Steve Jobs Success Tips: ఈ భూమి మీద మనిషిగా జన్మించడం ఎంతో ఉన్నతమైనదీ, సార్ధకమైనదీ. ఈ జీవితాన్ని ఫలప్రదంగా మార్చుకోవాలంటే గొప్పగా జీవించాలి. అయితే గొప్పగా జీవించడం అంత సులభమైన పని కాదు. దానికి కొన్ని మార్గాలు, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. వాటిని అనుసరించాలంటే, మనం ఒక గొప్ప వ్యక్తి మార్గాన్ని అనుసరించాలి. అలాంటి గొప్ప వ్యక్తుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. ఆపిల్ సంస్థను స్థాపించి, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చిన ఆయన, ఉన్నతస్థితిలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొని మెరుగైన జీవన విధానం గురించి విలువైన మాటలు చెప్పారు. ఆ మాటలలో దాగిన జీవిత గాథను ఈరోజు మనం తెలుసుకుందాం.

- స్టీవ్ జాబ్స్ ప్రకారం, పిల్లలకు చదువు అనేది ధన సంపాదన కోసం మాత్రమే కాదు - జీవిత విలువలు అర్థం చేసుకునేందుకు ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ధనవంతులను చేయాలనే కోరికతో చదివించకూడదు. బదులుగా, మంచి మనుషులుగా మారేందుకు, మానవతా విలువలు నేర్చుకునేందుకు చదువు అవసరం. అప్పుడు వారికి చదువు ఎందుకు చదవాలో స్పష్టంగా తెలుస్తుంది. దీని ద్వారా జీవిత సారాన్ని కొంతవరకు వారు గ్రహించగలుగుతారు.
- ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలనీ, నోటికి అదుపులేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని స్టీవ్ జాబ్స్ హెచ్చరిస్తారు. శరీరానికి అవసరమైనంత మాత్రాన తినాలి. కంచం నిండా పెట్టుకొని, కడుపు నిండా తిని, కంటి నిండా నిద్ర పోయే అలవాటు తాత్కాలికంగా బాగుండవచ్చును కానీ, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. అందువల్ల ఆహారం విషయంలో స్పష్టమైన జాగ్రత్తలు అవసరం.
- ప్రతిరోజూ ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని చూస్తూ వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. అనంతరం కొంత విశ్రాంతి తీసుకుని, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. తరువాత విధుల్ని నిర్వర్తిస్తూ, స్నేహితులతో సమయం గడపాలి. ఈ శారీరక, మానసిక ఆరోగ్యపు భాగాల్లో ఏదైనా ఒకటి లోపిస్తే, అది మన జీవన గమనాన్ని ప్రభావితం చేస్తుంది.
- లక్ష్యాలను త్వరగా సాధించాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ పెద్ద లక్ష్యాలను సాధించాలంటే బృందంగా ముందుకు సాగాలి. ప్రేమించిన వ్యక్తి నిజంగా ప్రేమిస్తే మనల్ని వదిలి పోడు. విడిపోవాలనుకుంటే మాత్రం అనేక కారణాలు చెబుతాడు. ప్రేమకి కారణం ఉండకూడదు, కారణాల వల్ల విడిపోకూడదు. నమ్మకం లేకపోతే, అభిమానం లేకపోతే అది ప్రేమ కాదని, అలాంటి అనుబంధాలను ప్రేమగా భావించకూడదని స్టీవ్ జాబ్స్ స్పష్టం చేశారు.
- ఈ విలువైన మాటలను స్టీవ్ జాబ్స్ అనేక సందర్భాల్లో పంచుకున్నారు. ఆయనను కేవలం ఓ బిజినెస్ టైకూన్ గా కాకుండా, జీవితం పట్ల లోతైన అవగాహన ఉన్న తాత్వికుడిగా భావించవచ్చు. అందుకే నేటికీ ఆయన మాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అనేక మంది వాటిని అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు.