Sprouted Vegetables Health Risks: కూరగాయలు ఆరోగ్యానికి కలిగించే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండే కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంపొందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలను నివారించడమే కాకుండా తక్కువ కేలరీలతో బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
అంతేకాకుండా కొన్ని రకాల కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే కూరగాయలను సరైన సమయంలో, సరైన విధంగా తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మొలకెత్తిన కూరగాయలు శరీరానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వాటిపై మొలకలు వస్తాయి. ఈ మొలకెత్తిన ఉల్లిపాయల్లో అధికంగా ఆల్కలాయిడ్లు, ముఖ్యంగా ఎన్-ప్రొపైల్ డైసల్ఫైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎర్ర రక్త కణాలను దెబ్బతీసి రక్తహీనత (అనీమియా)కు కారణమవుతుంది. అందువల్ల మొలకెత్తిన ఉల్లిపాయలను తినకుండా ఉండడం ఉత్తమం. అదే విధంగా వెల్లుల్లి మొలకెత్తినప్పుడు ఇందులో అధిక సాంద్రత కలిగిన సల్ఫర్ సమ్మేళనాలు పెరుగుతాయి. ఇవి జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి.
బంగాళదుంపలు కూడా ఎక్కువకాలం నిల్వ ఉంటే మొలకలు వస్తాయి. చాలామంది మొలకలున్న భాగాన్ని తీసివేసి మిగిలిన భాగాన్ని వాడతారు. కానీ ఇది ప్రమాదకరం. మొలకెత్తిన బంగాళదుంపల్లో టాక్సిన్ స్థాయి పెరిగి వికారం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, నాడీ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మొలకలు వచ్చిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలను ఆహారంలో ఉపయోగించకుండా ఉండటం ఆరోగ్య పరిరక్షణకు అవసరం.