Kinjarapu Ram Mohan Naidu: అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమారుని నామకరణ వేడుక!

Kinjarapu Ram Mohan Naidu: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీలో ఆయన కుమారుడి బారసాల నామకరణోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఇటీవల రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దంపతులకు ఒక కుమార్తె ఉండగా, ఇప్పుడు రెండో సంతానంగా కుమారుడు పుట్టాడు. దీంతో కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఆదివారం జరిగిన బారసాల వేడుకకు జాతీయ స్థాయి ప్రముఖులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తన కుమారుడికి “శివాన్ ఎర్రం నాయుడు” అని పేరు పెట్టారు.

Kinjarapu Ram Mohan Naidu Son Naming Ceremony
Kinjarapu Ram Mohan Naidu Son Naming Ceremony 

జాతీయస్థాయి ప్రముఖుల హాజరు: ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు నివాసంలో జరిగిన ఈ నామకరణోత్సవానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈ వేడుకకు విచ్చేశారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, హరదీప్ సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అలాగే ఏపీకి చెందిన అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వేడుక అంతా కుటుంబసభ్యులు, రాజకీయ నాయకులు, స్నేహితులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.

Kinjarapu Ram Mohan Naidu
Kinjarapu Ram Mohan Naidu With Wife and Son

చిన్న వయసులోనే కేంద్రమంత్రిగా ఎదిగిన రామ్మోహన్ నాయుడు: రాజకీయ వారసత్వంలో నిలిచిన రామ్మోహన్ నాయుడు, తన తండ్రి ఎర్రం నాయుడు అకస్మాత్తుగా మరణించడంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శ్రీకాకుళం నుండి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికై విశేష గుర్తింపు పొందారు. ఈసారి ఎన్డీఏ కూటమిలో టిడిపి కీలక భాగస్వామిగా నిలిచింది. టిడిపి తరఫున రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులయ్యారు. చిన్న వయసులోనే మంత్రి పదవి సాధించడం ద్వారా అరుదైన రికార్డ్ సృష్టించారు.

రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్య, విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె. మొదట వీరికి కుమార్తె పుట్టగా, తాజాగా కుమారుడు జన్మించాడు. తన తండ్రి స్మరణార్థం బిడ్డకు ఎర్రం నాయుడు పేరు పెట్టడం విశేషం. ఢిల్లీలో బారసాల వేడుక జరిగిన నేపథ్యంలో శ్రీకాకుళం టిడిపి శ్రేణులు, అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా రామ్మోహన్ నాయుడు కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది సంతోషకరమైన కుటుంబ వేడుక మాత్రమే కాకుండా, రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ విశేష చర్చనీయాంశంగా మారింది.


Post a Comment (0)
Previous Post Next Post