Zscaler CEO Jay Chaudhry Biography: 5 స్టార్టప్‌లు స్థాపించి బిలియనీర్‌ అయిన ఇండియన్ సక్సెస్ స్టోరీ తెలుసా?

Zscaler CEO Jay Chaudhry Biography: అమెరికా ఎంతో మంది ఔత్సాహికులకు కలల ప్రపంచం. ఆ దేశంలో మాస్టర్స్ చేసి, అక్కడ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించడం అనేది లక్షలాది భారతీయుల కల. అయితే, జై చౌదరి అనే వ్యక్తి ఆ కలను సాదా ఉద్యోగంతో కాకుండా, స్వంత కంపెనీలు స్థాపించే స్థాయిలో సాకారం చేసుకున్నాడు. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు కంపెనీలను స్థాపించి, అత్యంత ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించాడు. ఆయన వయస్సు ప్రస్తుతం 66 సంవత్సరాలు.

Zscaler CEO Jay Chaudhry Biography
Zscaler CEO Jay Chaudhry Biography

ఫోర్బ్స్ విడుదల చేసిన '2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్' జాబితా ప్రకారం, జై చౌదరి ఆస్తి విలువ 17.9 బిలియన్ డాలర్లు. అంటే, అమెరికాలోని భారత వలస బిలియనీర్లు -2025 లిస్ట్ ప్రకారం అత్యంత ధనవంతుల జాబితాలో జై చౌదరి అగ్రస్థానాల్లో నిలిచారు. కానీ ఈ స్థాయి సాధించడానికి ఆయన చేసిన కృషి అసాధారణం. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలోని నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన జై చౌదరి, ఈ స్థాయికి ఎలా ఎదిగారు? ఇప్పుడు తెలుసుకుందాం.

జై చౌదరి భారత్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పనోహ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టినప్పుడు ఇంట్లో కనీసం విద్యుత్ సరఫరా కూడా లేదు. దీంతో చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సి వచ్చేది. కానీ ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న చౌదరి, అద్భుతంగా చదువుతూ ఐఐటీ వారణాసిలో (ప్రస్తుతం IIT-BHU) సీటు సంపాదించాడు. అక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

అమెరికా ప్రయాణం: 1980లో అమెరికా వెళ్లిన చౌదరి, అక్కడ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ఎమ్‌ఎస్, అలాగే మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. చదువు పూర్తయ్యాక IBMలో ఉద్యోగం సంపాదించారు. అనంతరం Unisys, IQ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 25 ఏళ్లపాటు అనుభవాన్ని పొందారు.

స్టార్ట్‌ప్స్ నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారం వరకు: 1996లో తన భార్య జ్యోతి తో కలిసి తొలి స్టార్ట్‌అప్‌ను ప్రారంభించారు. అది ఒక్క కంపెనీగానే ఆగలేదు. ఆ తర్వాత సెక్యూర్ఐటి, సైఫర్‌ట్రస్ట్, కోర్‌హార్బర్, ఎయిర్ డిఫెన్స్, జెడ్ స్కేలర్ అనే ఐదు కంపెనీలను స్థాపించి విజయం సాధించారు.

ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందినవే. ముఖ్యంగా క్లౌడ్ టెక్నాలజీలో నడిచే జెడ్ స్కేలర్ కంపెనీ, జై చౌదరి జీవితాన్నే మలిచేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను జెడ్ స్కేలర్ స్థాపించినప్పుడు మార్కెట్ క్లౌడ్ టెక్నాలజీకి సిద్ధంగా లేదు. తొలి దశలో ఎంతో సమయం, డబ్బు ఖర్చ అయ్యింది. కానీ ఇప్పుడు మేమే ఈ రంగంలో అగ్రగామి,” అని తెలిపారు.

గుర్తింపులు: చౌదరి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బనారస్ హిందూ విశ్వవిద్యాలయం), వారణాసి నుండి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఆయనకు అలుమనస్ ఆఫ్ ది ఇయర్ (2015), అలుమనస్ ఆఫ్ ది సెంచరీ ఇన్ మేకింగ్ (2019), మరియు డిస్టింగ్విష్డ్ అలుమనస్ అవార్డులు (202122) లభించాయి.

అలాగే, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ నుండి కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు (2022)ను కూడా అందుకున్నారు. 2018లో ఉత్తర కాలిఫోర్నియాలో నిర్వహించిన EY ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కార్యక్రమానికి జై ఫైనలిస్ట్ గా ఎంపికయ్యారు.

వ్యక్తిగత జీవితం: చౌదరి మరియు ఆయన భార్య జ్యోతిలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న రెనో నగరంలో నివసిస్తున్నారు. జై శాఖాహారి. ఆయనకు హైకింగ్, వైట్-వాటర్ రాఫ్టింగ్, అలాగే తన కుటుంబంతో కలిసి తన పరిసరాల్లో "బాండింగ్ వాక్‌లు" చేయడం ఎంతో ఇష్టం. జై చౌదరి ఒక విపరీతమైన పాఠకుడు. ఆయనకు చరిత్ర, ప్రపంచ రాజకీయాలు, మనస్తత్వశాస్త్రం వంటి అంశాలపై పుస్తకాలు చదవడం విశేషంగా నచ్చుతుంది.

దాతృత్వం: సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో జై చౌదరి భారతదేశంలోని తన పుట్టిన ఊరు పనోహ్ కు తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. 2011లో ఆయన అక్కడ వృద్ధుల కోసం రక్త పరీక్షలు మరియు ఇతర వైద్య సేవల కోసం మొబైల్ మెడికల్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు.

2022లో, ఆయన తన ఆల్మా మేటర్ అయిన IIT-BHUకు $1 మిలియన్ డాలర్లు విరాళంగా అందించి, పాఠశాల యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ మరియు సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధికి నిధులు సమకూర్చారు. అదే సంవత్సరం, COVID సహాయ చర్యలకు మద్దతుగా భారతదేశంలోని నిరుపేదల జీవితాలను మెరుగుపరచడంలో కట్టుబడి ఉన్న అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (AIF) యొక్క బే ఏరియా చాప్టర్కు $3 మిలియన్ డాలర్లు విరాళాన్ని అందించారు.

2023లో, భారతదేశంలో నయం చేయగల అంధత్వాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న శంకర ఐ ఫౌండేషన్ కు జై చౌదరి $1 మిలియన్ డాలర్లు విరాళంగా అందించారు.

చౌదరి యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి మార్గదర్శకత్వం ఇవ్వడం కూడా జై చౌదరి అభిరుచుల్లో ఒకటి. ఆయ‌న అనేక వేదికలపై ప్రసంగిస్తూ "సాధించాలంటే కష్టపడాలి, కానీ నిజాయతీతో జీవించాలి" అనే సందేశాన్ని యువతకు అందిస్తున్నారు.

చివరగా.. జై చౌదరి జీవితం మనకు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎక్కడ పుట్టామో కాదు, ఎలా పెరిగామో కాదు… మనం ఎదుగుదల కోసం ఎంత శ్రమించామనేదే ముఖ్యం. అతని కథ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ప్రపంచస్థాయి బిలియనీర్‌గా మారిన ప్రయాణం మాత్రమే కాదు… అది నిరంతర పట్టుదల, దూరదృష్టి, మారిపోతున్న టెక్నాలజీ ప్రపంచంలో సాహసపూరితంగా ముందడుగు వేసే ధైర్యానికి నిదర్శనం. ఈ కథ ఎన్నో యువ హృదయాలను ప్రభావితం చేస్తుంది.

Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post