AP New District Formation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి!

AP New District Formation: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కొత్త జిల్లాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి నాటికి ప్రభుత్వం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే జిల్లాల పునర్విభజనకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. నవంబర్‌ 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉండనుంది.

AP New District Formation
AP New District Formation

ప్రతిపాదనలు సిద్ధం: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని నాలుగు నుంచి ఆరు కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా మార్కాపురం, అమరావతి, మదనపల్లితో పాటు ఒక కొత్త ఏజెన్సీ జిల్లా ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. పలాస‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించే అవకాశమూ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలన్నీ సిద్ధమయ్యాయి. నవంబర్ 7న జరగనున్న క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగనుంది. ఆమోదం లభించిన తర్వాత ప్రజల అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 31లోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

మార్కాపురం జిల్లా ఖాయం: కొత్త జిల్లాల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు ఖాయం అన్న సమాచారం వస్తోంది. ఈ జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలు ఉండనున్నాయి. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలు కలిగి కొత్త జిల్లా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అదనంగా అద్దంకి, మడకశిర సహా పది కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.

రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ: వైఎస్సార్‌సీపీ పాలనలో 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే ఆ సమయంలో హేతుబద్ధత లేకుండా విభజన జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఒక్కో నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు రెవెన్యూ డివిజన్లకు కేటాయించడంతో పాలనలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ లోటుపాట్లను సరిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్ కిందకు తేనున్నట్లు సమాచారం.

మరోవైపు శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విజయనగరం నుంచి విశాఖ జిల్లా కింద చేర్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ అంశాలతో పాటు కొత్త జిల్లాల రూపకల్పనపై కూడా నవంబర్ 7న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

సంక్రాంతికల్లా కొత్త జిల్లాల ప్రకటన?
అన్ని కసరత్తులు పూర్తయిన తర్వాత సంక్రాంతి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే, ఏపీలో పరిపాలన సౌలభ్యం పెరగడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.


Post a Comment (0)
Previous Post Next Post