Vice President Election 2025: జాతీయ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు!

Vice President Election 2025: జాతీయ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్డీఏ, ఇండియా కూటములు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. 

INDIA bloc names Justice B. Sudershan Reddy as Vice Presidential Candidate 2025

ఈ క్రమంలోనే ఇండియా కూటమి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు జరిగిన సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సుదర్శన్ రెడ్డి పేరు అధికారికంగా వెల్లడించారు.

జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి: న్యాయరంగంలో విశిష్ట సేవలు: జూలై 8, 1946న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో జన్మించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1971లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు అయ్యి, హైకోర్టులో పలు రిట్ మరియు సివిల్ కేసులను విజయవంతంగా వాదించారు.


న్యాయమూర్తిగా నియామకం కంటే ముందు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారుగా సేవలందించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2011లో పదవీ విరమణ చేశారు. అనంతరం 2013లో గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్తగా పనిచేశారు.

CP Radhakrishnan- NDA candidate for Vice-Presidential Election-2025

ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్ బరిలో: ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కూడా మొదట తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, శాస్త్రవేత్త అన్నాదురై పేర్లపై చర్చ జరిగింది. అయితే చివరికి విపక్షాలు న్యాయరంగానికి చెందిన, రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి కావాలని నిర్ణయించాయి. ఫలితంగా సుదర్శన్ రెడ్డి పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశాయి.

ఎన్నికల సమీకరణలు: దక్షిణాదికి చెందిన రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి పోటీలో బరిలో నిలిచారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల విషయంలో ఏకగ్రీవం సాధించాలని పిలుపునిచ్చారు. విపక్షాలతో చర్చల బాధ్యతను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు.

ఇప్పటికే ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి బరిలో నిలవడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.



Post a Comment (0)
Previous Post Next Post