Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం!

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయ్యాక ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించగా, ఈ కార్యక్రమాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. డిసెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ, మొదట గ్రామాల్లోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Local Body Elections
Telangana Local Body Elections

ఆర్థిక సంఘం గడువు ప్రభావం
మార్చి 31తో 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగుస్తుంది. అప్పటిలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన రూ.3,000 కోట్ల నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో, రిజర్వేషన్లను పార్టీ పరంగా కూడా 42% ఇవ్వాలని మంత్రివర్గం ఆమోదించింది.

Also Read: ఓరుగల్లులో 70 కోట్లతో అద్దాల వంతెన, ఐలాండ్ నిర్మాణం!

రిజర్వేషన్ల పునర్విభజన - ప్రత్యేక కమిషన్ బాధ్యత
ప్రస్తుతం అమల్లో ఉన్న 23% బీసీ రిజర్వేషన్‌ను గ్రామాల వారీగా పునర్విభజన చేసి, మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండేలా చూసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. రిజర్వేషన్ల తుది ఖరారు కోసం ఈ కమిషన్‌కు వారం రోజుల సమయం పడే అవకాశముంది. కమిషన్ నివేదిక అందిన తర్వాత 2–3 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది.

పార్టీ తరఫున బీసీలకు అధిక ప్రాధాన్యం
పంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితమైనప్పటికీ, పార్టీ తరఫున పోటీ చేసే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎంపికలో కనీసం 42% బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. అవసరమైతే ఈ శాతం 60% వరకు పెంచాలని కూడా ఆయ‌న అన్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు స్పష్టంగా మార్గనిర్దేశం చేయాలని మంత్రులకు ఆదేశించారు.

కోర్టుల మార్గదర్శకాల మేరకు చర్యలు
రిజర్వేషన్లు 50% పరిమితిని దాటకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించిన నేపథ్యంలో, రిజర్వేషన్ల ఖరారును ప్రత్యేక కమిషన్‌కే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24న హైకోర్టు విచారణ అనంతరం, 29న జరిగే తదుపరి క్యాబినెట్ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

డిసెంబర్ 8-9 తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు
డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సమ్మిట్ కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న ప్రజాపాలనా విజయోత్సవాల ఏర్పాట్లను కూడా సమీక్షించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం - మంత్రుల ధీమా
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు విడిగా సమావేశమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సాధించిన విజయంపై చర్చించారు. ఈ గెలుపు ప్రభుత్వ పనితీరు పై ప్రజలు చూపిన నమ్మకానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. బీసీలు, ముస్లింలు, సెటిలర్ల ఓటు బ్యాంక్ పార్టీకి బలం చేకూరుస్తోందని చెప్పారు. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధించగలమని వారు ధీమా వ్యక్తం చేశారు.


Post a Comment (0)
Previous Post Next Post