SCO Summit 2025: చైనాలోని టియాంజిన్‌లో ప్రపంచ దౌత్యానికి కొత్త అధ్యాయం ఆరంభమైంది. ఈ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆతిథ్య దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ కలిసి కనిపించారు. SCO సమ్మిట్‌లో గ్రూప్ ఫోటో సెషన్ సందర్భంగా, సభ్య దేశాలన్నీ ఒకే వేదికపై చేరాయి. ప్రధాని మోదీ వేదికపైకి వచ్చినప్పుడు, అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో ఆయన సతీమణి పెంగ్ లియువాన్ కూడా పక్కనే ఉన్నారు. అనంతరం, ప్రధాని మోదీ జిన్‌పింగ్ దంపతులతో కరచాలనం చేశారు.
ఈ క్షణాల్లో ఇద్దరు నాయకుల ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపించింది. ఫోటోలో మోదీ, పుతిన్ మధ్య తజికిస్తాన్-కిర్గిజ్‌స్తాన్ అధ్యక్షులు నిలిచారు. ఈ గ్రూప్ ఫోటోను ప్రపంచం ఆసక్తిగా వీక్షించింది. జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం, ప్రధాని మోదీ మాల్దీవులు, నేపాల్ సహా పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు.
Also Read: భారత్-చైనా ప్రత్యర్థులు కాదు, అభివృద్ధి భాగస్వాములు!
ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనాకు పర్యటన చేయడం, పది నెలల్లో జి జిన్‌పింగ్‌తో రెండోసారి కలవడం ప్రత్యేకతగా నిలిచింది. గత భేటీ రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ 2024 సమ్మిట్‌లో జరిగింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమావేశం ప్రపంచ క్రమంలో ఒక కీలక మైలురాయిగా నిలవవచ్చు. అయితే భారత్-రష్యా-చైనా మధ్య ఎప్పటిలాగే విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమావేశం తర్వాత గ్లోబల్ ట్రేడ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ట్రంప్ సుంకాల తుఫాను వీస్తే భారతదేశం అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో చైనా-పాకిస్తాన్ సంబంధాలు, సరిహద్దు సమస్యల పరిష్కారం వంటి అంశాలు కూడా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి అనుకూలంగా పరిణమిస్తే, అది శుభ పరిణామంగా భావించవచ్చు.
Also Read: చైనాలో ప్రధాని మోదీ పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక భేటీ!
అమెరికా ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో ఈ సమ్మిట్‌కు మరింత ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా, ఈ వేదికపై ట్రంప్ మినహా అన్ని అగ్రరాజ్యాలు ఒకచోట చేరడం విశేషం. ఇటీవలి కాలంలో భారత్-చైనా సాన్నిహిత్యం పెరుగుతుండడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. దానికి ప్రధాన కారణం రష్యన్ చమురు సరఫరా. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా కోరినా, భారత్ దానిని స్పష్టంగా తిరస్కరించింది.
రష్యా నుండి చౌకగా చమురు కొనుగోలు చేసి లాభాలను ఆర్జిస్తోందని అమెరికా ఆరోపించినప్పటికీ, భారత్ కఠినంగా స్పందించింది. ఈ కొనుగోలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా జరిగిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రష్యా చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా ప్రపంచ చమురు ధరలు స్థిరంగా ఉండేందుకు భారత్ సహకరించిందని తెలిపింది. ఈ చర్యను అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ప్రశంసించాయి. భారతదేశం తన ఇంధన అవసరాలు మరియు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ, రష్యా చమురు కొనుగోలు కొనసాగుతుందని స్పష్టంగా ప్రకటించింది.
