవ్వడంతో స్క్రీన్ మీద ఆయనను చూడటం ప్రత్యేక అనుభూతిని కలిగించింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా బాగా ఇంప్రెస్ చేసినప్పటికీ, పాత్రలో కొన్ని పరిమితులు కనిపించాయి. ప్రియాంక మోహన్ తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ పాత్ర చిన్నదే అయినా కీలకంగా నిలిచింది. శ్రేయా రెడ్డి రెబల్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నారు. అర్జున్ దాస్ మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగా చేశారు.

టెక్నికల్ అంశాలు: సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ తన సత్తా చాటుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ లుక్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించింది. దర్శకుడు సుజీత్‌కు కావాల్సిన వాతావరణం పకడ్బందీగా అందించారు.

ప్లస్ పాయింట్స్

  • పవన్ కళ్యాణ్ నటన
  • మ్యూజిక్, బీజీఎమ్
  • విజువల్స్
  • డైరెక్షన్

మైనస్ పాయింట్స్

  • సెకండ్ హాఫ్ కొంచెం స్లో
  • కొన్ని డైలాగ్స్ వర్కౌట్ కాలేదు
  • అనవసర సన్నివేశాలు

చివరగా చెప్పాలంటే.. ఓజీ పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద పండుగలా అనిపించే సినిమా. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఆయన ఎలివేషన్, యాక్షన్, విజువల్స్ సినిమా రేంజ్‌ను పెంచాయి.

Also Read: ఓజీ సినిమా ప్రీమియర్ టికెట్‌ను రూ.1 లక్షకు కొన్న అభిమాని!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post