Rangam Bhavishyavani 2025: తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించారు. డప్పులు, సప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ డ్యాన్సులు ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సంప్రదాయ దుస్తుల్లో, డప్పుల తాళాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తులు అమ్మవారిని కీర్తించారు. ముఖ్యంగా శక్తిస్వరూపులైన పోతరాజులు కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
లష్కర్ బోనాల జాతరలో రెండో రోజైన నేడు (జులై 14), ఉజ్జయిని ఆలయంలో పవిత్రమైన 'రంగం' కార్యక్రమం జరగ్గా, అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత, పచ్చికుండపై నిలబడి భవిష్యవాణిని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె అమ్మవారి ప్రతిరూపంగా మాట్లాడుతూ.."నా భక్తులు ఇచ్చిన కానుకలను సంతోషంగా అందుకున్నాను. కానీ ప్రతి ఏడాది మీరు ఏదో ఒక ఆటంకాలు తలపెడుతూనే ఉంటారు. నేను చెబుతూనే ఉంటాను. మీరు మాత్రం నన్ను లెక్కచేయరు. నా కోరిక నెరవేర్చటం లేదు. నా బిడ్డల్ని కడుపులో పెట్టుకొని నేను కాపాడుకుంటున్నా. నాకు పూజలు సక్రమంగా జరిపించాలి అని చెప్పారు."
అంతేకూండా.. నేను కన్నెర్రజేస్తే రక్తం కక్కుకొని చస్తారు. కాలం తీరితే అందరూ తప్పనిసరిగా అనుభవించాల్సిందే. నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా. ఈ ఏడాది వర్షాలు తప్పక కురుస్తాయి. పాడి పరిశ్రమ కూడా సమృద్ధిగా ఉంటుంది. మీరు ఐదు వారాలు పప్పు బెల్లాలతో సాక పోయండి. నన్ను ఆనంద పరచండి. మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను.. అని మాతంగి స్వర్ణలత 'రంగం' భవిష్యవాణి చెప్పారు.
Also Read: బోనాలు అంటే ఏంటి? బోనాల 8 ఘట్టాల ప్రత్యేకతలు తెలుసా.!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS