Nepal Gen Z Protest: ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ప్రభుత్వాన్ని కూల్చిన తరువాత కూడా నేపాల్‌లో పరిస్థితులు శాంతించలేదు. జనరల్ జెడ్ ఆధ్వర్యంలోని నిరసనకారులు రాజ్యాంగ సవరణ కోరుతూ, దేశాన్ని దోచుకున్న ఆస్తులపై విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వం పడిపోయినా అశాంతి మాత్రం కొనసాగుతోంది. కాఠ్మాండు, లలిత్‌పూర్, భక్తపూర్ వంటి ప్రధాన నగరాల్లో నిన్న రాత్రి నుంచే సైన్యం భద్రతా బాధ్యతలు చేపట్టి కఠిన ఆంక్షలు అమలు చేసింది.
![]() |
Nepal Gen Z Protest |
నిరసనల్లో మృతులైన 22 మందిని “అమర వీరులు”గా ప్రకటించి, వారి కుటుంబాలకు గౌరవం, ఆర్థిక సాయం, అధికారిక గుర్తింపు ఇవ్వాలని ఉద్యమ నిర్వాహకులు కోరుతున్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా నిరుద్యోగం, వలసలు, సామాజిక అన్యాయం వంటి సమస్యలపై ప్రత్యేక చర్యలు అవసరమని సూచిస్తున్నారు. “ఈ ఉద్యమం ఏదైనా రాజకీయ పార్టీ కోసం కాదు, ఏకంగా ఒక తరం భవిష్యత్తు కోసం. శాంతి తప్పనిసరి, కానీ అది కొత్త రాజకీయ వ్యవస్థపై ఆధారపడాలి” అని వారు స్పష్టం చేశారు. సైన్యం మాత్రం ఒక ప్రకటనలో, “కొన్ని వర్గాలు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకొని సాధారణ ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు పెద్ద నష్టం కలిగిస్తున్నాయి” అని హెచ్చరించింది.
Also Read: నేపాల్‌లో అల్లర్లు.. అమెరికా-చైనా కుట్రలేనా?
నిరసనకారుల కీలక డిమాండ్లు
- ప్రస్తుత ప్రతినిధుల సభను వెంటనే రద్దు చేయాలి
- పౌరులు, నిపుణులు, యువత చురుకైన పాత్ర పోషించేలా రాజ్యాంగాన్ని సవరించాలి లేదా కొత్త రాజ్యాంగం రూపొందించాలి
- తాత్కాలిక కాలం ముగిశాక స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో కొత్త ఎన్నికలు నిర్వహించాలి
- నేరుగా ప్రజల చేత ఎన్నికయ్యే విధంగా కార్యనిర్వాహక నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి
- గత మూడు దశాబ్దాల్లో నాయకులు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపి, అక్రమ ఆస్తులను జాతీయీకరించాలి
- ఐదు ప్రధాన రంగాల్లో (విద్య, ఆరోగ్యం, న్యాయం, భద్రత, సమాచార వ్యవస్థ) నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలి
Also Read: నేపాల్ అల్లర్ల వెనుక కారణం ఏమిటి?