H-1B Visa Fee Hike 2025: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజును 1,00,000 డాలర్లకు పెంచినట్లు ప్రకటించడంతో భారతీయ వీసా హోల్డర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీపావళి, సంవత్సరాంతపు సెలవుల సీజన్‌కు కొద్ది రోజుల ముందు వచ్చిన ఈ ప్రకటనతో అనేక కుటుంబాల ప్రణాళికలు దెబ్బతిన్నాయి. చివరి నిమిషంలో చాలామంది తమ విమాన టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కొందరు తమ వివాహ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
![]() |
H-1B Visa Fee Hike 2025 |
ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసిన ప్రకారం, ఈ కొత్త ఫీజు నియమాలు కేవలం కొత్త వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటికే H-1B వీసా కలిగిన వారు $1,00,000 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అధికారికంగా పూర్తి వివరాలు అందకపోవడం, సరైన సమాచార లోపం కారణంగా భారతీయ వీసా హోల్డర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. విదేశాల్లో చిక్కుకుపోతామేమో అన్న భయంతో చివరి నిమిషంలో ప్రయాణాలను రద్దు చేసుకున్నామని పలువురు జాతీయ మాధ్యమాలకు తెలిపారు.
ఈ ప్రకటనకు ముందు చాలా మంది భారతీయులు దీపావళి కోసం స్వదేశానికి వెళ్లేందుకు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. డిసెంబర్ సెలవుల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపాలని భావించారు. కానీ ట్రంప్ నిర్ణయం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈసారి ప్రయాణం సాధ్యమా కాదా అన్న ఆందోళనలో ఉన్నామని పలువురు వాపోతున్నారు. ఈ చర్యను కొందరు ‘ప్రయాణ నిషేధం’లా అభివర్ణిస్తున్నారు.
Also Read: భారత్‌పై ఆధారపడే దేశాలు ఇవే! నేపాల్ నుంచి ఖతర్ వరకు భారత్ సహాయం
H-1B వీసా చెల్లుబాటు ఉన్నప్పటికీ, పెరిగిన ఫీజు రుజువులు లేకపోతే అమెరికా ప్రవేశం సాధ్యం కాదనే అనుమానాలు మరింత భయాన్ని పెంచుతున్నాయి. దీనిపై పూర్తి మార్గదర్శకాలు లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కొన్ని ప్రముఖ టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను హెచ్చరిస్తూ, ముందుగా దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే అమెరికా వెలుపల ఉన్నవారు తిరిగి రాకూడదని అంతర్గత మెమోలు జారీ చేశాయి.
ఈ ప్రభావం కేవలం H-1B వీసా హోల్డర్లకే పరిమితం కాకుండా, H4 వీసా కలిగిన వారి కుటుంబాలు, F-1 విద్యార్థులు, L-1 వర్క్ వీసా హోల్డర్లపై కూడా ఎంత మేరకు ఉంటుందో స్పష్టత లేకపోవడంతో వాతావరణం మరింత గందరగోళంగా మారింది. ముఖ్యంగా దీపావళి, సంవత్సరాంతపు సెలవుల సమయంలో వచ్చిన ఈ నిర్ణయం వందలాది కుటుంబాల ప్రణాళికలను తారుమారు చేసింది. ప్రస్తుత H-1B హోల్డర్లపై తక్షణ ప్రభావం లేకపోయినా, భవిష్యత్తులో ఎలాంటి నియమాలు వస్తాయో తెలియకపోవడమే ఆందోళనలకు కారణమైంది.
ఇక అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఐటీ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని, పనికి రాని వ్యక్తులను దేశంలోకి అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం అత్యుత్తమ ప్రతిభావంతులు, విలువైన నిపుణులు మాత్రమే అమెరికాకు రావాలని సూచించారు. శిక్షణ అవసరమైతే, అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులను మాత్రమే ఎంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీస్తూ, నెటిజన్ల ఆగ్రహాన్ని రేపుతున్నాయి.
Also Read: ‘జెన్ Z’ అంటే ఎవరు.. గ్రూపులు ఎన్ని?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS