Megastar Chiranjeevi Life Story: సరిగ్గా 70 ఏళ్ల క్రితం… ఆ మారుమూల గ్రామ ప్రజలకు తెలియదు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆ బాలుడు ఒకరోజు తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తాడని. దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు సినిమా దశదిశలా ముందుకు నడిపిస్తున్నందుకే ఆయన పేరులో అమరత్వం నింపారు. పునాదిరాళ్లను కదిలించి ఫ్యాన్స్ గుండెల్లో ఖైదీగా మారి… గాడ్ ఫాదర్గా మార్గదర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు… కోట్లాది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయస్సులోకి అడుగుపెడుతున్నారు. ఆగస్టు 22న 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి కెరీర్‌పై కొన్ని విశేషాలు మీ కోసం…
![]() |
Konidela Sivasankara Varaprasad |
మెగాస్టార్ ఇప్పుడు 70 ఏళ్ల మైలురాయిని చేరుకున్నారు. ఇంకో మూడు సంవత్సరాల్లో సినీ రంగంలో తన 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల శివశంకర వరప్రసాద్ (ప్రస్తుత చిరంజీవి) జన్మించారు. తల్లిదండ్రులు కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి. పెద్ద కుమారుడిగా పుట్టిన చిరంజీవి నర్సాపురంలోని వైఎల్ కళాశాల నుండి కామర్స్ డిగ్రీ పూర్తి చేసి, నటనపై ఆసక్తితో 1976లో 21 ఏళ్ల వయస్సులో మద్రాసుకు చేరుకున్నారు. అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటన శిక్షణ పొంది, 1978లో పునాదిరాళ్లు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.
1980 ఫిబ్రవరి 20న ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత స్వయంకృషి, ఘరానా మొగుడు, ఆపద్భాంధవుడు, ఇంద్ర, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి అద్భుత చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ముఖ్యంగా 1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్‌ను పూర్తిగా మార్చింది. స్టార్‌డమ్ అందించి, ఆయనను ఇండస్ట్రీలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది.
2007లో శంకర్ దాదా జిందాబాద్ తరువాత కొంత విరామం తీసుకుని, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 స్థానాలు గెలుచుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.
2017లో మళ్లీ టాలీవుడ్‌కి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెం.150తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు నంది అవార్డులు, అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఆయనను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.
1978 నుండి ఇప్పటి వరకు 155 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి, ప్రస్తుతం 156వ చిత్రం విశ్వంభరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు 22న తన 70వ జన్మదినోత్సవ కానుకగా చిత్రబృందం విశ్వంభర టీజర్ విడుదల చేసింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో 157వ సినిమాకు కూడా సిద్ధమవుతున్నారు. Once Again హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి గారు. మన శివశంకర వరప్రసాద్ గారు ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉండాలి.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS