Saudi-Pakistan Defense Deal: సౌదీ-పాకిస్తాన్‌ వ్యూహాత్మక బంధం.. భారత్‌కు ముప్పా?

Saudi-Pakistan Defense Deal: భారతదేశం ఇప్పటికే అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరోవైపు వాణిజ్య పరంగా చైనా, రష్యాలతో పాటు బ్రిక్స్‌ వేదికగా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌, వచ్చే నాలుగేళ్లలో మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రత్యర్థి దేశం పాకిస్తాన్‌ మరియు మిత్రదేశం సౌదీ అరేబియాల మధ్య కొత్త రక్షణ ఒప్పందం కుదరడం చర్చనీయాంశంగా మారింది. 

Saudi-Pakistan Defense Deal
Saudi-Pakistan Defense Deal

2025 సెప్టెంబర్‌ 17న రియాధ్‌లో జరిగిన సమావేశాల్లో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, పాకిస్తాన్‌ ప్రధాని షెహ్బాజ్‌ షరీఫ్‌ల మధ్య ‘స్ట్రాటజిక్‌ మ్యూచువల్‌ డిఫెన్స్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌ఎండీఏ)’పై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై జరగబోయే దాడిని, ఇరుదేశాలపైన జరిగిందిగా పరిగణిస్తారు. ఇది ఇప్పటికే కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా ఖతర్‌పై ఇజ్రాయెల్‌ దాడి తర్వాత ఈ ఒప్పందం మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాల్లో కీలక మలుపు కానుంది.

సౌదీ-పాకిస్తాన్‌ సంబంధాల చరిత్ర: సౌదీ-పాకిస్తాన్‌ సంబంధాలు పాకిస్తాన్‌ స్వాతంత్య్రం పొందిన 1947లోనే ప్రారంభమయ్యాయి. 1951లో ‘స్నేహ ఒప్పందం’ ద్వారా రాజకీయ, సైనిక, ఆర్థిక రంగాల్లో సహకారం పెరిగింది. ఈ సంబంధం ముస్లిం ఐక్యత, మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలు, ఆర్థిక ఆధారపాటు అంశాలపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్‌ అణ్వస్త్రాలు కలిగిన దేశంగా సౌదీకి ఒక రక్షణ భరోసాగా నిలుస్తోంది. 19651970 మధ్య ఒమాన్‌లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ సైనికులు ఒమాన్‌ తరఫున పోరాడారు. 1979లో మక్కా మస్జిద్ ఆక్రమణ సంఘటన సమయంలో సౌదీకి పాకిస్తాన్‌ సైనిక సహాయం అందించి తీవ్రవాదులను అణచివేశారు. 1990 దశకానికి చేరేసరికి సౌదీ, యూఏఈ, ఒమాన్‌ రక్షణలో పాకిస్తాన్‌ సైన్యం ప్రత్యక్షంగా పాల్గొన్నది.

హౌతీలపై సౌదీ యుద్ధంలో పాకిస్తాన్‌ పాత్ర: 2015 నుంచి యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా చేపట్టిన సైనిక చర్యల్లో పాకిస్తాన్‌ బలగాలు భాగమయ్యాయి. ఇరాన్‌ మద్దతు పొందిన హౌతీలను అణచివేయడానికి పాకిస్తాన్‌ తన సైనికులను పంపింది. సౌదీ ఆర్థిక సహాయంపై ఆధారపడి ఈ చర్యలు జరిగాయి. నేటికీ అనేక పాకిస్తాన్‌ మాజీ సైనిక అధికారులు సౌదీ డిఫెన్స్‌ సలహాదారులుగా, రాజకుటుంబ భద్రతా బలగాల్లో పనిచేస్తున్నారు. ఈ విధంగా పాకిస్తాన్‌ను "కిరాయి సైనిక దేశం"గా విమర్శలు రావడానికి కారణమైంది.

తాజా ఒప్పందం ప్రత్యేకత: ఎస్‌ఎండీఏ ఒప్పందం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌ అణు సామర్థ్యం సౌదీకి ఒక రక్షణ వలయంలా నిలుస్తుంది. అమెరికాపై ఆధారపడకుండా, ఇరాన్‌, హౌతీ తిరుగుబాటుదారుల వంటి బెదిరింపులకు సౌదీ స్వతంత్రంగా ప్రతిస్పందించాలని ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఖతర్‌పై ఇజ్రాయెల్‌ దాడి, సౌదీ భూభాగంలో అమెరికా సైనిక స్థావరాలపై వచ్చిన అనుమానాలు కూడా ఈ ఒప్పందానికి దారితీశాయి. మరోవైపు పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ సౌదీ ఆర్థిక సహాయం కీలకమైంది. అయితే విమర్శకులు దీన్ని పరస్పర సహకారంగా కాకుండా, సౌదీ ఆధిపత్యంగా అభివర్ణిస్తున్నారు.

భారతదేశానికి వచ్చే ప్రభావాలు: భారత్‌లో ఈ ఒప్పందం పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. భారత్-పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు దృష్ట్యా సౌదీ-పాకిస్తాన్‌ సైనిక బంధం భారత భద్రతకు సవాలు కానుందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌ అణ్వస్త్ర సాంకేతికత సౌదీకి చేరే అవకాశం ఉందన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇది మధ్యప్రాచ్య-దక్షిణాసియా శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉంది. అయితే భారత్-సౌదీ సంబంధాలు వాణిజ్యం, పెట్టుబడులు, కార్మిక వలసలతో బలంగా ఉన్నాయి. భారత్‌లోని లక్షలాది కార్మికులు సౌదీ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా ఉన్నారు. అందువల్ల సౌదీ పాకిస్తాన్‌ను కేవలం రక్షణ అవసరాల కోసం ఉపయోగించుకుంటుందని, భారత్‌ను దూరం చేయదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా సౌదీ-ఇజ్రాయెల్‌ సన్నిహిత సంబంధాలు, ఇరాన్‌పై తీసుకునే చర్యలు భారత్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత్‌ తన రక్షణ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు సూచిస్తున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post