Bonalu Festival 2025: బోనాలు అంటే ఏంటి? బోనాల 8 ఘట్టాల ప్రత్యేకతలు తెలుసా.!

Bonalu Festival 2025: తెలంగాణ అంతటా భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ ప్రారంభమైంది. ఈ సంవత్సరం 2025లో, జూన్ 29వ తేదీ ఆదివారం నుంచి ఈ పండుగ ఉత్సవాలు మొదలయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈ వేడుకలు అత్యంత అట్టహాసంగా నిర్వహించబడుతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగలో మహాకాళి దేవిని పూజించి, బోనాలు సమర్పించడం ద్వారా భక్తులు తమ ఆరాధనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మహాకాళిని నమ్మే భక్తులు అమ్మవారికి పూజలు చేస్తూ, భక్తితో బోనాలను సమర్పిస్తారు. ప్రతి ఏడాది జరిపే ఈ పండుగ 2025లో జూన్ 29న మొదలై, జూలై 20న ముగియనుంది. ఆదివారంతో ప్రారంభమై ఆదివారంతోనే ముగియడం ఈ బోనాల పండుగ ప్రత్యేకత.

Bonalu Festival

బోనం అంటే ఏంటి?: 'బోనం' అంటే అసలు అర్థం తెలుగులో భోజనం. ఇది దేవతలకు సమర్పించే నైవేద్యం. బోనం తయారీకి బెల్లంతో కలిపిన అన్నాన్ని కొత్త మట్టి లేదా ఇత్తడి కుండెలో వండి, వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. బోనంపైన దీపం పెట్టి, మహిళలు వాటిని తలపై మోసుకుని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పండుగను రాష్ట్రపండుగగా కూడా ప్రకటించడం జరిగింది.

లష్కర్ బోనం అంటే ఏంటి?: అప్పట్లో సికింద్రాబాద్ బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉండేది. దీనిని లష్కర్ అని అంటారు. ఇప్పటికీ ఈ కారణంగా అక్కడ వారు లష్కర్ బోనాలు అని అంటుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం గోల్కొండ కోటలో బోనాలు మొదలై, లాల్ దర్వాజ సింహ వాహిని బోనాలతో ఈ ఉత్సవం ముగుస్తుంది.

చరిత్ర: 1813లో, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భయంకరమైన ప్లేగు అనే అంటువ్యాధి వ్యాప్తి చెందింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రజలు మహాకాళిని పూజించి, రక్షణ కోరారు. వ్యాధి తగ్గిన తర్వాత, వారు కృతజ్ఞతగా మహాకాళి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచే బోనాల సంప్రదాయం మొదలైంది.

బోనాల ఉత్సవాల్లో ప్రత్యేకతలు: ఈ పండుగ సమయంలో మహిళలు సంప్రదాయ వేషధారణలో ముస్తాబై, బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తారు. కొంతమంది మహిళలపై అమ్మవారి శక్తి ఆవహించిందని నమ్ముతూ, వారి పాదాలపై నీళ్లు చల్లుతారు. ఇది ఆ శక్తిని శాంతపరచే రీతిగా భావిస్తారు.

ఈ పండుగలో మొత్తం ఎనిమిది ముఖ్య ఘట్టాలు ఉంటాయి

1. ఘటోత్సవం: బోనాల ప్రారంభ దినం నుంచి 14 రోజుల పాటు రోజూ రెండు సార్లు అమ్మవారికి ఘటోత్సవం నిర్వహించబడుతుంది. 2025లో జూన్ 26న ఈ ఘట్టం ప్రారంభమైంది. అమ్మవారిని ఒక కలశంలో ఆవాహన చేసి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ కలశం వద్ద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి, షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. ఆలయ పూజారి శరీరానంతా పసుపు పూసుకుని, భక్తుల మద్యలో అమ్మవారి ప్రతినిధిగా నడుస్తారు.

2. బోనాలు సమర్పించడం: బోనం అంటే ‘భోజనం’ అనే అర్థం. భక్తులు అమ్మవారికి చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, అన్నం వంటి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇల్లు శుభ్రం చేసి, తల స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, నైవేద్యం సిద్ధం చేస్తారు. బోనాన్ని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి దీపం వెలిగించి ఆలయానికి తీసుకెళ్తారు.

3. వేపాకుతో సమర్పణ: వేపాకు ఔషధ గుణాలతో నిండినది. పసుపు నీటిలో ముంచిన వేపాకుతో బోనాన్ని అలంకరించడం సంప్రదాయంలో ఒక భాగం. ఇది వర్షాకాలంలో వ్యాప్తి చెందే క్రిములను నివారించడానికి ఉపయోగపడుతుంది. వేప చెట్టు అమ్మవారికి ప్రీతికరమైనదిగా భావిస్తారు.

Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?

4. ఫలహార బండి: బోనాల రోజు భక్తులు నియమ నిష్టలతో తయారు చేసిన నైవేద్యాలను తీసుకొచ్చి పెద్ద బండ్లలో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనిని ఫలహార బండి ఉత్సవం అంటారు. ఇది అమ్మవారికి సమర్పించే సాంప్రదాయమైన నైవేద్యాల ఘట్టం.

5. పోతురాజు వీరంగం: పోతురాజు, ఏడుగురు అమ్మవార్లకు సోదరుడిగా భావిస్తారు. బోనాల ఊరేగింపులో పోతురాజు స్వామిదే ప్రధాన ఆకర్షణ. పసుపు పూసుకుని, గజ్జెలు కట్టుకుని, వేపాకు మండలు చేత పట్టుకుని, ఎర్రటి వస్త్రం ధరించి, చేతిలో పసుపు రంగు కొరడా పట్టుకుని నాట్యం చేస్తాడు. పోతురాజు, ఫలహార బండికి రక్షణగా ముందు నడుస్తాడు.

Bonalu Festival 2025

6. రంగం: బోనాల చివరి రోజు జరిగే ముఖ్య ఘట్టం రంగం. ఇందులో ఓ మహిళ, మట్టి కుండపై నిలబడి అమ్మవారి శక్తిని తనలో ఆవాహన చేసుకుని భవిష్యవాణి చెబుతుంది. ఈ భవిష్యవాణిలో రాజకీయాలు, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రకృతి విపత్తులు వంటి విషయాలపై అమ్మవారు సందేశం అందిస్తుందని భక్తుల నమ్మకం.

7. బలి: రంగం ముగిసిన మరుసటి రోజు పోతురాజులు తాండవం చేస్తారు. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి కూరగాయలను పగులగొట్టి అమ్మవారికి బలిగా అర్పిస్తారు. అయితే ఇటీవలి కాలంలో జంతు బలి చేయడం సంప్రదాయానికి విరుద్ధంగా మారింది.

8. సాగనంపుట (నిమజ్జనం): ఉత్సవాల ముగింపుగా, అమ్మవారి చిత్రపటాన్ని కలశాలతో అలంకరించి, మంగళవాయిద్యాల నడుమ ఏనుగుపై ఊరేగించి నదిలో నిమజ్జనం చేస్తారు. ఇది అమ్మవారి శక్తిని తిరిగి ప్రకృతిలో కలిపే విధంగా భావిస్తారు.

ఈ ఎనిమిది ఘట్టాల ద్వారా అమ్మవారి ఆరాధన మాత్రమే కాక, ప్రజల మానసిక ఉల్లాసం, శక్తి, సమైక్యత కూడా ప్రతిఫలిస్తుంది.

2025 బోనాల ముఖ్యమైన తేదీలు ఇవే.. 

ఆషాడంలో మొదటి గురువారం నుంచి ఈ బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాదిలో జూన్ 26వ తేదీన గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఇస్తారు. జూన్ 29వ తేదీన విజయవాడ కనకదుర్గకు 2వ బోనం సమర్పిస్తారు. 3వ బోనాన్ని జూలై 3వ తేదీన, నాల్గవ బోనాన్ని జూలై 6వ తేదీన పెద్దమ్మ తల్లికి అందిస్తారు. 5వ బోనం జూలై 10వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి సమర్పిస్తారు. 

జూలై 13వ తేదీన సికింద్రాబాద్​లో బోనాల జాతర చేస్తారు. జూలై 14వ తేదీన అమ్మవారి ఊరేగింపు చేస్తారు. 15వ తారీఖున చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బోనం సమర్పిస్తారు. 17వ తేదీన లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పిస్తారు. 20వ తేదీన పాతబస్తీ, లాల్ దర్వాజాలో బోనాల జాతర చేస్తారు. 21వ తేదీన పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు చేసి బోనాలు ముగిస్తారు. 

బోనాలు పండుగ తెలంగాణ ప్రజల భక్తి, ఆనందం, సంప్రదాయానికి ప్రతిబింబం. బోనాలు అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అమ్మవారి మీద పెట్టుకున్న నమ్మకం. ప్రతి సంవత్సరం ఈ పండుగతో ప్రజల హృదయాల్లో ఉత్సాహం, నమ్మకం, ఆధ్యాత్మికత పెరుగుతూనే ఉంది.

Also Read: ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS



Post a Comment (0)
Previous Post Next Post