Thurakapalem Mystery Deaths: అప్పటివరకు సజావుగా, ఆనందంగా తమ పనులు చేసుకుంటూ ఉన్న గ్రామస్థులు.. ఇప్పుడు మాత్రం జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలతో ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి మృతదేహాలుగా చేరుతున్నారు. ప్రాణాలతో తిరిగొచ్చిన కొందరు కూడా కొన్ని రోజులకే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి గుంటూరు దగ్గరలోని తురకపాలెం గ్రామంలో నెలకొంది. గత నాలుగు నుంచి ఐదు నెలల్లో గ్రామంలో 28 మంది మరణించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు అప్రమత్తమై అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
![]() |
Thurakapalem Mystery Deaths |
ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం
సాధారణంగా జ్వరం వస్తే మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ తురకపాలెం గ్రామంలో జ్వరం వస్తేనే ప్రాణాలు పోతున్నాయి. గత కొద్ది నెలల్లో పదుల సంఖ్యలో గ్రామస్తులు జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళి తిరిగి బతికిరాకుండా పోయారు. ఇటీవల ఎస్సీ కాలనీలో వరుసగా మరణాలు జరగడంతో గ్రామంలో భయం పెరిగింది. కొత్తగా ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందిందా? లేక మరేదైనా కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “ఎప్పుడు ఎవరికీ ఏమవుతుందో” అనే ఆందోళనతో ప్రజలు వణికిపోతున్నారు.
"మా ఊరిలో ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. కారణం మాకు అర్థం కావడం లేదు. జ్వరం, కీళ్ల నొప్పులతో ఆసుపత్రికి వెళ్లినవారు అక్కడే చనిపోతున్నారు. మరణిస్తున్న వారంతా 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారే." - గ్రామస్థులు
Also Read: పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ వ్యూహం ఏమిటి?
మరణించిన వారిలో గుర్తించిన సమస్యలు
గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎపిడెమిక్ సెల్ సర్వే నిర్వహించింది. మృతి చెందిన వారి కుటుంబాలతో మాట్లాడి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో..
- 36% మంది మద్యపానం చేస్తారని,
- 24% మంది పొగ తాగేవారని,
- 20% మంది రెండింటినీ అలవాటు చేసుకున్నారని తేలింది.
అలాగే మృతుల్లో 16% మందికి మధుమేహం, 8% మందికి బీపీ, 4% మందికి హెచ్ఐవి, టీబీ, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు రికార్డులో ఉంది. మరణాల్లో 76% మంది ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోగా, మిగతావారు ఇంటి వద్దే ప్రాణాలు వదిలారని నివేదిక పేర్కొంది.
మట్టి, నీటి నమూనాల పరిశీలన
గ్రామ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఎపిడెమిక్ టీమ్‌తో పాటు గుంటూరు మెడికల్ కాలేజ్ నిపుణులు కూడా మైదానంలో దిగారు. ఎస్‌పీఎం, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు పరీక్షలు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలున్నవారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామ మట్టి, తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. ప్రజలలో ఉన్న భయాన్ని తగ్గించేందుకు మానసిక వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు.
"ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నాం. జ్వరం లేదా ఇతర సమస్యలున్నవారిని మెడికల్ క్యాంప్‌కి తీసుకువస్తున్నాం. రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నాం. పరిస్థితి నియంత్రణలోకి వచ్చే వరకు మా బృందం ఇక్కడే ఉంటుంది." - విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో గుంటూరు
Also Read: మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేక కథనం!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS