ICC Women’s World Cup 2025: భారత మహిళల చరిత్రాత్మక విజయం.. తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ కైవసం!

ICC Women’s World Cup 2025: భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు, దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో సఫారీలను 52 పరుగుల తేడాతో ఓడించి, తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 2005, 2017లో చేజారిన కలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ఈ సారి సాకారం చేసింది. దేశవ్యాప్తంగా మహిళా జట్టు విజయంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

ICC Women’s World Cup 2025
ICC Women’s World Cup 2025

షెఫాలీ - దీప్తి బ్యాటింగ్ ధాటికి సఫారీ బౌలర్లు తికమక: టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (87), స్మృతి మంధాన (45) జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం కట్టారు. ముఖ్యంగా షెఫాలీ ఆకట్టుకునే షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. తరువాత జెమీమా రోడ్రిగ్స్ (24), హర్మన్‌ప్రీత్ కౌర్ (20) త్వరగా అవుట్ అయినా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58 నాటౌట్), రిచా ఘోష్ (34) విలువైన ఇన్నింగ్స్ ఆడి స్కోరును 298 పరుగుల వరకు చేర్చారు.

షెఫాలీ బౌలింగ్‌లోనూ మ్యాజిక్ - సఫారీలు చేతులెత్తేశారు: 299 పరుగుల భారీ లక్ష్యంతో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్ (65), తాజ్మిన్ బ్రిట్స్ (23) శుభారంభం ఇచ్చారు. కానీ కీలక సమయంలో అమాన్‌జోత్ కౌర్ అద్భుత ఫీల్డింగ్‌తో బ్రిట్స్‌ను రనౌట్ చేయడం మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. అందుకు వెంటనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వేసిన వ్యూహాత్మక నిర్ణయం మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. బ్యాటింగ్‌లో మెరిసిన షెఫాలీ వర్మను బౌలింగ్‌కు పంపగా, ఆమె తన స్పిన్ మాయాజాలంతో సునె లూస్ (25), మరిజానే కాప్‌ (4) కీలక వికెట్లు తీశారు.

First ICC World Cup victory for Indian women
First ICC World Cup victory for Indian women

భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన: భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ప్రతి ఓవర్లో ఒత్తిడి పెరిగి, సఫారీలు తడబడటం మొదలుపెట్టారు. చివరికి మొత్తం జట్టు 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత మహిళా జట్టు తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది.

దేశవ్యాప్తంగా సంబరాలు: ఈ చారిత్రక గెలుపుతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. సోషల్ మీడియాలో అభిమానులు, సెలబ్రిటీలు, మాజీ ఆటగాళ్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం, షెఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ఆటతో భారత్ మహిళా జట్టు కొత్త చరిత్రను రాసింది.


Post a Comment (0)
Previous Post Next Post