Top 6 Stress-Free Careers in India: నేటి కాలంలో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. చదువుల ఖర్చులు కూడా విపరీతంగా పెరగడంతో యువత ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. అయితే, అధిక జీతం ఉన్నప్పటికీ పని ఒత్తిడి, టార్గెట్లు కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ కారణంగా కొంతమంది తక్కువ జీతం వచ్చినా ఒత్తిడి లేని ఉద్యోగాలను ఎంచుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం భారతీయ జాబ్ మార్కెట్లో ఒత్తిడి లేని ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో డిమాండ్ ఎక్కువగా ఉండే, కానీ ఒత్తిడి తక్కువగా ఉండే కొన్ని ఉద్యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.
![]() |
Top 6 Stress-Free Careers in India |
1. గ్రాఫిక్ డిజైన్ ప్రస్తుతం ఒత్తిడి లేని, డిమాండ్ ఎక్కువగా ఉన్న ఉద్యోగాలలో ఒకటి. గ్రాఫిక్ డిజైనర్లు విజువల్ మెటీరియల్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ సంబంధిత క్రియేటివ్ కంటెంట్ తయారు చేస్తారు. వీరికి ఆఫీసుల్లో పని చేయాల్సిన అవసరం లేకుండా కాన్వా, అడోబ్ సూట్, ఫిగ్మా వంటి డిజైన్ టూల్స్ సాయంతో సృజనాత్మక స్వేచ్ఛ లభిస్తుంది. సోషల్ మీడియా సంస్థలు, ప్రచురణ సంస్థలు, ప్రకటన ఏజెన్సీలు, టెక్ స్టార్టప్‌లలో వీరికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి.
2. డిజిటలైజేషన్ పెరగడంతో కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్ ఉద్యోగాలకు కూడా అధిక డిమాండ్ ఉంది. SEO-ఫ్రెండ్లీ బ్లాగులు, వెబ్‌సైట్ కంటెంట్, సోషల్ మీడియా పోస్ట్‌లు రాయగలవారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, అనుకూలమైన పని గంటలు, టార్గెట్ లేని వాతావరణం ఉండటంతో ఇది ప్రశాంతమైన ఉద్యోగంగా పరిగణించబడుతోంది. స్టార్టప్‌లు, ఆన్‌లైన్ ఏజెన్సీలు, ఫ్రీలాన్స్ వెబ్‌సైట్‌లలో వీరికి విస్తృత అవకాశాలు ఉన్నాయి.
3. ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. సర్టిఫికేషన్ పొందిన తర్వాత ఆసుపత్రులు, క్లినిక్‌లు, జిమ్‌లలో లేదా స్వంత కన్సల్టెన్సీ ద్వారా పనిచేయవచ్చు. క్లయింట్‌లకు డైట్ ప్లాన్‌లు ఇవ్వడం, ఆరోగ్య చిట్కాలు చెప్పడం వల్ల ఈ ఉద్యోగం ఒత్తిడి తక్కువగా ఉండే వృత్తిగా భావించబడుతోంది.
4. లైబ్రేరియన్, ఆర్కైవిస్ట్ ఉద్యోగాలు కూడా ఒత్తిడి లేని వృత్తులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. వీటిలో హడావిడి ఉండదు, క్రమబద్ధమైన పని గంటలు, గడువులు లేకుండా సాఫీగా పని చేసే అవకాశం ఉంటుంది. విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు, వర్చువల్ లైబ్రరీలలో వీరికి అవకాశాలు ఉన్నాయి.
5. టీచింగ్ కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ కలిగిన ఉద్యోగం. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ విప్లవం, యాప్‌ల అభివృద్ధి కారణంగా ఈ రంగం మరింత విస్తరించింది. BYJU’S, Vedantu, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లతో పాటు స్వతంత్రంగా ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవడం ద్వారా కూడా బోధనలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఉద్యోగం ఒత్తిడి లేని వాతావరణంలో చేయగలిగినందున యువతలో ఆదరణ పొందుతోంది.
6. UX/UI డిజైన్ రంగం సృజనాత్మకత, పరిశోధనకు విస్తృత స్థలం కల్పిస్తుంది. ఒత్తిడి లేకుండా పనిచేసే వీరికి మొబైల్ యాప్ కంపెనీలు, స్టార్టప్‌లు, IT కంపెనీలలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులకు అనుకూలంగా యాప్‌లు, వెబ్‌సైట్‌లు డిజైన్ చేయడం ఈ ఉద్యోగానికి ప్రధాన భూమిక.
ఒత్తిడి లేని వృత్తులు ఇప్పుడు భారతీయ జాబ్ మార్కెట్లో అధిక డిమాండ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. సృజనాత్మకత, అనుకూలమైన పని సమయం, టార్గెట్‌ల లేని వాతావరణం యువతను ఈ ఉద్యోగాలవైపు ఆకర్షిస్తోంది.