Vangaveeti Mohana Ranga Biography: బెజవాడ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా బయోగ్రఫీ

Vangaveeti Mohana Ranga Biography: ఎంతకాలం బ్రతికామన్నది కాదు… ఎలా బ్రతికామన్నది ముఖ్యం. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అయ్యారు. ఆయనే వంగవీటి మోహన్ రంగా. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి మూడు దశాబ్దాలు దాటినా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతునే ఉంది. సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఏదో సందర్భంలో వంగవీటి మోహన్ రంగా పేరు వినిపిస్తూనే ఉంది. కాపు కుల నాయకుడిగా ముద్రపడినా.. ఆయన అందరివాడు. అణగారిన వర్గాలను సైతం అక్కున చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైనా ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా దూరమై చాలా సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక తరం మారినా.. వంగవీటి మోహన్ రంగా చరిత్ర మాత్రం సజీవంగా ఉండడం ఆయన పోరాట పటిమను తెలియజేస్తోంది. ఎమ్మెల్యేగా మూడున్నరేళ్ల పాటు పదవి చేపట్టినా.. ఇప్పటికీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఉందంటే ఆయన ఎంత ప్రభావశీలుడో అర్ధంచేసుకోవచ్చు. జూలై 4 వంగవీటి మోహన్ రంగా జయంతి.

Vangaveeti Mohana Ranga Biography

వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలోని కాటూరులో  వంగవీటి సీతారామయ్య మరియు వంగవీటి సావిత్రమ్మ దంపతులకు జన్మించారు. ఇతనికి వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు అనే నలుగురు అన్నలు ఉన్నారు. అతను ఐదుగురు సోదరులలో చిన్నవాడు. అతని అన్నలు వంగవీటి శోభనా చలపతి రావు, 1989లో ఉయ్యూరు ఎమ్మెల్యేగా పనిచేశారు మరియు విజయవాడలో ప్రముఖ రాజకీయ వ్యక్తి అయిన రాబిన్‌హుడ్ రాధాగా ప్రసిద్ధి చెందిన వంగవీటి రాధాకృష్ణ రావు సీనియర్. 1974లో రాధ హత్య తర్వాత, రంగా న్యాయం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదరుడి వారసత్వాన్ని కొనసాగించాడు. 

విజయవాడ రాజకీయాలను శాసించిన వంగవీటి మోహన రంగా 1988 డిసెంబర్ 26 న రంగాన పాశవికంగా హత్య చేశారు దుండగులు. అయితే అసలా రోజు ఏం జరిగింది. ఆయన్ను హత్య చేసిన వారు కేసుల నుంచి ఎలా బయట పడ్డారు అనేది నేటి జెనరేషన్ లో చాలా మందికి తెలియదు. రంగా హత్య జరిగి 37 ఏళ్లు అయింది. 

విజయవాడ చరిత్ర మార్చిన ఆ 5 హత్యలు

వంగవీటి రంగా హత్య గురించి తెలియాలంటే విజయవాడలో 18 ఏళ్ల వ్యవధిలో జరిగిన 5 హత్యలు గురించి తెలియాలి. 1972లో కమ్యూనిస్ట్ నాయకుడు చలసాని వెంకట రత్నం హత్య మొదలుకుని 1988లో వంగవీటి మోహన రంగా మర్డర్ వరకూ జరిగిన 5 ప్రధాన సంఘటనలు బెజవాడ చరిత్రలో నెత్తుటి మరకలుగా మిగిలిపోయాయి.

బెజవాడ లో తిరుగులేని లీడర్ గా చలసాని వెంకట రత్నం

1970 దశకం లో విజయవాడ కార్మిక వర్గాలకు పెద్ద దిక్కుగా చలసాని వెంకట రత్నం ఉండేవారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా అప్పట్లో కమ్యునిస్టులు మాత్రమే ఉండేవారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు టాక్సీలు ఎక్కువగా తిరిగే ఆరోజుల్లో టాక్సీ స్టాండులో వచ్చే గొడవల్లాంటివి చలసాని సెటిల్ చేస్తూ ఉండేవారు. ఆయన వద్దనే వంగవీటి మోహన రంగా అన్న వంగవీటి రాధా కృష్ణ ఉండేవారు. చలసాని టీమ్ లో అత్యంత వేగంగా ఎదుగుతూ ఒకానొక దశలో చలసాని వెంకట రత్నంను డామినేట్ చేసేలా రాధా ఎదగడంతో వారి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. ఈ గొడవల కారణంగా 1972 లో వేరే ఊరు వెళ్లి వస్తున్న వెంకటరత్నం హత్య జరిగింది. ఆ కేసులో వంగవీటి రాధా ముద్దాయి.

1974 రాధా హత్య... నమ్మించి మోసం చేసిన సన్నిహితుడు

వెంకట రత్నం హత్య తరువాత వంగవీటి రాధాకు విజయవాడలో ఎదురు లేకుండా పోయింది. ఒక వైపు చలసాని సన్నిహితులు.. కమ్యునిస్టులు రాధా పై పగతో రగిలిపోతున్న సమయంలో... స్టూడెంట్ పాలిటిక్స్ లో కమ్యునిస్టులకు వ్యతిరేకంగా ఉన్న దేవినేని గాంధీ.. నెహ్రూలు వంగవీటి రాధ సాయం కోసం ఆయన పంచకు చేరారు. ఆవిధంగా పుట్టిందే యునైటెడ్ ఇండి పెండెంట్స్ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్. దీన్లో రాధ గౌరవ అధ్యక్షుడిగా ఉంటే, క్రియాశీలకంగా దేవినేని సోదరులు ఉండేవారు. ఇవి ఇలా ఉంటే చలసాని వెంకట రత్నం హత్యతో రగిలిపోతున్న ఆయన సన్నిహితులు వంగవీటి రాధాను చంపడానికి  తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. నెలసరి మామూలు కోసం తమ షాపుకు వచ్చి తీసుకోవాల్సిందిగా నాగళ్ల శివరాం ప్రసాద్ అనే సన్నిహితుడు పిలవడం తో తెల్ వారు ఝామున మ్యూజియం రోడ్డు లోని బాబు ట్రేడర్స్ అనే షాపుకు వెళ్లారు రాధ. ఆయన లోపలకు రాగానే షట్టర్ మూసేసి అక్కడే మాటు వేసిన దుండగులు రాధను ఆయనతో పాటు బయట ఉన్న అనుచరుల్లో కొందరిని హత్య చేశారు. ఇది చలసాని హత్య జరిగిన రెండేళ్ల తరువాత అంటే 1974 లో దానితో అప్పటి వరకూ ఈ గ్రూప్ తగాదాలకు కాస్త దూరంగా ఉంటున్న రాధా సోదరుడు మోహన్ రంగా తప్పనిసరి పరిస్థితుల్లో రాధా బ్యాచ్ కు నాయకత్వం వహించారు

Also Read: వల్లభనేని వంశీ బయోగ్రఫీ

ఫ్రెండ్స్ మధ్య తగాదాలు.. గాంధీ హత్య 1979

రాధా హత్య తరువాత 5 ఏళ్ల పాటు రంగా.. దేవినేని సోదరులు కలిసే ఉన్నారు. ఈలోపు బెజవాడ లో రంగా ఇమేజ్ బాగా పెరిగింది. ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉంటాడు అనే పేరు బాగా పాకిపోయింది. ఆ సమయంలోనే రంగా వివాహం రత్న కుమారి తో జరిగింది. అంతా సవ్యంగా ఉన్న సమయం లో బెజవాడలో ప్రవేటు బస్సుల జాతీయీ కరణ ఉద్యమం ప్రారంభించారు దేవినేని సోదరులు. అయితే ఈ ఉద్యమం పీక్ స్టేజ్ కు వెళ్ళాక రంగా దీనిని ఆపాలని కోరారు అని ఆ స్టేజ్ లో అది కుదరదని తాము చెప్పడంతో తమకూ, రంగాకు మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి అని తరువాతి కాలంలో దేవినేని నెహ్రూ ఒక ఇంటర్ వ్యూ లో చెప్పారు. ఈ గొడవలు బాగా ముదరడం తో 1979 అక్టోబర్ లో సొంతంగా యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరుతో సెపరేట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు దేవినేని సోదరులు. అదే ఏడాది డిసెంబర్ లో ITI కాలేజ్ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ ప్రచారం చేసి వస్తుండగా దేవినేని సోదరులపై దాడి జరిగింది. ఆ సమయంలో లా కాలేజ్ వైపు వెళ్ళిన నెహ్రూ తప్పించుకోగా..లయోలా కాలేజ్ ఓపెన్ గ్రౌండ్ లోకి వెళ్ళిన గాంధీ దొరికిపవడంతో దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సమయం లో అక్కడే ఉన్న దేవినేని నెహ్రూ మరో సోదరుడు దేవినేని మురళి ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి.

Vangaveeti Mohana Ranga with YSR

దేవినేని మురళి హవా... నెల్లూరు నుంచి వస్తుండగా దారుణ హత్య

అన్న హత్యతో రగిలిపోతున్న దేవినేని సోదరులు ప్రతీకారం కోసం ట్రై చేస్తుండగా... ఆ గొడవల్లో రంగా.. నెహ్రూ ఇద్దరూ జైలుకు వెళ్లారు. విజయవాడలో రెండు గ్రూపు లకు మధ్య వర్తిగా ఉండే కర్నాటి రామ్మోహన్ రావు అనే లాయర్ రెండు గ్రూపులకు రాజీ కుదిర్చారు. దీనికి నెహ్రూ ఒప్పుకున్నా మురళి మాత్రం ప్రతీకారం కోసం ట్రై చేస్తూనే వచ్చారు. దానిలో భాగంగా తన అన్న గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని మురళి వర్గం తుడిచి పెట్టేసింది అంటారు అప్పటి చరిత్ర తెలిసిన వాళ్ళు. ఈ మధ్య లో NtR తెలుగుదేశం పార్టీ పెట్టడం అందులో చేరిన దేవినేని నెహ్రూ MLA కావడం జరిగిపోయింది. మరోవైపు వంగవీటి రంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి MLA గా గెలిచారు. అదే సమయంలో రంగా ఇంటికి ఫోన్ చేసి మరీ మురళి బెదిరించారు అనేవారు కూడా ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో 1988 మార్చ్ 10న నెల్లూరు లో లా పరీక్షలు రాసి విజయవాడ వస్తున్న దేవినేని మురళి వ్యాన్ ను ట్రక్కు తో గుద్ది.. మురళి తేరుకునే లోపులోనే 20 మంది ఒక్కసారిగా దాడిచేసి మురళిని ఆయన స్నేహితులు నలుగురిని దారుణంగా నరికి చంపారు. ఆ ఘటనలో ఉన్న  మురళి స్నేహితుల్లో మరో ఇద్దరు మాత్రం ప్రాణాలతో తప్పించుకున్నారు. ఆ సమయం లో రంగాకు ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు అనే ఎలిబీ ఉండగా... ఆయన బంధువులు, అనుచరులపై మాత్రం హత్య కేసు నమోదైంది.

1988 డిసెంబర్ 26... రంగా హత్యకు ప్లాన్

అధికార పార్టీ MLA సోదరుడు హత్యకు గురి కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. విజయవాడ లో కమిషనర్ ఆఫీస్ ఏర్పాటైంది. వ్యాస్ IPS ప్రధాన అధికారిగా లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తేవడానికి కఠిన చర్యలు మొదలు పెట్టారు. మరోవైపు రంగా ఇమేజ్ అణగారిన వర్గల్లో ఎంతగా పెరుగుతుందో... అదే స్థాయిలో శత్రువులు పెరిగిపోతూ వచ్చారు. రంగా కు ఏ క్షణంలో నైనా ఆపద జరగొచ్చు అనే అభిప్రాయానికి బెజవాడ వాసులు వచ్చేశారు. మరోవైపు  రంగా కాపునాడు మహాసభ ను సక్సెస్ చేశారు. దానితో  గోదావరి జిల్లాల్లో సైతం రంగా కు ఇమేజ్ పెరిగింది. అదే సమయంలో విజయవాడ లోని సున్నపు బట్టీల సెంటర్ వద్ద పేదలు తమ ఇళ్ళ స్థలాల పట్టాల కోసం ఆందోళన మొదలెట్టారు. వారికి మద్దతుగా వెళ్తున్న వంగవీటి మోహన రంగాను పోలీసులు రోడ్డుపై నిలిపివేయడంతో అక్కడికక్కడే ధర్నాకు దిగారు. అయితే... ట్రాఫిక్ కు అడ్డం అవుతుంది అని ధర్నా స్థలాన్ని తన ఇంటికి ఎదురుగా బందరు రోడ్డుకు మార్చారు. తన ప్రాణాలకు రక్షణ ఇవ్వడం లేదు అంటూ వంగవీటి మోహన రంగా చేస్తున్న దీక్షకు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకుల నుండి మద్దతు లభించింది. అయితే... ఈ దీక్ష సమయం లోనే రంగాను అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే పుకార్లు కూడా పెద్ద యెత్తున మొదలయ్యాయి. దాంతో రంగా దీక్షా శిబిరంలో ఎప్పుడూ జనం ఎక్కువగానే ఉంటూ వచ్చారు. 

డిసెంబర్ 26న... క్రిస్మస్ పండుగ ముగిసిన కారణంగా జనాలు దీక్ష శిబిరంలో పెద్దగా లేరు. ఆ సమయంలో బెంజ్ సర్కిల్ వైపు నుండి వేగంగా వచ్చి ఆగిన బస్సు నుండి అయ్యప్ప దీక్ష దుస్తుల్లో ఉన్న కొందరు వేగంగా దిగి శిబిరం పొగ బాంబులు... విసురుతూ రంగాను పాశవికంగా నరుకుతూ హత్య చేశారు. రంగా ప్రక్కనే నిద్ర పోతున్న మరో వ్యక్తి ని కూడా అక్కడికక్కడే నరికి చంపారు. ఈ ఘటన తెల్లవారు ఝామున 3గంటలు దాటాక జరిగింది. రంగాను హత్య చేసి బస్సులో వెళ్ళిపోతున్న హంతకులను పట్టు కోవడానికి ప్రయత్నం చేసిన ఒక మూగ యువకుడ్ని కూడా బస్సులోకి లాగి హత్య చేశారు దుండగులు. 

భగ్గుమన్న బెజవాడ... భారీగా ధన, ప్రాణ నష్టం

రంగా హత్యతో విజయవాడ భగ్గుమంది. రంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన కు దిగారు. అప్పుడు జరిగిన గొడవలో ఆ రోజుల్లోనే 100 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అని చెబుతుంటారు. రెండు నెలల వరకూ విజయవాడలో కర్ఫ్యూ పెట్టారు. 100కు పైగా పోలీస్ జీపులు... 600 పైన వాహనాలు ధ్వంసం అయ్యాయి అని వార్తా కథనాలు ప్రసారం అయ్యాయి.

ఇంతకూ రంగాను చంపింది ఎవరు?

రంగాను హత్య చేసింది ఎవరు ? ఈ ప్రశ్న ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. రంగా వర్గం దీనిని దేవినేని నెహ్రూ వర్గం చేసిన హత్యగా చెబుతుంటారు. మరికొంత మంది రంగా సన్నిహితులు దీని వెనుక నాటి ప్రభుత్వం హస్తం ఉందని చెబుతారు. కానీ ఏదీ స్పష్టంగా తెలియరాలేదు. ఈ హత్య కారణంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన దేవినేని నెహ్రూ తరువాత పోలీసులకు లొంగిపోగా.. అప్పటి హోం మంత్రి కోడెల శివ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో పోలీసులు A1 గా విజయవాడ కు చెందిన అబ్బులు అనే వ్యక్తిని  చేరిస్తే అందులో కుట్ర దారునిగా దేవినేని నెహ్రూ ను A 21 గా నమోదు చేశారు. 

అయితే... అప్పటికే దేవినేని మురళి హత్యలో కేసులు ఎదుర్కొంటున్న వంగవీటి వర్గం.. దేవినేని వర్గం కూర్చుని రాజీ కు రావడం తో రెండు వర్గాలు ఒకరిపై నమోదు చేసిన కంప్లైంట్ లను వెనక్కు తీసుకున్నారు. ఇది స్వయంగా దేవినేని నెహ్రూ అనంతర కాలంలో చెప్పుకొచ్చారు. దానితో రంగా మర్డర్ లో కేసులు ఎదుర్కొంటున్న నిందితులు అందరూ సాక్ష్యా ధారాలు లేని కారణంతో బయటకు వచ్చేశారు. వారిలో కొందరు తరువాత కాలంలో రాజకీయాల్లో కూడా ఎదిగారు. ఈ కేసులు ఎదుర్కొన్న వారు మాత్రమే కాకుండా... కనిపించని వ్యక్తులు... పెద్ద స్థాయిలో వేసిన పథకమే వంగవీటి రంగా హత్య అని ఇప్పటికీ బెజవాడ వాసుల నమ్మకం.

Also Read: విడదల రజిని బయోగ్రఫీ

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS



Post a Comment (0)
Previous Post Next Post