Betel Leaves Health Benefits: తమలపాకులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!

Betel Leaves Health Benefits: తమలపాకులు మన సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. పూజలు, శుభకార్యాలు, తాంబూలం వంటి సందర్భాల్లో వీటి వినియోగం విస్తృతంగా ఉంటుంది. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న అలవాటు. ఏ శుభకార్యమూ తమలపాకు లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదు. భోజనం తర్వాత కిల్లీ (తాంబూలం) తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంకొందరు రోజూ ఆకు, వక్క, సున్నంతో కిల్లీ వేసుకుంటారు. తమలపాకుల్లో ఉన్న పుష్కలమైన పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.

Betel Leaves Health Benefits
Betel Leaves Health Benefits

తమలపాకులలోని పోషకాలు
తమలపాకుల్లో మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్-సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల వీటిలోని ఔషధ గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా, జీర్ణక్రియ వంటి సాధారణ అనారోగ్యాలతోపాటు ఇతర వ్యాధులను కూడా దూరంగా ఉంచుతాయి.

గ్యాస్ట్రిక్ సమస్యలకు పరిష్కారం
భోజనం తర్వాత కిల్లీ తినే అలవాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తమలపాకులో ఉన్న సహజ గుణాలు ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఈ ఆకులు జీర్ణ వ్యవస్థను శుభ్రపరచి ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.

షుగర్ వ్యాధి నియంత్రణ
డయాబెటిస్ నియంత్రణలో తమలపాకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను సక్రమంగా ఉంచుతాయి. చక్కెర స్థాయిలు నియంత్రితంగా ఉండడం వల్ల డయాబెటిస్ రోగులకు ఉపశమనం లభిస్తుంది. అందువల్ల రోజుకు ఒకటి నుంచి రెండు ఆకులు తినడం డయాబెటిస్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది.

దగ్గు, జలుబు నివారణ
తమలపాకులో ఉండే సహజ ఔషధ గుణాలు దగ్గు, జలుబు వంటి సమస్యలకు ఉత్తమ నివారణ. భోజనం తర్వాత అరగంటకు నాలుగు నుంచి ఐదు తమలపాకుల రసం తాగితే దగ్గు తగ్గుతుంది. అలాగే యాలకులు, దాల్చినచెక్క వేసి సిరప్ తయారు చేసి తాగినా కూడా గొంతు సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి.

మూత్ర సమస్యలపై ప్రభావం
తమలపాకులు మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి రోజు ఒక టీ స్పూన్ తమలపాకు రసం తాగడం ద్వారా శరీరంలో నీటిని నిల్వచేసే సామర్థ్యం పెరుగుతుంది. దీని ఫలితంగా మూత్ర సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి.

మలబద్ధకానికి చెక్
కిల్లీ తినేటప్పుడు లాలాజలం అధికంగా స్రవిస్తుంది. దాన్ని మింగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తమలపాకులు జీర్ణాశయంలో ఆమ్లతను తగ్గించి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఆకలిని పెంచి జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతాయి.

ఇతర ప్రయోజనాలు
ఛాతిలో నొప్పి, గుండెలో మంట వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ తమలపాకు రసం తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇవి గొంతు, నోటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. తమలపాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉన్న యాంటీహిస్టామైన్ లక్షణాలు బ్రోన్కైటిస్‌ వంటి సమస్యలను నియంత్రించగలవు.

తమలపాకులు కేవలం సంప్రదాయానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అమూల్యమైన సహజ ఔషధం. రోజూ తమలపాకు నమలడం ద్వారా అనేక రకాల రోగాలను నివారించవచ్చు. మన పూర్వీకుల పద్ధతిలో భాగమైన ఈ సహజ ఆకు, నేటి కాలంలో కూడా మన ఆరోగ్యానికి అద్భుతమైన వరం.


Post a Comment (0)
Previous Post Next Post