YS Rajasekhara Reddy Death Anniversary: ఏ రంగంలోనైనా కొంతమంది మహానుభావుల చరిత్రను లిఖించటానికి కొన్ని పేజీలు సరిపోతాయి. అలాంటి వారు భావితరాల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి లెజెండరీ లీడర్ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత. నిస్సత్తువలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన మహామనిషి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించిన జననేత. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు సిసలైన లీడర్. ఆయన మరణించి 16 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆయన చేసిన మేలును మరువలేకపోతున్నారు. నేడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఒక ప్రత్యేక కథనం.
![]() |
YS Rajasekhara Reddy Death Anniversary |
చెరగని ముద్ర
“వైయస్సార్” అనే పేరు వినగానే ఒక స్వచ్ఛమైన చిరునవ్వు కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. “నమస్తే అక్కయ్య.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడు..” అంటూ ఆప్యాయంగా పలికిన ఆయన స్వరం ప్రజల చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల అడవుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం సులభమైనది కాదు. ఫ్యాక్షన్ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఆ నీడ తన పాలనపై పడకుండా నిరూపించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను ఎదుర్కొంటూ, రాజకీయ ప్రత్యర్థులను ఢీకొంటూ, వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఆయన ఘనత.
పేదల వైద్యుడిగా ప్రారంభం
1949 జూలై 8న కడప జిల్లా పులివెందులలో జన్మించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు వైద్య వృత్తిలో అడుగుపెట్టారు. పులివెందులలో పేదల వైద్యుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అనంతరం 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, మంత్రిగానూ సేవలు అందించారు. పులివెందులను తన కంచుకోటగా మార్చారు.
వరుసగా ఐదు సార్లు అసెంబ్లీకి, నాలుగు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1994, 1999లో కాంగ్రెస్ పార్టీ ఓటములు చవిచూసినా, 2003లో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, “నేనున్నాను” అంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కాకపోయినా, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఉచిత విద్యుత్ పై తొలి సంతకం
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే రైతుల సంక్షేమం కోసం తొలి ఫైల్‌గా ఉచిత విద్యుత్‌పై సంతకం చేశారు. 1100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్‌లు, 104 సేవలు, జలయజ్ఞం, వ్యవసాయ రుణాల మాఫీ వంటి అనేక వినూత్న పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు.
2009లో టిడిపి మహాకూటమి, ప్రజారాజ్యం పార్టీ ఎదురీత ఉన్నా, ఒంటరి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేశారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ నాలుగు నెలలకే, సెప్టెంబర్ 2, 2009 ఉదయం 9:27 గంటలకు నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆయన దుర్మరణం చెందారు. ఆ మహానేత మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దుఃఖంలో మునిగిపోయింది.
ఎప్పటికీ స్ఫూర్తి
రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైనా, ఆయన స్ఫూర్తి, ఆయన చూపిన మార్గం తెలుగు నేలపై ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే మహానేతగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారు.