Mount Everest: మనందరికీ ఎవరెస్ట్ శిఖరం గురించి తెలిసిందే. హిమాలయాల్లో ఉన్న ఈ శిఖరం, ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. కానీ మీకు తెలుసా? ఈ ఎత్తయిన శిఖరానికి పేరు ఇచ్చిన వ్యక్తి ఎవరో? అతని పేరు జార్జ్ ఎవరెస్ట్ (George Everest). ఆయన ఒక ప్రముఖ బ్రిటిష్ సర్వేయర్, జియోడెసిస్ట్, జియోగ్రాఫర్ మరియు రాయల్ సొసైటీ సభ్యుడు.
జార్జ్ ఎవరెస్ట్ 1790 జూలై 4న గ్వెర్న్ వేల్‌లో జన్మించారు. ఇంగ్లాండులోని మిలిటరీ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. కేవలం 16 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి చేరుకున్న ఎవరెస్ట్, 1806లో ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరారు. తొలితరం బెంగాల్ ప్రాంతంలో ఏడు సంవత్సరాలు పనిచేశారు. 1814 నుండి 1816 వరకు జావా ద్వీపంలో సర్వే పనిలో ఉన్నారు. అనంతరం భారతదేశంలోని "గ్రేట్ త్రికోణమితి సర్వే"లో భాగంగా విలియం లాంబన్‌కు సహాయకుడిగా పని చేశారు.
భారతదేశపు దక్షిణ అంచు కేప్ కొమరిన్ నుండి ఉత్తర భాగం నేబిల్ వరకు సుమారు 2,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెరిడియన్ ఆర్క్‌ను సర్వే చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన తన కాలంలోని అత్యంత ఖచ్చితమైన సర్వే పరికరాలను ఉపయోగించి భూభాగాల కొలతలను అత్యంత నాణ్యతతో జరిపారు.
అంతటి శ్రమకు గుర్తింపుగా, 1865లో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆయన గౌరవార్థంగా ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరానికి "ఎవరెస్ట్" అని నామకరణం చేసింది. ఆ శిఖరానికి అప్పటివరకు అనేక స్థానిక పేర్లు ఉండడంతో అయోమయం లేకుండా, ఆయన పేరును శాశ్వతంగా నిర్ణయించారు. అలా ప్రపంచంలోనే అత్యున్నత పర్వత శిఖరానికి "ఎవరెస్ట్" అనే పేరు స్థిరపడింది. ఆ పేరు వెనుక ఓ గొప్ప వ్యక్తి జీవితం దాగి ఉందని మనందరం గుర్తుంచుకోవాలి.
Also Read: వెన్నులో వణుకు పుట్టించే ఢిల్లీలోని ఈ బావి కథ తెలుసా?