Pawan Kalyan Political Strategy: అసలు రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటి? జనసేన పార్టీని ఆయన ఎలా తీర్చిదిద్దుతున్నారు? ప్రస్తుతం ఇదే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌కు రెండు వర్గాల అభిమానులు ఉన్నారు. సినీ పరంగా అభిమానించే వారు, రాజకీయపరంగా అభిమానించే వారు. సినిమా అభిమానుల దారులు విభిన్నంగా ఉన్నప్పటికీ, రాజకీయపరంగా అభిమానించే వారు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మార్పు కోరుకునే వారు పవన్ వెంట నిలిచారు. అదే సమయంలో సినిమా అభిమానులలో మెజారిటీ భాగం కూడా ఆయనకు అండగా ఉంది. అందరి ఆకాంక్ష ఒకటే .. పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడటం.
![]() |
DY CM Pawan Kalyan |
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వేరే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా నిలిచిన ఆయన, ఈ కూటమి మరో 15 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉంచిన ఆయన వ్యూహం వేరు. కానీ ఈ వ్యూహం ఆయనను సీఎంగా చూడాలనుకునే అభిమానులకు, మద్దతుదారులకు కొంత నిరాశను కలిగిస్తోంది. అధినేత మనసులో ఏముందో తెలియక వారు సందిగ్ధంలో ఉన్నారు.
బలమైన కులం అండగా
తాను కులపరమైన రాజకీయాలను ప్రోత్సహించనని పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నప్పటికీ, బలమైన కాపు సామాజిక వర్గం మాత్రం ఆయనను తమ వర్గానికి చెందిన నాయకుడిగా భావిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి అతి సమీపంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ఆ స్థానాన్ని అధిరోహిస్తారని వారు నమ్ముతున్నారు. కాపు సామాజిక వర్గం దశాబ్దాలుగా రాజకీయ అధికారానికి ఎదురుచూస్తోంది. వంగవీటి మోహన్ రంగా రూపంలో ఒక శక్తివంతమైన నాయకుడు దొరికాడని భావించినా, ఆయన అకాల మరణం వర్గాన్ని నిరాశపరిచింది. అనంతరం ముద్రగడ పద్మనాభం రంగప్రవేశం చేసినా, సరైన వ్యూహం లేక వెనుకబడ్డారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 70 లక్షల ఓట్లు సాధించినా, పార్టీ నిలబడలేదు. వీరందరూ వ్యూహపరమైన లోపాల వల్ల వెనుకబడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ గుణపాఠాలను తన ప్రయాణంలో ఉపయోగించారు.
![]() |
Pawan Kalyan and Vangaveeti mohana ranga |
గుణపాఠాలుగా మార్చుకుని..
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, అప్పటికే ప్రజారాజ్యం పార్టీ పరాజయం తన కుటుంబానికి ఎదురైన అనుభవమని గుర్తించారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆయనను తేలికగా తీసుకున్నారు. కాపు వర్గం కూడా అదే అభిప్రాయంతో ఉంది. అయితే 2014లో తెలుగుదేశం పార్టీకి వ్యూహాత్మక మద్దతు ప్రకటించడం ద్వారా తన దారిని మార్చుకున్నారు. 2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినా, ఫలితాలు నిరాశ కలిగించాయి. కానీ ఆయన వెనక్కి తగ్గకుండా పార్టీని ముందుకు నడిపించారు. హఠాత్తుగా ఎదగకుండా, స్థిరంగా అభివృద్ధి సాధిస్తూ, తక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలుపు శాతం పెంచుకున్నారు.
తప్పకుండా ఆ ఆలోచన
ఒక రాజకీయ పార్టీ నేతగా పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా ఉండడం సహజమే. ప్రస్తుతం ఆ స్థానానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న ఆయన, ఈ పదవిని సాధించాలనే ఆలోచన తప్పకుండా కలిగి ఉన్నారు. అభిమానులు, కాపు సామాజిక వర్గం కూడా అదే నమ్మకంతో ఉన్నారు. తన వృత్తి, ప్రవృత్తి రెండింటినీ సమాంతరంగా కొనసాగిస్తూ, తన ఇమేజ్‌ను పెంచుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు వ్యూహం ఇంకా ఎవరికీ స్పష్టంగా అర్థం కాలేదు. అయినప్పటికీ అభిమానులు, కాపు వర్గం ఆయనపై పటిష్ఠమైన నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఏ స్థాయికి చేరుకుంటారు అన్నదే!