Budapest Trilateral Summit: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వరుసగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీలతో ట్రంప్ చర్చలు జరిపారు. త్వరలో పుతిన్-జెలెన్‌స్కీ ముఖాముఖి భేటీ కూడా జరగనుందని సమాచారం. అయితే, ఆ భేటీకి ముందు ఉక్రెయిన్ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది.
![]() |
Trump Plans Trilateral Summit with Putin and Zelensky in Budapest |
త్రైపాక్షిక సమావేశం బుడాపెస్ట్‌లో?
ఈ కీలక సమావేశానికి వేదిక ఇంకా ఖరారు కాలేదు. అయితే వైట్ హౌస్ దృష్టి హంగేరి రాజధాని బుడాపెస్ట్ పై ఉంది. బుడాపెస్ట్‌లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిపేందుకు యుఎస్ సీక్రెట్ సర్వీస్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏర్పాట్ల వెనుక హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్ ప్రత్యేకంగా సమన్వయం చేస్తున్నారని తెలిసింది.
పుతిన్ ప్రతిపాదనలు, ట్రంప్ స్పందన
మరోవైపు, పుతిన్-జెలెన్‌స్కీ ప్రత్యక్ష శాంతి చర్చల్లో పెద్దగా పురోగతి ఉంటుందని మాస్కో మాత్రం నమ్మడం లేదని స్పష్టం చేసింది. పుతిన్-ట్రంప్ మధ్య ఫోన్ కాల్ అనంతరం ఊహాగానాలు ముదురాయి. రష్యాలో జరగబోయే వన్-టు-వన్ సమావేశానికి జెలెన్‌స్కీని ఆహ్వానించాలని పుతిన్ సూచించారని సమాచారం. సోమవారం జెలెన్‌స్కీ యూరోపియన్ నాయకులతో పాటు ట్రంప్‌ను వైట్ హౌస్‌లో కలిసిన సందర్భంగా ఈ విషయాలు బయటపడ్డాయి.
![]() |
Russia President Putin with US President Donald Trump |
విశ్లేషకుల ప్రకారం ట్రంప్ ప్రతిపాదనలు ఒక రకంగా జెలెన్‌స్కీకి ఝలక్ ఇచ్చినట్టేనని అంటున్నారు. అందులో ప్రధానంగా డోన్బాస్ ప్రాంతాలను పూర్తిగా రష్యా ఆధీనంలోకి ఇవ్వాలి అన్నది ఉంది. దీని వల్ల ఉక్రెయిన్ భూభాగం సుమారు 20% కోల్పోతుంది. ప్రతిగా రష్యా రెండు ప్రాంతాలను వెనక్కి ఇస్తుందన్న అంశం ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ల్యాండ్ స్వాప్ ఆలోచనపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ట్రంప్, ఉక్రెయిన్‌కు పూర్తి రక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు.
క్రిమియాపై ట్రంప్ వ్యాఖ్యలు
ఇదే సమయంలో ట్రంప్ మరో కీలక వ్యాఖ్య చేశారు. 12 సంవత్సరాల క్రితం రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్ మరిచిపోవాలని సూచించారు. అంతేకాదు నాటోలో చేరాలన్న ఆకాంక్షను కూడా వదులుకోవాలని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ట్రూత్ ఎక్స్లో పేర్కొన్నారు.
జెలెన్‌స్కీ అభ్యంతరాలు
డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌పై పుతిన్ ప్రత్యేక అజమాయిషీ కోరుతున్నారని, వాటిని అప్పగిస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ స్పష్టంచేశారని ట్రంప్ తెలిపారు. అయితే జెలెన్‌స్కీ దీనికి ఒప్పుకోలేదని సమాచారం. ఇటీవల భేటీలో పుతిన్ స్వయంగా మ్యాప్ చూపించి ఈ ప్రతిపాదనను వివరించినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉక్రెయిన్‌లో కొంత భూభాగాన్ని వదిలేస్తే, అదే రష్యా భవిష్యత్ దండయాత్రలకు కారణమవుతుందనే ఆందోళన జెలెన్‌స్కీ వైపు కనిపిస్తోంది.
అంతర్జాతీయ ప్రతిస్పందన
ట్రంప్ ప్రతిపాదన శాంతి ఒప్పందం సమన్యాయం కాదన్న అభిప్రాయం అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది. ఇది రష్యాకే ఎక్కువగా అనుకూలంగా ఉందని, ఉక్రెయిన్ ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ రాబోయే త్రైపాక్షిక చర్చల్లో ల్యాండ్ స్వాప్ అంశమే కేంద్రబిందువుగా ఉండనుంది.
నాటో సభ్యత్వం ఉక్రెయిన్‌కు సాధ్యం కాదని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. దీంతో, పుతిన్ ప్రతిపాదనలను జెలెన్‌స్కీ తిరస్కరిస్తే యుద్ధం మరింత కొనసాగుతుందని, ట్రంప్ శాంతి ప్రయత్నం విఫలమయ్యే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.