Buying Electric Bike Tips: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. వీటిని కొనడం మంచి నిర్ణయమే. ఎందుకంటే పెట్రోల్ ఖర్చు తగ్గిపోతుంది, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.
![]() |
Buying Electric Bike Tips |
కానీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి. లేకపోతే తర్వాత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
1. రేంజ్, ఛార్జింగ్ ఇబ్బందులు: పెట్రోల్ స్కూటర్‌లను ఎక్కడైనా పెట్రోల్ బంకులో కొన్ని నిమిషాల్లో నింపుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇది సాధ్యం కాదు. వీటికి ఒక పరిమిత రేంజ్ ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత కొన్ని కిలోమీటర్ల వరకే ప్రయాణించవచ్చు. నగర ప్రయాణాలకు ఇవి బాగానే ఉపయోగపడతాయి కానీ, దూర ప్రయాణాలకు అనుకూలం కావు. ముఖ్యంగా మీ నగరంలో ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉంటే లాంగ్ డ్రైవ్ కష్టమవుతుంది. పైగా ఒకసారి ఛార్జ్ కావడానికి గంటల తరబడి సమయం పడుతుంది.
2. బ్యాటరీ జీవితం, ఖర్చు: ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత ఖరీదైన భాగం దాని బ్యాటరీ. చాలా కంపెనీలు 7-8 ఏళ్ల వారంటీ ఇస్తాయి. కానీ ఆ తర్వాత కొత్త బ్యాటరీ తప్పనిసరిగా కొనాలి. కొత్త బ్యాటరీ ధర స్కూటర్ విలువలో 40-50% వరకు ఉండవచ్చు. కాబట్టి దీని వల్ల భారీ ఖర్చు మిగిలే అవకాశం ఉంటుంది.
Also Read: న్యూమెరోస్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘డిప్లోస్ మ్యాక్స్+’.. అప్‌గ్రేడ్ ఫీచర్లతో లాంచ్!
3. విద్యుత్ ఖర్చు, మెయింటెనెన్స్: పెట్రోల్ అవసరం లేకపోయినా, స్కూటర్ ఛార్జ్ చేయడానికి విద్యుత్ ఖర్చవుతుంది. దీనివల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది. ఇది పెట్రోల్‌తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఖర్చు మాత్రం ఉంటుంది. సాధారణ మెయింటెనెన్స్ తక్కువగానే ఉంటుంది. కానీ పెద్ద ఎలక్ట్రానిక్ భాగం దెబ్బతింటే మరమ్మత్తు చేయడం చాలా ఖరీదుగా ఉంటుంది.
4. టాప్ స్పీడ్, పనితీరు: చాలా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వేగం పెట్రోల్ స్కూటర్లంత ఉండదు. హైవే ప్రయాణాలకు వీటి పనితీరు తగినంతగా ఉండకపోవచ్చు. ఎత్తైన రోడ్లు, ఎక్కువ బరువుతో ప్రయాణించినప్పుడు స్పీడ్ ఇంకా తగ్గిపోతుంది. పైగా బరువు పెరిగితే రేంజ్ కూడా తగ్గుతుంది.
5. ధర: మంచి రేంజ్, ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఖరీదైనవే. తక్కువ బడ్జెట్ ఉన్నవారు చిన్న రేంజ్, పరిమిత ఫీచర్లు ఉన్న మోడల్ కొనాల్సి వస్తుంది. కాబట్టి ధర పరంగా ఇవి అంత సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు.
ఎవరికి ఎలక్ట్రిక్ స్కూటర్ సరిపోతుంది?
మీ రోజువారీ ప్రయాణం నగరంలో కొద్దిగా మాత్రమే ఉంటే, ఇంట్లో ఛార్జ్ చేసుకోవడానికి తగిన సదుపాయం ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఎంపిక అవుతుంది. కానీ మీరు తరచుగా లాంగ్ ట్రిప్స్ చేయాలని, ఎక్కువ బరువు మోయగలిగే లేదా వేగంగా వెళ్లగలిగే వాహనం కావాలని అనుకుంటే పెట్రోల్ స్కూటర్ ఉత్తమ ఎంపిక అవుతుంది.