Sheikh Hasina Sentenced to Death: బంగ్లాదేశ్‌ను కుదిపేసిన షేక్ హసీనా మరణశిక్ష తీర్పు.. భారత్ ఎందుకు తిరస్కరించింది?

Sheikh Hasina Sentenced to Death: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు కోర్టు మరణశిక్ష విధించడంతో దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లకు హసీనా కారణమని కోర్టు నిర్ణయించడం ఈ తీర్పుకు కారణమైంది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతూ ఉంటుండగా, తాత్కాలిక ప్రభుత్వం ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అధికారికంగా కోరింది. అయితే భారత్ ఇప్పటివరకు ఈ విన్నపాన్ని అంగీకరించలేదు. మరోవైపు ఇంగ్లాండ్‌కు శరణార్థిగా వెళ్లేందుకు చేసిన ఆమె ప్రయత్నం అక్కడి ప్రభుత్వ అనుమతిలేకపోవడంతో నిలిచిపోయింది.

Sheikh Hasina Sentenced to Death
Sheikh Hasina Sentenced to Death

దేశంలో పెరుగుతున్న అస్థిరత
బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్రమైన అశాంతితో కొట్టుమిట్టాడుతోంది. తాత్కాలిక యూనస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం బలహీనపడింది. పోలీసులకు అధిక అధికారాలు ఇవ్వడం, అవినీతి పెరుగుతున్నట్టున్న సూచనలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. నోబెల్ బహుమతి గ్రహీత అయినప్పటికీ, యూనస్ పరిపాలనలో అవసరమైన స్థాయి నియంత్రణను చూపలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. దీనితో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ, కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అమెరికా వైపు మొగ్గు-ప్రజల్లో అసహనం
తాత్కాలిక ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విదేశాంగ నిర్ణయాలు, ఆర్థిక విధానాలు పెట్టుబడిదారులను ప్రోత్సహించేలా ఉండటం ప్రజల్లో నమ్మకం తగ్గించింది. ఈ పరిస్థితుల్లో హసీనా పేరు మళ్లీ ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారుతోంది. ఆమెకు మళ్లీ ప్రజాదరణ వచ్చే అవకాశాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వమే అభియోగాలను బలపరిచిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. కోర్టులో ప్రభుత్వం తీసుకున్న దూకుడు వైఖరి ఫలితంగా ఈ మరణశిక్ష తీర్పు వెలువడినట్లు సమాచారం.

భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న సూచనలు
హసీనా భారతదేశంలో ఉండడం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అసౌకర్యంగా మారింది. పైగా ఇటీవల భారత్ అమెరికాకు కొంత దూరంగా ఉన్న విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో యూనస్ ప్రభుత్వం హసీనా కేసును రాజకీయపరంగా ఉపయోగించుకుంటోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరణశిక్ష ప్రకటించిన వెంటనే ఆమెను భారతదేశం అప్పగించాలని చేసిన బంగ్లాదేశ్ డిమాండ్‌కు భారత్ స్పష్టంగా నిరాకరించింది. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం మరియు శాంతి పునరుద్ధరణకు భారత్ సహాయపడుతుందని తెలిపింది.

తీర్పు తేదీపై సందేహాలు -కుట్ర అనుమానాలు
ఆశ్చర్యకరంగా, హసీనాకు 1967 నవంబర్ 17న వివాహం జరిగిన రోజు, ఈ ఏడాది అదే తేదీన కోర్టు మరణశిక్ష విధించడం ప్రశ్నలను రేకెత్తిస్తోంది. కావాలనే ఈ తేదీని ఎంచుకుని రాజకీయ సందేశం ఇవ్వాలని యూనస్ ప్రభుత్వం ప్రయత్నించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని పరిశీలిస్తే, బంగ్లాదేశ్ రాజకీయాలు ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post