India-Bhutan Railway Project: భారత్‌-భూటాన్ మధ్య తొలి రైల్వే లైన్ నిర్మాణం వేగవంతం!

India-Bhutan Railway Project: భారత్‌, భూటాన్ మధ్య మొదటి రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం అవుతోంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్ట్‌ మొత్తం 69 కిలోమీటర్ల ప్రతిపాదిత రైలు మార్గంతో ముందుకు సాగుతోంది. కోక్రాఝర్-గెలెఫు రైలు మార్గాన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్ట్‌ (SRP)గా వర్గీకరించారు. రైల్వే చట్టం 1989 ప్రకారం ఈ వారం ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) నోటిఫికేషన్ విడుదల చేసింది.

India-Bhutan Railway Project
India-Bhutan Railway Project

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 మార్చిలో భూటాన్ పర్యటన సందర్భంగా భారత్‌, భూటాన్ మధ్య రెండు రైలు మార్గాలను నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. అందులో కోక్రాఝర్-గెలెఫు, బనార్హట్-సమ్త్సే లైన్లు ఉన్నాయి. 16 కి.మీ పొడవు గల బనార్హట్-సమ్త్సే మార్గం పశ్చిమ బెంగాల్‌ను భూటాన్‌తో కలుపుతుంది. ఈ ప్రత్యేక రైల్వే ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేయడంతో పాటు, మెరుగైన కనెక్టివిటీ ద్వారా సామాజిక-ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని సీనియర్ రైల్వే అధికారులు తెలిపారు.


“ఈ ప్రాజెక్ట్‌ వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమైంది. ఇది సరిహద్దు కనెక్టివిటీని పెంచి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రాథమిక ఇంజనీరింగ్-కమ్-ట్రాఫిక్ సర్వే, తుది స్థాన సర్వే కోసం ప్రత్యేక నిధులు కేటాయించబడ్డాయి” అని ఒక అధికారి వెల్లడించారు. ఈ వర్గీకరణ వనరుల కేటాయింపును సులభతరం చేసి, ప్రాజెక్టును సమయానికి పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఇప్పటికే NFR తుది స్థాన సర్వే, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను పూర్తి చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ అమలు కానుంది. ఇందులో బాలాజన్‌, గరుభాస, రునిఖాత, శాంతిపూర్, దద్గిరి, గెలెఫు అనే ఆరు కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు.

ఈ కారిడార్‌లో రెండు ప్రధాన వంతెనలు, 29 మెజర్ బ్రిడ్జిలు, 65 చిన్న వంతెనలు, ఒక రోడ్ ఓవర్‌ బ్రిడ్జ్‌, 39 రోడ్ అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయబడతాయి. అదనంగా, కఠిన భూభాగాల్లో సురక్షితమైన, సమర్థవంతమైన రైలు రవాణా కోసం ఒక్కొక్కటి 11 మీటర్ల పొడవు గల రెండు వయాడక్ట్‌లు నిర్మించబడతాయి. 


Post a Comment (0)
Previous Post Next Post