Cyclone in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది వాయుగుండంగా మారి, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయానికి దీనికి “మొంథా” అని పేరు పెట్టే అవకాశం ఉంది.
![]() |
| Cyclone in Andhra Pradesh |
వర్షాలు కురిసే జిల్లాలు: తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజులు వర్షాల తీవ్రత కొనసాగుతుందని ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
అధికారులు అప్రమత్తం: తీవ్ర వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు అని హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తంగా ఉందని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఉండకూడదని ప్రజలకు సూచించారు.
