International Law University Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విద్యాసంస్థ స్థాపనకు రంగం సిద్ధమైంది. ఉన్నత విద్యా రంగంలో కీలక ముందడుగుగా అంతర్జాతీయ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అనుమతులు లభించాయి. ఇదే సమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపనకు సులభతరం చేసే సవరణ బిల్లులు, మరికొన్ని మార్పులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లులను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టగా సభ ఆమోదముద్ర వేసింది.
![]() |
International Law University Amaravati |
ఉన్నత విద్యకు మేలు: చట్ట సవరణలతో రాష్ట్ర విద్యా రంగానికి మరింత మేలు జరగనుంది. న్యాయ విద్య, పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్’ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి ఈ ప్రతిష్టాత్మక సంస్థను సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం కోసం అమరావతిలో 55 ఎకరాల స్థలం కేటాయించింది. ఇందులో ఏపీ విద్యార్థులకు 25% సీట్లు రిజర్వ్ చేయడం విశేషం. అదనంగా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో లా యూనివర్సిటీతో పాటు కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.
గతంలో ఎదురైన అడ్డంకులు: గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం రూపుదిద్దుకున్నా, కొన్ని సవరణలు పెద్ద అడ్డంకులుగా మారాయి. ముఖ్యంగా టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ ఉండాలనే నిబంధన యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండటంతో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు కావడం కష్టతరమైంది. ఈ సమస్యల నివారణకు కూటమి ప్రభుత్వం మూడు రకాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. దీంతో అమరావతిలో అంతర్జాతీయ లా యూనివర్సిటీ స్థాపనకు మార్గం సుగమమైంది.
ప్రపంచ స్థాయి న్యాయవిద్య: అంతర్జాతీయ లా యూనివర్సిటీలో కేవలం భారతీయ చట్టాలే కాకుండా ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్న న్యాయ చట్టాలు కూడా బోధించనున్నారు. విద్యార్థులకు వివిధ దేశాల సెక్షన్లు, శిక్షాస్మృతులు, అంతర్జాతీయ చట్టాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి విశ్వవిద్యాలయాలు ప్రధానంగా పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాగా, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అమరావతిలో ఇది ప్రారంభమవడం గొప్ప అభివృద్ధి. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించడం విశేషం.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం: మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపనకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ యూనివర్సిటీలతో పోలిస్తే ప్రైవేట్ యూనివర్సిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు విద్య అందిస్తున్నాయి. అయితే యూజీసీ నిబంధనలు, రాష్ట్ర చట్టాలు కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు అడ్డంకిగా మారాయి. అందుకే ఆ చట్టాలను సవరించి, బిల్లులను ఆమోదించడంతో కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
విద్యారంగంలో కొత్త అధ్యాయం: ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా రంగం కొత్త దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ విద్యను, రాష్ట్ర విద్యను అనుసంధానించేందుకు నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు విద్యావేత్తల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. అమరావతిలో అంతర్జాతీయ లా యూనివర్సిటీ ఏర్పాటు, ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం రాష్ట్రానికి విద్యా పరంగా కీలక మలుపు కానుంది.