Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె గర్భిణీగా ఉంది మరియు త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కత్రినా-విక్కీ దంపతులు సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫోటోలను కూడా పంచుకున్నారు.
![]() |
Katrina Kaif, Vicky Kaushal announce pregnancy |
“కొత్త ఆధ్యాయం ప్రారంభం కానుంది. మా జీవితంలో అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నాం” అంటూ విక్కీ-కత్రినా తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కత్రినా-విక్కీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
విక్కీ-కత్రినా జంటది ప్రేమ వివాహమే. 2021 డిసెంబర్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఫోర్ట్ బార్వారా లో ఉన్న సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి తర్వాత నాలుగేళ్లలో ఈ జంట తల్లిదండ్రులు కానున్నారని, అందువల్ల వారి ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి.
![]() |
Vicky Kaushal and Katrina Kaif |
కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ మల్లీశ్వరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడింది. మధ్యలో నందమూరి బాలకృష్ణతో కలిసి ‘అల్లరి పిడుగు’ సినిమాలో నటించిన కత్రినా, ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాక, దేశవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో ఒకరిగా చెలామణీ అవుతోంది.
ఇక విక్కీ కౌశల్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో బయోపిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఇటీవల “ఛావా” సినిమాతో దేశవ్యాప్తంగా మరలా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం అతని చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.