PM Viksit Bharat Rozgar Yojana: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ రంగంలో కొత్తగా చేరిన ఉద్యోగుల కోసం ఒక కీలక పథకాన్ని ప్రకటించారు. ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ పేరుతో ప్రారంభమైన ఈ పథకం కింద, ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన యువతకు ప్రభుత్వం నేరుగా రూ.15,000 అందించనుంది.
![]() |
PM Viksit Bharat Rozgar Yojana |
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 వరకు మొదటిసారి ప్రైవేట్ ఉద్యోగం పొందిన వారు ఈ పథకానికి అర్హులు. వీరికి రెండు విడతల్లో మొత్తంగా రూ.15,000 అందజేయనున్నారు. ఉద్యోగంలో 6 నెలలు పూర్తి చేసిన తర్వాత మొదటి విడత, 12 నెలలు పూర్తయిన తరువాత రెండో విడత రూపంలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
అలాగే కొత్త ఉద్యోగులను నియమించుకున్న ప్రైవేట్ యజమానులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఈ పథకం కోసం కేంద్రం మొత్తం రూ.99,446 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దాంతో 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.
అర్హతల ప్రకారం, ఈ పథకం కింద ఉద్యోగి జీతం నెలకు రూ.1 లక్షలోపు ఉండాలి. అలాగే ఉద్యోగి తొలిసారిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO)లో నమోదు చేసుకోవాలి. ప్రైవేట్ యజమానులు కూడా EPFOలో నమోదు చేయించుకుని, కొత్త ఉద్యోగులను నియమిస్తే ఒక్కో ఉద్యోగి మీద రూ.3,000 చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రోత్సాహకాలు పొందవచ్చు.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS