Telangana Inter Exams 2026: విద్యార్థులకు పెద్ద రిలీఫ్.. తెలంగాణలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈసారి ఫిబ్రవరిలోనే!

Telangana Inter Exams 2026: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈసారి కాస్త ముందుగానే జరగనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించగా, టైమ్‌ టేబుల్‌ను కూడా అక్కడి ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఇదే తరహాలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కూడా పరీక్షలను ముందుగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా, ఇంటర్‌ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభించాలని ప్రతిపాదించింది.

Telangana Inter Exams 2026
Telangana Inter Exams 2026

ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం రెండు రకాల టైమ్‌ టేబుళ్లను సర్కారుకు పంపారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నందున, ఆయన ఆమోదం అనంతరం మాత్రమే తుది తేదీలను ప్రకటించనున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై మార్చి 24తో ముగియనున్నాయి. కాబట్టి, తెలంగాణలో కూడా దాదాపు అదే తేదీల్లో పరీక్షలు జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీ కంటే తెలంగాణలో పరీక్షలు ఒక రోజు ముందుగానో లేదా ఆలస్యంగానో ముగిసే అవకాశం ఉంది.

గతంలో, కరోనా మహమ్మారి కంటే ముందు ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి చివర్లోనే జరగడం ఆనవాయితీగా ఉండేది. కరోనా తర్వాతి కాలంలో పరీక్షలు మార్చికి వాయిదా పడుతున్నాయి. ఈసారి మళ్లీ ఫిబ్రవరిలోనే నిర్వహిస్తే, జేఈఈ మెయిన్‌, ఈఏపీసెట్‌, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మరింత సౌలభ్యం లభిస్తుంది. గతేడాది మార్చి 5న ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమై, ఏప్రిల్‌ 2 నుంచి జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు జరగడంతో విద్యార్థులకు కేవలం 12 రోజులు మాత్రమే సిద్ధం చేసుకోవడానికి లభించాయి. దీనివల్ల వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షలమంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి ఫిబ్రవరి నుంచే పరీక్షలు జరగడం వలన విద్యార్థులకు పోటీ పరీక్షలకు తగిన సన్నద్ధత సమయం దొరకనుంది.

ఇక మరోవైపు, పరీక్షల ఫీజు పెంపుపై కూడా ఇంటర్‌ బోర్డు ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్‌ లేని కోర్సులకు రూ.520, ప్రాక్టికల్స్‌ ఉన్న ఎంపీసీ, బైపీసీ, జువాలజీ, వొకేషనల్‌ కోర్సులకు రూ.750 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. బోర్డు ప్రతిపాదనలకు రేవంత్‌ ప్రభుత్వం ఆమోదం తెలుపితే, ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ప్రాక్టికల్స్‌ లేని కోర్సులకు రూ.600, ప్రాక్టికల్స్‌ ఉన్న కోర్సులకు రూ.875 వరకు ఫీజు నిర్ణయించవచ్చని తెలుస్తోంది.


Post a Comment (0)
Previous Post Next Post