Imran Khan Death Rumors: ఇమ్రాన్ ఖాన్ మరణం వదంతులు.. అడియాలా జైలు అధికారుల స్పష్టీకరణ!

Imran Khan Death Rumors: మన దాయాది దేశమైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారనే వార్తలు గురువారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంతో జైలులోనే ఉన్నారని, ఎక్కడికీ తరలించలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

Imran Khan Death Rumors
Imran Khan Death Rumors

అధికారుల ప్రకటన.. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు
జైలు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో, “ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలు నుంచి తరలించారనే వార్తలు పూర్తిగా అసత్యం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నాము” అని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ప్రచారంలో ఉన్న పుకార్లను నిరాధారంగా కొట్టిపారేశారు.

పీటీఐ ఆందోళన - ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
ఈ వదంతుల నేపథ్యంలో పీటీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని పార్టీ కోరింది. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులను తక్షణమే భేటీ అవ్వడానికి అనుమతించాలని డిమాండ్ చేసింది. గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ సోదరీమణులను ఆయనను కలిసేందుకు అనుమతించకపోవడం అనుమానాలకు కారణమైంది.

“లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు”
అనుమతి నిరాకరణపై ఇమ్రాన్ సిస్టర్స్ అలీమా ఖాన్, నూరీన్ ఖాన్, ఉజ్మా ఖాన్ అడియాలా జైలు బయట గంటల తరబడి నిరసన తెలిపారు. “ఇమ్రాన్‌ను వేరే చోటుకు తరలించి ఉండవచ్చు... అందుకే మాకు కలిసే అవకాశం ఇవ్వడం లేదు. దేశంలో అరాచక పాలన నడుస్తోంది” అని అలీమా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం - కేసులు, శిక్షలు
2022లో అవిశ్వాస తీర్మానంతో ప్రధాన మంత్రిపదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్, అవినీతి, ఉగ్రవాదం వంటి పలు కేసుల్లో నిందితుడిగా నిలిచారు. 2023 ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పరిస్థితిపై వస్తున్న పుకార్లు పాకిస్థాన్ రాజకీయ వాతావరణంలో మరింత ఉద్రిక్తతను రేకెత్తిస్తున్నాయి.


Post a Comment (0)
Previous Post Next Post