TCS layoffs: లేఆఫ్స్ తుఫాన్‌తో టీసీఎస్‌లో కలకలం.. ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

TCS layoffs: ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే టీసీఎస్‌ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిందని ఉద్యోగుల సంఘం నైట్స్ తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులను యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్‌ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తూ, లేఆఫ్స్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీసీఎస్‌పై డిమాండ్‌ చేసింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపుపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కూడా సంఘాలు కోరుతున్నాయి.

TCS layoffs
TCS layoffs

యునైట్‌ యూనియన్‌ ఆరోపణల ప్రకారం, టీసీఎస్‌ లేఆఫ్స్‌ కారణంగా సుమారు 30 వేల మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమవుతారని చెబుతోంది. అయితే, ఈ ఆరోపణలను టీసీఎస్‌ యాజమాన్యం తోసిపుచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేవలం ఒక శాతం ఉద్యోగులను, అంటే దాదాపు 6 వేల మందిని మాత్రమే తొలగించామని స్పష్టం చేసింది. అదనంగా, ముందుగా ప్రకటించినట్లే సుమారు 2 శాతం ఉద్యోగులను.. అంటే దాదాపు 12 వేల మందిని తొలగిస్తామని సంస్థ చెబుతోంది.

అయితే అనుభవజ్ఞుల స్థానంలో తక్కువ వేతనాలతో ఫ్రెషర్లను నియమించుకుంటోందని యునైట్‌ యూనియన్‌ ఆరోపిస్తోంది. 2 లక్షల 55 వేల కోట్ల ఆదాయం ఉన్న టీసీఎస్‌ వంటి పెద్ద సంస్థ లాభాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని పేర్కొంటూ, ఉద్యోగులను తొలగించడంకంటే వారి నైపుణ్యాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు, అవాస్తవ ప్రచారాలు నమ్మొద్దని టీసీఎస్‌ ఉద్యోగులను కోరుతూ, తన లక్ష్యాల ప్రకారం ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది.

ఇక బెంచ్‌ పాలసీ మార్పులు, 12 వేల మంది ఉద్యోగుల తొలగింపు, ఏఐ సాంకేతికత ప్రవేశపెట్టడం వంటి కీలక అంశాలపై టీసీఎస్‌ ఇప్పటికే ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. అయితే సంస్థ చెబుతున్న సంఖ్యలకంటే ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగానే ఉన్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. కొంతమందిని రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలో ఈ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరగడం, దేశీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post