Debt Management: మనుషులకు అప్పులు తీరకపోవడానికి అసలు కారణాలు ఇవే!

Debt Management: అందరి జీవితంలో డబ్బు సమానంగా ఉండదు. కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. రోజు వారి అవసరాలు మాత్రమే కాకుండా, ప్రత్యేక సందర్భాల్లో పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో, ఒకప్పుడు ఇతరుల వద్ద బాకీ అడిగేవారు. అయితే ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు, క్రెడిట్ కార్డుల ద్వారా అప్పులు తీసుకుని వాటిని తీర్చుకునే పరిస్థితి వచ్చింది. చిన్న అప్పులు లేదా రుణాలు ఏడాది నుండి రెండు సంవత్సరాల్లో తీరవచ్చు, కానీ కొన్ని అప్పులు జీవితాంతం తీరవు. అలాంటి అప్పులు ఎందుకు తీరవు? ఏ కారణాల వల్ల మనుషులు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతున్నారు? అనే విషయాలు ఈ బ్లాగ్ లో వివరంగా తెలుసుకుందాం.

Debt Management
Debt Management
అవసరంలేని అప్పుల ఉచ్చు
ఆర్థిక నిపుణుల ప్రకారం, అత్యవసరం అయితేనే అప్పు చేయాలి. కానీ నేటి జీవనశైలిలో చాలా మంది అవసరముకాకపోయినా లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను కొనసాగించేందుకు అప్పులు చేస్తున్నారు. ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం, కేవలం ప్రదర్శన కోసం డబ్బు ఖర్చు పెట్టడం వలన అప్పులు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా పెట్టుబడుల విషయంలో పొరపాట్లు చేయడం వల్ల జీవితమే ఆర్థిక బారం అవుతోంది.

ఇల్లు, కారు కొనుగోళ్లలో పొరపాట్లు
ఇల్లు కట్టుకోవాలని చాలా మంది ఆకాంక్షిస్తారు. కానీ తమ ఆదాయం పరిమితిలో కాకుండా, అదనంగా అప్పు చేసి భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. భూమిని కొనడం కొంతవరకు మంచిదే ఎందుకంటే దాని విలువ కాలక్రమేణా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్‌ కొనుగోలు చేయడం మాత్రం భవిష్యత్తులో నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ఐదు సంవత్సరాల తర్వాత ఫ్లాట్ విలువ తగ్గిపోతుంది. ఈ కారణంగా అనేక మంది భారీ రుణాల బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రుణాల వడ్డీ ఉచ్చు
ఉదాహరణకు, ఒక వ్యక్తి నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడనుకుందాం. పది సంవత్సరాల తర్వాత పది లక్షలు కూడబెట్టుకొని, మరో 30 లక్షలు అప్పు తీసుకుని మొత్తం 40 లక్షలతో ఒక ఫ్లాట్ కొంటాడు. కానీ ఎక్కువమందికి తెలియని విషయం ఏమిటంటే గృహ రుణాలపై వడ్డీ ముందుగానే వసూలు చేయబడుతుంది. మధ్యలో రుణం ఫ్రీ క్లోజ్ చేసినా, పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే మీరు చెల్లించే మొదటి సంవత్సరాల్లో ఎక్కువ భాగం వడ్డీగా వెళ్లిపోతుంది. ఇలా 20 నుండి 30 సంవత్సరాలపాటు రుణం కడుతూ జీవితం మొత్తాన్ని అప్పుల్లోనే గడిపే పరిస్థితి వస్తుంది.

ఇల్లు అవసరమే కానీ ప్రణాళికతో..
ఇల్లు ప్రతి ఒక్కరికీ అవసరమే. కానీ దాన్ని కొనుగోలు చేయడంలో ప్రణాళిక ఉండాలి. తమ వద్ద 80% ఆదాయం ఉండి, మిగిలిన 20% మాత్రమే అప్పు చేస్తే అది పెద్ద సమస్య కాదు. కానీ 20% మాత్రమే ఆదాయం ఉండి, మిగిలిన 80% అప్పు చేస్తే ఆర్థికంగా కూలిపోవడం ఖాయం. అదే మొత్తాన్ని సరైన పెట్టుబడుల్లో పెట్టినట్లయితే ఐదు నుంచి పది రెట్లు రాబడి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఆర్థిక స్థిరత్వం కోసం సరైన నిర్ణయం
ఇల్లు అనేది జీవితంలో ఒక పెద్ద నిర్ణయం. కానీ దానిని తీసుకునే ముందు తన ఆర్థిక స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే చిన్న ఇల్లు కొనుగోలు చేయడం, లేదా కొంతకాలం వేచి ఉండి సొమ్ము కూడబెట్టుకోవడం మంచిది. ఎందుకంటే తగిన ప్రణాళిక లేకుండా తీసుకున్న అప్పులు జీవితాంతం భారంగా మారి, మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి.


Post a Comment (0)
Previous Post Next Post