Brucellosis: బ్రూసెల్లోసిస్ అంటే ఏమిటి? పశువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదకర వ్యాధి!

Brucellosis: సుమారు భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. వ్యవసాయం చేసే రైతులు అదనపు ఆదాయ వనరుగా పాడి పరిశ్రమను కూడా ఎంచుకుంటారు. ఈ పరిశ్రమలో భాగంగా పశువుల పెంపకం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పశువులను పెంచే క్రమంలో వాటి ఆరోగ్య సంరక్షణ అత్యంత ముఖ్యం. పశువులకు సోకే వ్యాధులను సమయానికి గుర్తించి సరైన చికిత్స అందించకపోతే, అవి ఇతర పశువులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వ్యాధి పేరు బ్రూసెల్లోసిస్ (Brucellosis).

Brucellosis
Brucellosis

బ్రూసెల్లోసిస్ అంటే ఏమిటి?
ఈ వ్యాధి ‘బ్రూసెల్లా’ (Brucella) అనే బ్యాక్టీరియాతో కలిగే అంటువ్యాధి. ఇది ప్రధానంగా గేదెలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు వంటి పశువులకు సోకుతుంది. పశువులకు ఈ వ్యాధి సోకినప్పుడు గర్భస్రావం, పాలు ఉత్పత్తి తగ్గడం, సంతాన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితులు రైతులకు పెద్ద ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.

మనుషులకు కూడా సోకే ప్రమాదం
బ్రూసెల్లోసిస్ వ్యాధి జూనోటిక్‌ వ్యాధి, అంటే జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి తీసుకున్న పాలను ఉడికించకుండా తాగడం, లేదా వాటిని నేరుగా తాకడం వల్ల కూడా వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధినే ‘మాల్టా ఫీవర్’ (Malta Fever) లేదా ‘అండ్యులెంట్ ఫీవర్’ (Undulant Fever) అని కూడా పిలుస్తారు.

పశువుల్లో వ్యాధి లక్షణాలు
పశువులకు ఈ వ్యాధి సోకినట్లు తొలుత గుర్తించడం కష్టమే. కానీ కొన్ని లక్షణాలు గమనించవచ్చు. పశువులు అలసటగా, బలహీనంగా మారడం, కీళ్ల వద్ద వాపులు కనిపించడం ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

చికిత్స మరియు నియంత్రణ చర్యలు
ఈ వ్యాధికి పూర్తి చికిత్స (complete cure) లేదు. ఎందుకంటే బ్రూసెల్లా బ్యాక్టీరియా పశువుల శరీరంలోనే స్థిరపడిపోతుంది. కానీ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమే. పశువులకు బ్రూసెల్లోసిస్ సోకినట్లు తేలితే, వాటిని వేరుగా ఉంచాలి.

రైతులు సాధారణంగా యాంటీబయాటిక్ టీకాలు వేస్తుంటారు, అయితే ఇవి పశువైద్యాధికారుల సలహాతో మాత్రమే వేయించాలి. ఈ వ్యాధి సోకిన జంతువుల పాలను తాగకూడదు. తప్పనిసరిగా తాగాల్సిన పరిస్థితిలో ఉంటే పాలను బాగా మరిగించి తాగడం మంచిది. పశువుల పరిసరాలను శుభ్రంగా ఉంచడం, విసర్జన పదార్థాలను జాగ్రత్తగా తొలగించడం చాలా ముఖ్యం.

టీకాలు మరియు జాగ్రత్తలు
పశువులకు ఈ వ్యాధి సోకినప్పుడు S19 Vaccine ఉపయోగించే అవకాశం ఉంది. అయితే ఇది కూడా వ్యాధి తీవ్రతను బట్టి పశువైద్యాధికారుల సూచన మేరకు మాత్రమే వాడాలి.

ఇక బ్రూసెల్లోసిస్ మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. పశువులకు ఈ వ్యాధి ఉన్నప్పుడు వాటిని దగ్గరగా చూసేది రైతులు మాత్రమే కావాలి. పిల్లలు మరియు వృద్ధులు వాటి దగ్గరికి రాకుండా చూడాలి.

బ్రూసెల్లోసిస్ వ్యాధి భయంకరమైనదే అయినా, సరైన జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణలో ఉంచవచ్చు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే రైతు ఆర్థిక భద్రతను కాపాడుకోవడం. కాబట్టి పశువుల పరిశుభ్రత, సమయానికి టీకాలు, మరియు పశువైద్యుల సూచనలతో వ్యవహరించడం ద్వారానే ఈ వ్యాధిని దూరం ఉంచవచ్చు.

Also Read: భైరవ్ బెటాలియన్లు.. స్మార్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న భారత సైన్యపు భవిష్యత్తు

Post a Comment (0)
Previous Post Next Post