Aeroponic Saffron Flowers Bloom in Telangana: తెలంగాణలో సాఫ్రాన్ సాగుకు నూతన అవకాశం!

Aeroponic Saffron Flowers Bloom in Telangana: తెలంగాణలో కూడా కాశ్మీర్ పువ్వు పూయబోతోంది. కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండే విలువైన కుంకుమపువ్వు (సాఫ్రాన్) ను రాష్ట్రంలోనూ విజయవంతంగా పండించవచ్చని హార్టికల్చర్ వర్సిటీ నిరూపించింది. ఏరోఫోనిక్ టెక్నాలజీ ఆధారంగా నియంత్రిత వాతావరణంలో సాగుచేసిన ఈ పంట కేవలం రెండు నెలల్లోనే అధిక నాణ్యత, మంచి దిగుబడిని ఇచ్చి రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త అవకాశాలను తెరిచింది. నాబార్డ్ సహకారంతో వనపర్తి జిల్లా మోజర్లలోని హార్టికల్చర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మోడల్ ల్యాబ్ ఈ ప్రాజెక్టుకు కేంద్రంగా నిలిచింది.

Aeroponic Saffron Flowers Bloom in Telangana
Aeroponic Saffron Flowers Bloom in Telangana

శాస్త్రీయ సాగుతో సాధ్యమైన అద్భుతం
ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన 200 చదరపు అడుగుల ఏరోఫోనిక్ యూనిట్‌లో కాశ్మీర్‌ నుంచి తీసుకొచ్చిన కుంకుమపువ్వు కాడలను నాటారు. కాశ్మీర్ వాతావరణాన్ని పోలి ఉండేలా పగలు-రాత్రి ఉష్ణోగ్రతలు, తేమ, కాంతి, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను ప్రత్యేక పరికరాలతో నియంత్రించారు. మొబైల్ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. ఫలితంగా మొక్కలు వేగంగా పెరిగి పుష్పించడం ప్రారంభించాయి. నాణ్యత, దిగుబడి రెండూ అంచనాలను మించడంతో శాస్త్రవేత్తలు మరింత విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.

Also Read: తెలంగాణలోని కనకగిరి అడవుల్లో అరుదైన 'స్కై బ్లూ మష్రూం'

ఏరోఫోనిక్ పద్ధతి - భవిష్యత్‌ వ్యవసాయం
ఏరోఫోనిక్ సాంకేతికతలో మొక్కలు నేల లేకుండానే పెరుగుతాయి. నీటి వినియోగం తక్కువగా ఉండటం, పూర్తిగా సేంద్రీయ ఉత్పత్తి సాధ్యమవటం, కూలీల అవసరం తగ్గిపోవటం దీని ప్రధాన ప్రయోజనాలు. నాణ్యమైన దిగుబడి రావటం రైతులకు ఆశాజనకంగా ఉండటంతో ఇప్పటికే అనేకమంది ఈ పద్ధతిపై ఆసక్తి చూపుతున్నారు.

కాశ్మీర్‌ వెలుపల సాఫ్రాన్ సాగుకు పెద్ద అవకాశం
ప్రస్తుతం సంప్రదాయ సాఫ్రాన్ సాగు జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా, శ్రీనగర్, బుద్గామ్ ప్రాంతాలకే పరిమితం. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ విస్తరణ, వాతావరణ మార్పుల ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఉత్పత్తి నాణ్యతపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ పద్ధతులపై పరిశోధనలు పెరుగగా, ఏరోఫోనిక్ పద్ధతి అత్యుత్తమ ఫలితాలను ఇస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Saffron Cultivation
Saffron Cultivation

రూరల్ ఎకానమీకి కొత్త ఊపిరి
సాఫ్రాన్ సాగు ప్రయోగం విజయవంతం కావడం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ పంట పట్ల ఆసక్తి ఉన్న రైతులు, యువత కోసం త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇది భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అత్యుత్తమ దిగుబడితో శాస్త్రవేత్తలకు నమ్మకం
“కాశ్మీర్ వాతావరణాన్ని ల్యాబ్‌లోనే సృష్టించి సాగు చేశాం. నాణ్యత, దిగుబడి రెండూ అత్యుత్తమంగా వచ్చాయి. ఆసక్తి ఉన్న వారు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు,” అని ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ పిడిగం సైదయ్య తెలిపారు.

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ ల్యాబ్లు
పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఏరోఫోనిక్ టెక్నాలజీని మరింత విస్తృతంగా రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు హార్టికల్చర్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి వెల్లడించారు. అవసరాన్ని బట్టి ప్రాంతాల వారీగా సాఫ్రాన్ మోడల్ ల్యాబ్లను ఏర్పాటు చేసి శిక్షణ అందించే ప్రణాళిక సిద్ధమవుతోంది. తెలంగాణలో సాఫ్రాన్ సాగుకు ఇది చారిత్రాత్మక ఆరంభమని, భవిష్యత్తులో రాష్ట్రం దేశంలోనే ప్రత్యామ్నాయ సాఫ్రాన్ ఉత్పత్తి కేంద్రంగా ఎదగగలదని నిపుణులు భావిస్తున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post