Jagan vs Chandrababu Comparison: "పండిత పుత్ర పరమ శుంభుడు" అన్న ఒక సామెత అందరికీ తెలిసిందే. తండ్రి పండితుడైనా, కొడుక్కి ఆ గుణం రాకపోవచ్చు. ఇదే రాజకీయాల్లో కూడా సరిగ్గా కనిపిస్తుంది. చాలామంది నేతలు తమ పిల్లలను రాజకీయ వారసులుగా ముందుకు నెట్టారు. కానీ వారిలో చాలామంది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అయితే మరికొందరు మాత్రం విజయవంతమయ్యారు. ఆ జాబితాలో జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడు వంటి నేతలు ఉంటారు. తండ్రి వారసత్వాన్ని వారు కొనసాగించినా, కొంత భిన్నత కూడా కనబరిచారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి వల్లే పొందారు. కానీ వై.ఎస్.ఆర్ మాదిరిగా వరుసగా రెండోసారి అధికారం దక్కించుకోలేకపోయారు. కారణం ఏమిటంటే.. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ జగన్ మాత్రం సంక్షేమ పథకాలకే పరిమితమై.. అభివృద్ధి అంశాన్ని విస్మరించారు. చివరికి ఈ విధానం జగన్‌కు చేటు చేసింది.
 |
Jagan vs Chandrababu Comparison |
బలమైన సోషల్ మీడియా సైన్యం ఉన్నా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సోషల్ మీడియా సైన్యం ఉంది. ఐప్యాక్ టీం కూడా వారితో కలిసి పనిచేసింది. కానీ ఈ సైన్యం గత ఐదేళ్లలో అభివృద్ధి, పాలన విజయాలను ప్రచారం చేయడం మానేసి.. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకే కేంద్రీకృతమైంది. జగన్ మోహన్ రెడ్డి చేసిన కొన్ని మంచి నిర్ణయాలు, కొత్త చట్టాలు, దిశ యాప్ లాంటి ప్రయోగాలు ప్రజల్లో సరైన స్థాయిలో చేరలేకపోయాయి. అభివృద్ధి పనులు చేసినా వాటి ప్రచారం జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే “పథకాలు ఇచ్చాం, ప్రత్యర్థులపై విరుచుకుపడతాం” అనే లెవల్లోనే పార్టీ సైన్యం పని చేసింది.
వ్యూహాత్మకంగా చంద్రబాబు అడుగులు: ఇక చంద్రబాబు విషయానికి వస్తే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగారు. తొలినాళ్లలో పూర్తిగా పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టారు. తర్వాత క్రమంగా ప్రజల మధ్యకెళ్లడం ప్రారంభించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టును ముఖ్య అజెండాగా తీశారు. ప్రజల్లో అసంతృప్తి మెల్లగా వ్యక్తమవుతున్న సమయంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వాటి ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా జోరుగా ముందుకు నడిపించారు.
జగన్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఇది పేద విద్యార్థుల వైద్యవిద్య కోసమే. కానీ ఆ సమయంలో ఆ కాలేజీల గురించి సరైన ప్రచారం జరగలేదు. కారణం నిర్మాణం పూర్తి కాకపోవడమే. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం వాటిని పిపిపి విధానంలో నడపాలని ప్రకటించిన తర్వాతే ఆ విషయం జనాల దృష్టికి వచ్చింది. అప్పట్లో ఈ మెడికల్ కాలేజీలపై ఫోకస్ చేసి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ దక్కేదని పార్టీ నేతలే ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారు.
ఇప్పుడు తేడా స్పష్టంగా కనిపిస్తోంది: జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ప్రజల్లో పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రతి నిర్మాణ పనిని, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రచారంలోకి తెచ్చి ప్రజల్లోకి చేరుస్తున్నారు. ఇక్కడే జగన్, చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా కనబడుతోంది.