Khasi Tribe: మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాగాల్లో పితృస్వామ్య వ్యవస్థ కొనసాగుతోంది. అమ్మాయికి పెళ్లి చేస్తే చాలు, ఆమె అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతుంది. అంతటితో ఆగకుండా, ఆమె ఇంటి పేరు కూడా మారిపోతుంది. ఆమెకు పుట్టిన పిల్లలు కూడా భర్త ఇంటిపేరు కొనసాగిస్తారు. ఆమె తన పుట్టింటికి కేవలం అతిథిగా, చుట్టపు చూపుగా మాత్రమే మిగిలిపోతుంది. ఈ విధానాలు కేవలం మనదేశానికే పరిమితమవ్వకుండా, ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్న సంప్రదాయాలే. అయితే, భారతదేశంలోని ఒక ప్రాంతం మాత్రం ఈ వ్యవస్థకు పూర్తి విరుద్ధంగా ఉంది.
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో అనేక గిరిజన తెగలు నివసిస్తున్నాయి. ఆ తెగలలో ఖాసీ తెగ జీవనశైలి ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. ఈ తెగలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. వాస్తవానికి, గతంలో వీరి కుటుంబ వ్యవస్థలో కూడా పితృస్వామ్య ధోరణి ఉండేది. కానీ కాలక్రమేణా యుద్ధాల్లో పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో అనేకమంది మహిళలు వితంతువులయ్యారు. అలా యుక్త వయస్సులోనే వితంతువులుగా మారిన ఆ మహిళలు మళ్లీ వివాహ బంధంలోకి రావడానికి ప్రయత్నించారు. కొందరికి రెండు పెళ్లిళ్లు కూడా జరిగాయి.
Also Read: వెన్నులో వణుకు పుట్టించే ఢిల్లీలోని ఈ బావి కథ తెలుసా?
అయితే అలా పుట్టిన పిల్లలకు సమాజం అక్రమ సంతానంగా ముద్ర వేసింది. ఈ వివక్షను తట్టుకోలేని తల్లులు తమ పిల్లలకు తమ ఇంటి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ చర్య క్రమంగా ఒక సంప్రదాయంగా మారింది. మహిళలకు గౌరవం, రక్షణ కల్పించే ఈ పద్ధతి ఖాసీ సమాజంలో ఒక ముద్ర వేసింది. ఈ తెగలో చిన్న కుమార్తెను వారసురాలిగా భావిస్తారు. కుటుంబ సంపదను ఆమెకు అప్పగిస్తారు. అంతేకాకుండా, వివాహం జరిగినప్పుడు వధువు ఇంటికే వరుడు వెళ్లి నివసించాల్సి ఉంటుంది. వధువు తరఫునే పిల్లలు ఇంటి పేరు కొనసాగిస్తారు.
అంతే కాకుండా, ఖాసీ తెగ ప్రజలు విపరీతమైన వర్షపాతం కలిగిన మేఘాలయ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఎక్కువ వర్షాలు కురవడం వల్ల ఈ ప్రాంతంలో పంటల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అటు పర్వత ప్రాంతం కావడంతో పండ్లు, కాయగూరల సాగు విస్తృతంగా జరుగుతుంది. ఈ వ్యవసాయ కార్యకలాపాలలో మహిళల పాత్ర అత్యంత కీలకం. రైతుల్లో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం. వీరిలో సహజంగానే స్వతంత్ర ఆలోచనా విధానం ఉంది. వ్యాపార రంగంలో కూడా ఇక్కడి మహిళలు సుదీర్ఘ అనుభవం కలిగినవారిగా పేరుగాంచారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కూడా వీరే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంతో మహిళలను ఈ సమాజం ఆర్థిక శక్తిగా గౌరవంగా చూసుకుంటోంది.
Also Read: 30 సంవత్సరాల తర్వాత తిరిగి వికసించిన తామరపూల అసలు స్టోరీ తెలుసా?

