Indira Gandhi: ఇందిరా గాంధీ.. ఒక అధ్యాయం కాదు, ఒక యుగం!

Indira Gandhi: నేటి యువతలో చాలామందికి ఇందిరా గాంధీ అంటే ఎమర్జెన్సీ మాత్రమే అనే అభిప్రాయం కలగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల వెనుక ఉద్దేశం ఏమిటి? ఇందిరా గాంధీ మరణించి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచాయి. అంటే నేడు భారతదేశ జనాభాలో 50 శాతం మందికి పైగా ఆమె మరణానంతరం జన్మించిన వారే. ఈ తరం వారికి ఇందిరా గాంధీ అంటే ఏమి తెలియాలి?

Indira Gandhi
Indira Gandhi

ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, ఎన్నికల ద్వారా గెలిచి దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన నాయకురాలు. కానీ నేటి పాలకులు ఆమెను కేవలం ఎమర్జెన్సీతో మాత్రమే గుర్తింపజేయాలనుకుంటున్నారు. అయితే 1980 తర్వాత జన్మించిన వారు ఇందిరా జీవితాన్ని ఒక సంఘటనగా చూడాలా? లేక ఆ సంఘటనకే ఆమెను పరిమితం చేయాలా? అనేది వారి ఆలోచనపై ఆధారపడి ఉంది.

హరిత విప్లవం నుంచి శ్వేత విప్లవం వరకు: ఇందిరా గాంధీ జీవితంలో ఎమర్జెన్సీ కంటే కూడా గొప్ప విజయాలు ఎన్నో ఉన్నాయి. 1960 దశకంలో దేశం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అమెరికా నుంచి పి.ఎల్-480 పథకం ద్వారా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. దేశ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ సరిపడా ధాన్యం పండించలేని పరిస్థితి. అప్పుడు ఇందిరా గాంధీ తీసుకువచ్చిన హరిత విప్లవం వ్యవసాయరంగాన్ని మార్చేసింది. అలాగే దేశంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు శ్వేత విప్లవం ద్వారా పాలు ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

పర్యావరణ పరిరక్షణపై ఆమెకు ఉన్న మమకారం ప్రత్యేకం. వన్యప్రాణుల సంరక్షణకు ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ప్రాజెక్ట్ టైగర్ ఒక ప్రధాన మైలురాయి. అలాగే పర్యావరణ రక్షణ చట్టాలు రూపొందించి ప్రకృతి పరిరక్షణకు మార్గం సుగమం చేసింది.

Also Read: నేపాల్ విషయంలో నెహ్రూ చేసిన తప్పు! ఇందిరా గాంధీ అయితే నేపాల్‌ను భారత్‌లో కలిపే వారా?

బ్యాంకుల జాతీయీకరణ - ఆర్థిక సమానత్వానికి బాట: ఇందిరా గాంధీ తీసుకున్న అత్యంత విప్లవాత్మక నిర్ణయం బ్యాంకుల జాతీయీకరణ. అప్పటివరకు ధనవంతులు, వ్యాపారవేత్తలకే పరిమితమైన బ్యాంకింగ్ వ్యవస్థను పేద రైతులు, సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 1969లో దేశంలో 1,833 బ్యాంకులు ఉండగా, 1995 నాటికి ఆ సంఖ్య 33,004కి పెరిగింది. వాటిలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే స్థాపించబడ్డాయి.

వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుని బాధపడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. అంతేకాదు, సంస్థానాధీశులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల భరణాన్ని రద్దు చేసి సోషలిస్టు విధానాలకు అంకితభావాన్ని చూపింది.

‘అపర దుర్గ’గా నిలిచిన నాయకురాలు: 1971లో తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో హింసలు పెరగడంతో లక్షలాది మంది భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చారు. ఆ సమయంలో అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా ఇందిరా గాంధీ పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి విజయం సాధించారు. ఈ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. భారత చరిత్రలో ఇది గొప్ప విజయంగా నిలిచింది.

ఈ సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి, ఇందిరా గాంధీని “దుర్గామాత”తో పోల్చారు. అది ఆమె నాయకత్వం ఎంత దృఢంగా, దైవసదృశంగా ఉందో తెలిపే ఉదాహరణ.

పేదల హృదయాల్లో చోటు సంపాదించిన పథకాలు: 1971లో “గరీబీ హటావో” అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు నాంది పలికింది ఇందిరా గాంధీ. 1974లో రాజస్థాన్‌లో పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతంగా నిర్వహించడం, 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ఆమె దూరదృష్టికి నిదర్శనం.

‘ట్రికిల్ డౌన్’ సిద్ధాంతం పనిచేయడం లేదని గుర్తించి, ప్రభుత్వ పథకాలను నేరుగా పేదలకు చేరేలా చేసింది. 1975లో ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అభివృద్ధి తీసుకువచ్చింది.

విదేశాంగ విధానంలో దిట్ట - అలీన దేశాల నాయకురాలు: ప్రపంచం శీతల యుద్ధ ప్రభావంలో ఉన్నప్పుడు, ఇందిరా గాంధీ అమెరికా లేదా సోవియట్ యూనియన్ పక్షం కాకుండా తటస్థ విధానం అనుసరించింది. దాని ఫలితంగా ఢిల్లీలో అలీన దేశాల సదస్సు (NAM Summit) నిర్వహించి ఆ దేశాలకు నాయకత్వం వహించింది. ఈ తటస్థతే నేటికీ భారత విదేశాంగ విధానానికి మూలం.

‘ఎమర్జెన్సీ’ కంటే గొప్పదైన వారసత్వం: ఈ అన్ని విజయాలను పక్కనబెట్టి, కొందరు ప్రస్తుత పాలకులు ఇందిరా గాంధీ జీవితాన్ని కేవలం ఎమర్జెన్సీతో మాత్రమే గుర్తింపజేయాలనుకుంటున్నారు. కానీ ఆమె దూరదృష్టి, దౌత్యనైపుణ్యం, దృఢ నాయకత్వం, అభివృద్ధి దృక్పథం భారత చరిత్రలో చెరగని ముద్రవేసింది.

ఇందిరా పేరు చరిత్రలో చెరగదు: ప్రస్తుత పాలకులు మనుస్మృతి సిద్దాంతాలను ముందుకు తెస్తూ స్త్రీలు వంటింటికే పరిమితమవ్వాలనే భావనను ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇందిరా గాంధీ ఆ భావనను చెరిపేసి, మహిళలు దేశాన్ని నడిపే సామర్థ్యం ఉన్నారని నిరూపించింది. ఆమె విజయాలను పక్కనబెట్టి “ఎమర్జెన్సీ”ని మాత్రమే ముందుకు తేవడం, ఆమె చరిత్రను చెరిపేయాలనే మనువాద శక్తుల ప్రయత్నం. కానీ చరిత్ర చెప్పేది స్పష్టంగా ఒకటే ఇందిరా గాంధీ జీవితం ఎమర్జెన్సీ కాదు, అది ఒక యుగం.


Post a Comment (0)
Previous Post Next Post